close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బయటి పేలుళ్లా.. లోపలి లోపాలా?

  కల్వకుర్తి పంపుహౌస్‌ ప్రమాదానికి కారణమేంటి?
  ఇప్పుడే చెప్పలేమంటున్న అధికారులు
  వ్యక్తమవుతున్న అనుమానాలు

ఈనాడు హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం చేసిన పేలుళ్ల వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌కు నష్టం వాటిల్లిందా? లేక పంపుహౌస్‌లోనే పంపుసీల్స్‌, రిటర్న్‌ వాల్స్‌ దెబ్బతినడం వల్ల నీట మునిగిందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి పంపుహౌస్‌ను తొలుత నిర్ణయించినట్లుగా కాకుండా మార్చి చేపట్టడం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పంపుహౌస్‌కు 300 మీటర్ల దూరంలోనే పేలుళ్లు చేపట్టాల్సి ఉంటుందని, దీంతో పంపుహౌస్‌కు నష్టం జరిగే అవకాశం ఉందని 2016లోనే నీటిపారుదల శాఖ నియమించిన నిపుణుల కమిటీ నివేదించింది. దేవాదుల ఎత్తిపోతలలో 800 మీటర్ల దూరంలో ఉన్న రామప్ప ఆలయానికి సొరంగం పేలుళ్ల వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడా ప్రమాదం ఉందంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పంపుహౌస్‌ నిర్మాణ ప్రాంతాన్ని 300 మీటర్ల దగ్గరకు మార్చడం వల్ల, అదీ భూగర్భ పంపుహౌస్‌ కోసం పేలుళ్లు చేపట్టడం వల్ల సమస్య రావొచ్చని హెచ్చరించింది. కల్వకుర్తి పంపుహౌస్‌ నిర్మాణ సంస్థ,  ఇంజినీర్లు దీనిపై  నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు  లేఖలు రాశారు. దీనిపై బెంగళూరుకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌మెకానిక్‌ నిపుణులతో నీటిపారుదల శాఖ అధ్యయనం చేయించింది. కల్వకుర్తి వద్ద సీస్మోగ్రాఫిక్‌ మీటర్‌ను ఏర్పాటు చేసి నిర్ణీత పరిధిలో పేలుళ్లు చేయాలంటూ, డిజైన్‌ మార్పునకే మొగ్గుచూపారు.
  మొదట 1250 మీటర్ల దూరంలో..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మొదటి లిప్టును ఓపెన్‌ పంపుహౌస్‌గా, కల్వకుర్తి పంపుహౌస్‌కు 1250 మీటర్ల దూరంలో చేపట్టేలా డిజైన్‌ చేసి ఆమోదించారు. తర్వాత దీని డిజైన్‌ మార్చి భూగర్భ పంపుహౌస్‌గా చేపట్టారు. ఇది కల్వకుర్తి పంపుహౌస్‌కు 300 మీటర్ల దూరంలో ఉంది. శ్రీశైలం వెనక జలాల నుంచి నీటిని తీసుకొనే అప్రోచ్‌ ఛానల్‌ దూరం పెరిగింది. దీనిపై 2016 జూన్‌లో స్టీరింగ్‌ కమిటీ చర్చించగా.. డిజైన్‌మార్పుపై  అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అప్పటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  ఓ కమిటీని నియమించారు. సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, పాలమూరు-రంగారెడ్డి ప్రత్యేక అధికారి, ఆ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్లతో కూడిన కమిటీ 2016 జులై 1న నివేదిక ఇచ్చింది. శ్రీశైలం లాంటి భారీ రిజర్వాయర్‌ పక్కన భూగర్భ పంపుహౌస్‌ అంత మంచిది కాదని, శ్రీశైలం వెనక జలాల్లో 1.25 కి.మీ.కు బదులు 2.5 కి.మీ అప్రోచ్‌ ఛానల్‌ తవ్వాలని కమిటీ పేర్కొంటూ.. ప్రత్యామ్నాయ డిజైన్‌ను తిరస్కరించింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిక్స్‌కు చెందిన ఇద్దరు నిపుణులతో అధ్యయనం చేయించారు. రెండో నిపుణుడి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పంపుహౌస్‌ నిర్మాణ స్థలాన్ని మార్చి  భూగర్భ పంపుహౌస్‌గా కల్వకుర్తికి సమీపంలో చేపట్టారు.
  నీటిని తోడిన తర్వాతే అంచనా..
కల్వకుర్తి పంపుహౌస్‌లో  నీటిని  తోడిన తర్వాతనే నష్టం ఎలా జరిగిందన్న దానిపై అంచనాకు వచ్చే అవకాశం ఉంది. 2014లో కల్వకుర్తి పంపుసీల్‌ ఊడిపోవడం వల్ల పంపుహౌస్‌కు నష్టం వాటిల్లింది. ఇప్పుడు కూడా పంపుసీల్స్‌ పోవడం వల్ల కానీ లేదా రిటర్న్‌ వాల్‌ దెబ్బతినడం వల్ల గానీ కనెక్షన్‌ ఊడిపోయి నష్టం వాటిల్లి ఉండొచ్చన్న అనుమానం ఉంది. అయితే ఈ రెండు కారణాలతోనేనా లేక పాలమూరు పంపుహౌస్‌ కోసం చేసిన పేలుళ్ల వల్ల జరిగిందా అన్నది నీటిని తోడిన తర్వాత గానీ ఓ అంచనాకు రాలేమని సంబంధిత వర్గాలు తెలిపాయి.కల్వకుర్తి పంపుహౌస్‌ 800 అడుగుల వద్ద ఉండగా, శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటిమట్టం ఉంది. పంపుహౌస్‌లో నీటిని తోడటానికి రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అంచనాకు వచ్చింది. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి శనివారం కల్వకుర్తి పంపుహౌస్‌ను పరిశీలించారు.
  పరిమితి కంటే తక్కువగానే ప్రకంపనలు..
పాలమూరు పంపుహౌస్‌కోసం చేసే బ్లాస్టింగ్‌ ప్రభావాన్ని అంచనా వేయడానికి గతంలో కల్వకుర్తి పంపుహౌస్‌ వద్ద సీస్మోగ్రాఫిక్‌ మీటర్‌ను ఏర్పాటు చేశారు. 8 నెలలుగా పేలుళ్ల వల్ల వచ్చే ప్రకంపనలను ఇది రికార్డు చేస్తోంది. నిర్ణీత పరిమితి కంటే ప్రకంపనల తీవ్రత తక్కువగానే ఉందని , దీనిని బట్టి పాలమూరు పంపుహౌస్‌ పనులకోసం చేసిన పేలుళ్లు ముంపునకు కారణం కాకపోవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.  అమోనియం ఎక్కువగా వినియోగించి ఓపెన్‌బ్లాస్టింగ్‌ చేయడం వల్లే ప్రకంపనలు ఎక్కువ దూరం వ్యాపించి ప్రమాదానికి కారణమయ్యాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు