close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పరీక్షల్లో పోటీ.. వ్యాపారంలో మేటి

యంగ్‌ టాలెంట్‌

చదువుకుంటూ ఉద్యోగాలు చేయడం ఒకప్పుడు గొప్ప విషయం... ఇప్పుడు కెరీర్‌కి బాటలు వేసుకుంటూనే... అభిరుచుల్ని సానబెట్టుకుంటూ... సాగిపోతోంది యువతరం. అలాంటివారిలో హైదరాబాద్‌కి చెందిన శ్రేయా దీక్షిత్‌ గురించి చెప్పాలి. ఓ వైపు పోటీపరీక్షలకు సిద్ధమవుతూనే... మరోవైపు వ్యాపారం దిశగా అడుగులు వేస్తోంది. 
సక్తి ఉంటే... ఏ పనీ కష్టం అనిపించదు. అదే సూత్రాన్ని నమ్ముతుంది శ్రేయ. ఎంబీఏ పూర్తి చేసిన ఆమె... ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. డిగ్రీలో ఉన్నప్పుడే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆమె... ఈ తరానికి నచ్చేలా కానుకలు, పర్సనలైజ్డ్‌ గిఫ్ట్స్‌, మీనియేచర్‌ జెన్‌ గార్డెన్స్‌ తయారుచేస్తోంది. 
చిన్నచిన్న సందర్భాలకు... స్నేహితులు, బంధువులకు వారి పుట్టినరోజులు, అభిరుచికి తగినట్లుగా కానుకలు తయారుచేసి ఇచ్చేది. వాటిని చూసి ఇతరులూ అడిగేవారు. కొన్నాళ్లయ్యాక మీనియేచర్‌ గార్డెనింగ్‌ గురించీ తెలియడంతో వాటినీ తయారు చేయాలనుకుంది. ఆన్‌లైన్‌లో ఆ మెలకువలను నేర్చుకున్న శ్రేయ రకరకాల థీమ్స్‌తో వీటిని తయారు చేయడం మొదలుపెట్టింది. వీటి ధర రెండు వందల నుంచి రెండువేల రూపాయల్లో ఉంటుంది. ఆర్డర్లను బట్టి తయారుచేసి ఇస్తోంది. 
కోరినట్లుగా... కొత్తగా...  ఇంకేం కొత్తగా చేయాలని ఆలోచించిన ఆమె... జెన్‌ గార్డెన్‌ గురించి తెలుసుకుంది. ఇసుక, రాళ్లు వంటివాటితో ఈ గార్డెన్‌ని ప్రయోగాత్మకంగా రూపొందించింది. చాలామంది బాగున్నాయని మెచ్చుకోవడంతో పెద్దస్థాయిలో చేయడం ప్రారంభించింది. ఇందుకు అవసరమైన వస్తువుల్ని ఎంత ఖరీదైనా, ఎక్కడినుంచైనా తెప్పించుకుంటుంది. ఇవే కాదు కస్టమైజ్డ్‌ బొకేలూ రూపొందిస్తోంది. వినియోగదారులు కోరినట్లుగా తయారుచేయడమూ ఈమె ప్రత్యేకత. వీటన్నింటినీ ప్రెట్టీథింగ్స్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్టు చేస్తోంది. ‘మా అమ్మ వృథా వస్తువులను అందంగా మార్చేస్తుంది. ఆమెను చూస్తూ పెరిగిన నాకూ   వీటిపై ఆసక్తి కలిగింది. మొదట్లో స్నేహితులు బంధువులకు బొమ్మలు, ఇతర కానుకలు చేసిచ్చేదాన్ని. క్రమంగా వినియోగదారుల సంఖ్య పెరిగింది. ఇప్పుడూ పోటీపరీక్షలకు సిద్ధమవుతూనే వీటిని చేస్తున్నా...’ అని వివరిస్తుందామె.


 

చదువుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా... వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్నా... ఏవయినా ప్రయోగాలు చేస్తున్న అమ్మాయిలు మీరయితే... మీ గురించి మాకు రాసి పంపండి. మీ ప్రతిభను మేం ఫొటోతో సహా ప్రచురిస్తాం.  
మా ఈమెయిల్‌ ఐడీ :  
vasundhara@eenadu.net


మరిన్ని