Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
Top Ten News @ 9 PM

1. అంచనాలకు ఆమోదం తెలపండి: జగన్‌

ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.76లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఇందుకోసం 68,381 ఎకరాల భూమిని సేకరించామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ వల్ల 17,005 కొత్త కాలనీలు ఏర్పడ్డాయన్నారు. ఈ ఏడాది కొత్తగా 15లక్షలకు పైగా ఇళ్లు కడుతున్నామని, మొత్తంగా 28.30లక్షల ఇళ్లు పేదల కోసం నిర్మిస్తున్నామని సీఎం వివరించారు. 17,005 కొత్త కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు రూ.34,109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్న సీఎం.. ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం కష్టసాధ్యమన్నారు. 

2. TS NEWS: తెలంగాణలో భూముల అమ్మకం

నిధుల సమీకరణ కోసం భూములను విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం .. అందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. మంత్రివర్గం నిర్ణయం మేరకు వివిధశాఖల వద్ద ఖాళీగా ఉన్న  భూముల అమ్మకానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. వివిధ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూముల  విక్రయం కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. భూములు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ కమిటీలను ప్రభుత్వం నియమించింది.

Ts News: కొత్తగా 1,798 కరోనా కేసులు 
TS NEWS: 14న భాజపాలోకి ఈటల

3. తిరుమలలో గదుల బుకింగ్‌ మరింత సులభం

తిరుమలలో అద్దె గదుల కోసం సాధారణ భక్తులకు ఇక్కట్లు తప్పనున్నాయి. గదుల కేటాయింపును మరింత సులభతరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు ఆరు చోట్ల రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జీఎన్‌సీ, బాలాజీ బస్టాండ్‌, కౌస్తుభం, రామ్‌ భగీచ, ఎంబీసీ, సీఆర్‌వో వద్ద రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా గదుల సమాచారం చేరుతుంది. ఎస్‌ఎంఎస్‌ వచ్చిన వెంటనే భక్తులు నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాటు చేశారు.

4. ‘సెల్‌ఫోన్ల వల్లే అమ్మాయిలపై అత్యాచారాలు’

మొబైల్‌ఫోన్ల వల్లే అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని ఉత్తర్‌ప్రదేశ్‌ మహిళా కమిషన్‌ సభ్యురాలు మీనాకుమారి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అమ్మాయిలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదు. వారంతా అబ్బాయిలతో గంటల తరబడి ఫోన్లలో మాట్లాడి.. సాన్నిహిత్యం ఏర్పడ్డాక అబ్బాయిలతో వెళ్లిపోతున్నారు. ఈ విషయాలేవీ అమ్మాయిల కుటుంబసభ్యులకు తెలియవు. కనీసం వారు వాళ్ల ఫోన్లను చెక్‌ చేయరు. మహిళలపై జరుగుతున్న నేరాల గురించి సమాజం తీవ్రంగా ఆలోచించాలి. అలాగే తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లులు ఇంట్లో వారి కుమార్తెలను కనిపెట్టుకుని ఉండాలి’’ అని ఆమె పేర్కొన్నారు. 

5. తిరిగొచ్చేసరికి 9 మంది చనిపోయారు..

రాత్రి 11 గంటలు.. ఇంట్లో పాలు నిండుకున్నాయి. తెల్లారగానే ఛాయ్‌ తాగనిదే రోజు మొదలవదు. ఇదిగో నేను పాలు తీసుకుని వస్తా అంటూ బయల్దేరాడు ఆ ఇంటిపెద్ద. దగ్గరలోకి దుకాణంలో పాలు తీసుకుని తిరిగొచ్చేసరికి ఊహించని దృశ్యం కళ్లముందు కన్పించింది. అప్పటిదాకా తాను నివసిస్తున్న భవనం  కుప్పకూలి తనవారినంతా బలితీసుకుంది. ఆ ప్రమాదం నుంచి క్షణకాలంలో బయటపడిన తన అదృష్టానికి ఆనందపడేలోపే.. 9 మంది కుటుంబసభ్యులను మింగేసి దురదృష్టం వెక్కిరించింది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగిన ఘోర ప్రమాదంలో భార్యా, పిల్లలను కోల్పోయిన రఫీఖ్‌ షేక్‌ వేదన వర్ణనాతీతం. 

6. Covid: మురుగునీటిలో వైరస్‌ను గుర్తించే సెన్సార్‌!

కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన వైరస్‌ను మురుగునీటిలో గుర్తించే నూతన విధానాన్ని బ్రిటన్‌, భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు. తద్వారా వైరస్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడం ఆరోగ్యశాఖ అధికారులకు చాలా తేలిక అవుతుందని రూపకర్తలు పేర్కొన్నారు. కొవిడ్‌-19ను నిర్ధారించుకునేందుకు భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ఆర్‌టీపీసీఆర్‌తో పాటు యాంటీజెన్‌ పరీక్షలను చేపడుతున్నారు. ముఖ్యంగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షకు ప్రత్యేకమైన ల్యాబ్‌లు, శిక్షణ పొందిన నిపుణులు అవసరం కావడంతో కచ్చితమైన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతోంది.

7. Mask must: మాస్క్‌ ఇలాగే వాడుతున్నారా?

ఊసరవెల్లిలా పలు రకాలుగా విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దాదాపు ఏడాదిన్నరకి పైగా ప్రభుత్వాలు/ ప్రజలు ఈ కనిపించని శత్రువుతో పోరాడుతూనే ఉన్నారు. ఈ మహమ్మారిపై పోరాటంలో ప్రస్తుతం మన ముందున్న అస్త్రాలు మాస్క్‌లు.. టీకాలే. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నప్పటికీ.. అందరికీ టీకా అందాలంటే చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్‌లు సరిగా, తప్పనిసరిగా ధరించాలని ఆరోగ్య రంగ నిపుణులు, ప్రభుత్వాధినేతలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్క్‌ను సరిగా ధరిస్తే ఏ వేరియంట్‌ వైరస్‌నైనా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

8. Anand Mahindra: కరోనా అంతమైన రోజు..నా ఫీలింగ్ అదే!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసే పోస్టుల్లో ఆలోచన, హాస్యం మిళితమై ఉంటాయి. ప్రస్తుతం కరోనా గురించి ఆయన పెట్టే పోస్టులు అలాగే ఉంటున్నాయి.  మహమ్మారి అడుగుపెట్టిన దగ్గరి నుంచి ఒక దగ్గర కూర్చొని చెప్పుకునే ముచ్చట్లు లేవు. స్వేచ్ఛగా గాలి పీల్చుకునే పరిస్థితి లేదు. బంధువుల ఇళ్లకు వెళ్లి గడిపే సందర్భాలు లేవు. అందుకే ఆనాటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయా అని ప్రతిఒక్కరు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ జాబితాలో మహీంద్రా కూడా ఉన్నారంటే అతిశయోక్తి ఏమీ లేదు. తాజాగా మహీంద్రా తన మనసులో మాటను ఫన్నీ పోస్టుతో బయటపెట్టారు.

9. తిరిగి..తిరిగి ‘తృణమూల్‌’ గూటికేనా..?

ఎన్నికలకు ముందు పశ్చిమ్‌బెంగాల్‌ రాజకీయాల్లో వరుస సంచలనాలు. సువేందు అధికారి సహా చాలా మంది కీలక నేతలు అధికార తృణమూల్‌ పార్టీని వీడారు. అయినా  అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఏ మాత్రం వెరవలేదు. మొత్తం 294 స్థానాలకుగానూ 211 చోట్ల గెలుపొంది.. తృణమూల్‌ అఖండ విజయం సాధించింది. దీంతో గతంలో పార్టీని వీడిన చాలా మంది నేతలు తిరిగి అదే గూటికి చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు దీదీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అన్నింటికంటే ముఖ్యంగా భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ తిరిగి తృణమూల్‌లో చేరుతారనే ఊహాగానాలు ఇటీవల ఎక్కువయ్యాయి. 

10. Myanmar:సైనిక విమానం కూలి 12మంది మృతి 

మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మిలటరీ విమానం కూలిన ఘటనలో 12మంది దుర్మరణం చెందారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. న్యాపిడా నుంచి పైన్‌ ఓ -ఎల్విన్‌ పట్టణానికి వెళ్తుండగా జరిగిన ఈ విషాద ఘటనలో ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసితో పాటు మొత్తం 12మంది ప్రాణాలు కోల్పోయారు. పైన్‌ ఓ- ఎల్విన్‌ పట్టణంలోని కొత్త మఠం శంకుస్థాపన చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు మిలటరీ సిబ్బందితో పాటు ఇద్దరు బౌద్ధమత సన్యాసులు, ఆరుగురు భక్తులు ఉన్నారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo