close

ఆంధ్రప్రదేశ్

కర్నూలును వీడని వర్షాలు

నంద్యాల ఇంకా జలమయమే
పలు ప్రాంతాల్లో నిలిచిన రాకపోకలు
ఈనాడు డిజిటల్‌ - కర్నూలు

కర్నూలు జిల్లాను 4రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్యాపిలి, పాణ్యం, నంద్యాల, మహానంది, బండిఆత్మకూరు, గోస్పాడు, తుగ్గలి, కోసిగి, మిడుతూరు, ఓర్వకల్లు, మంత్రాలయం మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టితో కుందూ నది ఉగ్రరూపం దాల్చింది. గడివేముల-మిడుతూరు, నంద్యాల-నందికొట్కూరు మధ్య రాకపోకలను నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు రద్దయ్యాయి. పచ్చర్ల వాగు పొంగడంతో బనగానపల్లి-నంద్యాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచాయి. నంద్యాల వీధులు జలమయమయ్యాయి. కోసిగి సమీపంలోని చాప వాగులో బుధవారం సాయంత్రం గల్లంతైన వీరేశ్‌ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. బేతంచర్ల పరిధిలోని ఎంబాయి గ్రామ సమీపంలో రైతులు భాస్కర్‌, నారాయణలకు చెందిన మామిడి తోటలో పలుచోట్ల భూమి కుంగి పాయలుగా చీలింది. నందికొట్కూరులోని నక్కలవాగు పొంగడంతో వడ్డెమాన్‌ గ్రామంలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఈ గ్రామంలో వర్షాలకు మట్టిమిద్దె కారుతుండటంతో పది రోజుల పసిబాలుడున్న బాలింత రేణుకను తల్లిదండ్రులు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి చేర్చారు. జిల్లాలో వరదల వల్ల రూ.192 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ప్రభుత్వానికి నివేదించారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రూ.584.60 కోట్లు అవసరమని పేర్కొన్నారు.


సీమ, కోస్తాకు వర్ష సూచన

ఈనాడు, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసినా.. దాని జాడే లేదు. గురువారం సాయంత్రానికి ఉపరితల ఆవర్తనం రాయలసీమ, దాని చుట్టుపక్కల ప్రాంతాలమీదుగా కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఫలితంగా రానున్న మూడు రోజుల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో, కోస్తాలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈనెల 22న కోస్తాలో భారీ వర్షాలు, 23న రాష్ట్రవ్యాప్తంగా విస్తార వర్షాలకు అవకాశం ఉందని వివరిస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు