close

ఆంధ్రప్రదేశ్

నెలాఖరులోగా జీఎన్‌ఎస్‌ఎస్‌ టెండర్లు

న్యాయ సమీక్ష ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
పులివెందుల ప్రాంతీయాభివృద్ధి సంస్థ సమీక్షలో ముఖ్యమంత్రి

ఈనాడు, అమరావతి: గాలేరి-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కాలువ, చక్రాయపేట ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి న్యాయ సమీక్ష ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నెలాఖరులోగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి పులివెందుల బ్రాంచి కెనాల్‌ (పీబీసీ)కు, వేంపల్లి మండలంలో అలవలపాడు, పెండ్లూరు చెరువుకు నీళ్లు చేరేలా ప్రతిపాదిత రూ.46.5 కోట్ల ఎత్తిపోతల పథకం పనులకు పరిపాలన అనుమతులివ్వాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం పులివెందుల ప్రాంతీయాభివృద్ధి సంస్థ (పాడా) పనితీరుపై కడప పార్లమెంట్‌ సభ్యుడు అవినాష్‌రెడ్డి, కడప కలెక్టర్‌ హరికిరణ్‌, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...
* ‘‘చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి యర్రబల్లి, కొత్తగా నిర్మించే గిడ్డంగివారిపల్లె చెరువు, యూసీఐఎల్‌ ప్రభావిత ఏడు గ్రామాలకు నీరు అందించే ఎత్తిపోతల పథకం పనులకు ఆర్థికశాఖ త్వరితగతిన పరిపాలన అనుమతులివ్వాలి. ముగమేరు వంకపై చెక్‌డ్యాంలు, ఫ్లడ్‌ బ్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.’’
* ‘‘రాష్ట్ర ఆధునిక పశు పరిశోధన కేంద్రానికి (ఏపీ కార్ల్‌) అనుబంధంగా వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య కళాశాలలతోపాటు వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతోపాటు శిక్షణ కేంద్రం వెంటనే ప్రారంభించాలి.’’
* ‘‘పులివెందులలో అరటి స్టోరేజీ, ప్రాసెసింగ్‌ యూనిట్‌తోపాటు సాగు ఎక్కువగా ఉండే అనంతపురం, కడపలోనూ ప్రాసెసింగ్‌ యూనిట్లు సిద్ధం చేయాలి.
* ‘‘పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్‌ ఏర్పాటుపై మరింత దృష్టి పెట్టాలి. నగరాభివృద్ధితోపాటు ఆర్టీసీ బస్టాండు తరలింపు, కొత్త బస్టాండు నిర్మాణంపై మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలి. పులివెందుల ఆటోనగర్‌లో మౌలిక వసతులకు పాడా నుంచి రూ.2.71 కోట్లు మంజూరు చేయాలి.’’
* ‘‘రాష్ట్రంలోని అన్ని ట్రిపుల్‌ ఐటీల నుంచి గత ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టించిన నిధులు వెనక్కి రప్పించే ప్రక్రియను అధికారులు మొదలు పెట్టాలి.’’ అని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు