close

తాజా వార్తలు

బాలాకోట్‌ ఆపరేషన్‌ పైలట్లకు పతకాలు

దిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఐదుగురు పైలట్లు వాయుసేన పురస్కారాలకు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని జైషే  మహ్మద్‌ ఉగ్ర శిబిరాలపై అత్యంత సాహసోపేతంగా  బాంబులు జారవిడిచినందుకు ప్రభుత్వం వారిని వాయుసేన పతకాలతో సత్కరించనుంది. యుద్దభూమిలో ప్రణాళిక ప్రకారం విధులను సక్రమంగా పూర్తిచేసిన వారిని ఈ వాయుసేన పతకాలతో సత్కరిస్తారు. ఈ పతకాలు పొందిన పైలట్లలో వింగ్‌ కమాండర్‌ అమిత్‌ రంజన్‌, స్క్వాడ్రన్‌ లీడర్స్‌ రాహుల్‌ బసోయ, పంకజ్‌ భుజడే, బీకేఎన్‌ రెడ్డి, శశాంక్‌ సింగ్‌లు ఉన్నారు. వీరందరినీ ఆగస్టు 15, స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రభుత్వం పతాకాలతో సత్కరించనుంది. 

ఈ ఏడాది ఫిబ్రవరి 14న జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు పుల్వామాలో దాడి చేసి 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను బలిగొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫిబ్రవరి 26 భారత వైమానిక దళం బాలాకోట్‌లో జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది. ఐఏఎఫ్‌కు చెందిన మిరాజ్‌ 2000 యుద్ద విమానాలు పాక్ గగనతలలోకి దూసుకెళ్లి బాలాకోట్‌పై బాంబుల వర్షం కురిపించాయి.  ఆ సమయంలో భారత్‌, పాక్‌ మధ్య యుద్ధానికి దారి తీసే పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ మరుసటి రోజే ఫిబ్రవరి 27న పాకిస్థాన్‌ వైమానిక దళం ప్రతిఘటనకు దిగడంతో వారిని ఎదుర్కొనబోయి భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ దళానికి చిక్కిన విషయం తెలిసిందే. భారత ఒత్తిడితో మార్చి 1న పాక్‌ అభినందన్‌ను విడుదల చేసింది. పాక్‌ సైన్యానికి దొరికినప్పటికీ ధైర్యంగా ఆ పరిణామాల్ని ఎదుర్కొన్నందుకు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌కు ప్రభుత్వం వీర్‌ చక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున అభినందన్‌ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు