close

క్రీడలు

కర్ణాటక క్రికెటర్‌ గౌతమ్‌ అరెస్ట్‌

కేపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌

బెంగళూరు: కర్ణాటక ప్రిమియర్‌ లీగ్‌ (కేపీఎల్‌)లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై కర్ణాటక మాజీ రంజీ ఆటగాళ్లు సీఎం గౌతమ్‌, అబ్రార్‌ ఖాజీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గౌతమ్‌ కేపీఎల్‌లో బళ్లారి టస్కర్స్‌కు నాయకత్వం వహించాడు. వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అబ్రార్‌ ఖాజి ఆ జట్టులో సభ్యుడు. గత రెండు కేపీఎల్‌ సీజన్లలో జరిగిన స్పాట్‌ ఫిక్సింగ్‌పై బెంగళూరు సిటీ సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ దర్యాపు జరుపుతోంది. దర్యాప్తులో భాగంగా ఇంకొంత మందిని అరెస్ట్‌ చేసే అవకాశముందని అదనపు పోలీస్‌ కమిషన్‌ సందీప్‌ పాటిల్‌ చెప్పాడు. గౌతమ్‌ ప్రస్తుతం గోవాకు ఆడుతుండగా.. ఖాజీ మిజోరాంకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వచ్చే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టోర్నమెంట్లో ఆడే ఆ రాష్ట్ర జట్లకు వీళ్లు ఎంపికయ్యారు కూడా. వీళ్లిద్దరు రూ.20 లక్షలు తీసుకుని... బళ్లారి టస్కర్స్‌, హూబ్లీ టైగర్స్‌ మధ్య జరిగిన 2019 కేపీఎల్‌ ఫైనల్లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఓ పోలీస్‌ అధికారి చెప్పాడు. ‘‘స్లో బ్యాటింగ్‌,  ఇతర పనుల కోసం వాళ్లకు రూ.20 లక్షలు ముట్టాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కూడా వాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు’’ అని తెలిపాడు. కొన్ని నెలల కింద వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణానికి సంబంధించి పోలీసులు ఇంతకుముందే నిషాంత్‌ సింగ్‌ షెకావత్‌ అనే క్రికెటర్‌, బెలగావి పాంథర్స్‌ జట్టు సహ యజమాని సహా నలుగురిని అరెస్ట్‌ చేశారు. గౌతమ్‌, ఖాజి ఐపీఎల్‌లో కూడా ఆడారు. 33 ఏళ్ల గౌతమ్‌ దిల్లీ డేర్‌డెవిల్స్‌, ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 94 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన గౌతమ్‌ ఈ ఏడాదే గోవాకు మారాడు. 30 ఏళ్ల ఖాజి ఆర్‌సీబీ తరఫున ఒక మ్యాచ్‌ ఆడాడు. 17 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు