close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పంచసూత్ర ప్రణాళిక!

పండగ ఖర్చుకు

పండగ వస్తుంది.. వెళ్తుంది! కానీ సంబరానికి అయిన అప్పు మాత్రం అలానే మిగిలిపోతుంది. ఒక్కోసారి ఆ పండగ ఖర్చు భారంగానూ మారిపోతుంది. అలా జరగకూడదంటే... మీకో పండగ ప్రణాళిక కావాలి. అది పంచసూత్రాలతో ఉండాలి... ఇలా చేసి చూడండి...

పేపర్‌పై పెట్టండి...

చూపులు పక్కకు వెళితే బడ్జెట్‌ చేయి దాటుతుంది. అలా కాకూడదంటే పక్కాప్రణాళిక కావాలి. ఎవరెవరికి ఏమేం కావాలో పేపర్‌పై రాసుకోండి. ఎంత బడ్జెట్‌ అవుతుందో ఒక జాబితా సిద్ధం చేయండి. ఖర్చు మించిపోతుందంటే ఏది ఆపాలో నిర్ణయించుకోండి.ఇంటికి ఎంత మంది బంధువులు రావొచ్చు, అతిథి మర్యాదలకు ఎంత అవుతుందో రాసిపెట్టుకోవాలి.

డబ్బులు ఊరికే రావు...

షాపింగ్‌ విషయంలో బేరాలు ఆడటానికి మొహమాటపడొద్ధు పొదుపు చేయడం సంపాదించడంతో సమానం. ఎవరో పెద్ద మనిషి అన్నట్లు డబ్బులు ఊరికే రావు కదా. ఎక్కువ కాలం వాడతాం అనుకున్న వస్తువుల విషయంలో ధర ఎక్కువైనా బ్రాండెడ్‌వి కొనడమే ఉత్తమం. ధర తక్కువ కదా అని ఇప్పుడు నాణ్యత లేనివి కొంటే... మళ్లీ మళ్లీ కొనాల్సి వస్తుంది. అది మనకు నష్టమే కదా.

ఆఫర్లు చూశారా...

క్లియరెన్స్‌ స్టాక్‌ కారణంగా ముందు రోజు లేదా పండగ రోజు కొంటే కొంత సొమ్ము ఆదా అవుతుంది. పండగల వేళ ఈ-కామర్స్‌ సైట్లతో పాటు స్థానిక షాపింగ్‌ మాల్స్‌ కూడా ఆఫర్లు ఇస్తుంటాయి. అటువంటి వాటిని ఆ ఆఫర్ల తేదీల్లోనే కొంటే కొంత కలిసివస్తుంది. పక్కాగా రాసుకుని.. దాని ప్రకారం షాపింగ్‌ చేస్తే కొంత మేర ఆదాకు వీలుంటుంది.

ఇలా ప్రయత్నించండి..

పండగకోసం ప్రత్యేకంగా అలంకరణ వస్తువులు కొనాలనుకోవడం మంచిది కాదు. ఇలాంటివి డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌ పద్ధతిలో ఇంట్లోనే తయారుచేసుకోవచ్ఛు ఇందుకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో చాలా ఉంటాయి. ఖర్చు ఆదా అవుతుంది. మనం తయారు చేశామన్న సంతృప్తి కూడా ఉంటుంది.

పండగ నిధి ఉందా...

పండగల విషయంలో ముందుజాగ్రత్త అవసరం. ఎప్పుడు ఏం కొనాలి? ఎవరికి కొనాలి? ఎంతలో కొనాలి? అనేవి ముందుగానే నిర్ణయించుకోవాలి. ఆ మేరకు పండగ నిధి పేరుతో కొంత సొమ్ము పక్కనపెట్టాలి. ఇందుకు ఒక సేవింగ్స్‌ ఖాతాలో మీకు వీలైనపుడల్లా కొంత డబ్బు వేస్తూ ఆదా చేయాలి. మీ బడ్జెట్‌ను ఈమేరకు రూపకల్పన చేసుకోవాలి. అప్పుడు ఏ ఇబ్బందీ రాదు. దుబారా ఉండదు.


మరిన్ని