close

సినిమా

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముందున్నాయ్‌ మల్టీస్టారర్‌ మెరుపులు

వెండితెరపై ఎన్ని రకాల సినిమాల్ని ఆస్వాదించినా.. ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చూస్తే దొరికే కిక్కే వేరు. ఎందుకంటే ఒక్క టికెట్‌పై రెండు చిత్రాల్ని ఆస్వాదించినట్లుగా డబుల్‌ డోస్‌ మజాని రుచి చూపించేవి మల్టీస్టారర్‌ చిత్రాలే కదా. అందుకే బాక్సాఫీస్‌ ముందుకు ఓ మల్టీస్టారర్‌ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కళ్లు రెండింతలు చేసుకోని ఆసక్తిగా చూస్తుంటారు. ఇప్పుడిలాంటి డబుల్‌ ధమాకా వినోదాల్ని రుచి చూపించేందుకే తెలుగు చిత్రసీమలో రానున్న రోజుల్లో రాబోతున్న మల్టీస్టారర్‌ చిత్రాలేంటో చూసేద్దాం.
మల్టీస్టారర్‌ చిత్రాలు తెలుగు సినీప్రియులకు కొత్తేం కాదు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ రోజుల నుంచి వెండితెరపై సందడి చేస్తున్న ఎవర్‌గ్రీన్‌ హిట్‌ ఫార్ములాల్లో ఇదీ ఒకటి. ఆ మధ్య కొన్నేళ్ల పాటు తెలుగు చిత్రసీమలో మల్టీస్టారర్‌ చిత్రాల సందడి పెద్దగా కనిపించనప్పటికీ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత నుంచి వాటి జోరు మళ్లీ పెరిగింది. అగ్ర కథానాయకులు వెంకటేష్‌ - మహేష్‌బాబులు కలిసి నటించిన ఈ చిత్రం.. అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకోవడంతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో అప్పటి నుంచి మిగతా హీరోలు మల్టీస్టారర్‌ల వైపు చూడటం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘గోపాల గోపాల’, ‘బాహుబలి’, ‘ఎఫ్‌ 2’, ‘దేవదాస్‌’, ‘వెంకీమామ’ తదితర చిత్ర విజయాలూ మల్టీస్టారర్ల విషయంలో దర్శక నిర్మాతలకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఇప్పుడీ స్ఫూర్తితోనే తెలుగు తెరపై మరికొన్ని కొత్త మల్టీస్టారర్లు తెరకెక్కుతున్నాయి.

అందరి కళ్లు వాటిపైనే..
ప్రస్తుతం తెలుగులో సెట్స్‌పై ముస్తాబవుతోన్న క్రేజీ మల్టీస్టారర్లలో జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొన్నది దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పైనే. ‘బాహుబలి’ లాంటి హిట్‌ చిత్రాల తర్వాత జక్కన్న నుంచి వస్తోన్న చిత్రం కావడం.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ లాంటి ఇద్దరు స్టార్‌ కథానాయకులు తొలిసారి తెర పంచుకుంటుండటంతో దీనిపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్వాతంత్య్ర వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ జీవితాల స్ఫూర్తితో రాసుకొన్న ఓ ఫిక్షనల్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే 70శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వి’ కూడా ఓ చక్కటి మల్టీస్టారర్‌ చిత్రమే. నాని - సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రమిది. సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.   ఇక ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న చిరంజీవి - కొరటాల ‘ఆచార్య’ చిత్రాన్ని సైతం మల్టీస్టారర్‌ చిత్రంగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలోని.. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ కోసం మరో కథానాయకుడిని తీసుకోబోతున్నారు. దాదాపు 20 నిమిషాల నిడివి ఉండే ఆ కీలకమైన పాత్రను చిరు తనయుడు రామ్‌ చరణ్‌తో చేయించాలని ప్రయత్నిస్తోంది చిత్ర బృందం. కానీ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షెడ్యూల్స్‌ను బట్టీ ఇది సాధ్యపడుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. లేదంటే మరో యువ కథానాయకుడితో ఈ పాత్ర చేయించాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

సెట్స్‌పైకి కొత్త కలయికలు..
వచ్చే ఏడాది తెలుగు చిత్రసీమలో మల్టీస్టారర్‌ చిత్రాల జోరు ఎక్కువగా కనిపించబోతుంది. దీనికి తగ్గట్లుగానే ఇప్పటికే దాదాపు అరడజనుకు పైగా కొత్త ప్రాజెక్టులు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ జాబితాలో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది ‘అయ్యప్పన్‌ కోషియుమ్‌’ తెలుగు రీమేక్‌. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించబోతుంది. ఈ చిత్రం కోసం హీరోలుగా రవితేజ, రానాలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సంస్థ నుంచే రానున్న ‘కప్పెల’ సైతం ఓ చక్కటి మల్టీస్టారర్‌గానే రూపొందబోతుంది. ఇప్పటికే దీంట్లో ఓ కథానాయకుడి పాత్రకు విష్వక్‌ సేన్‌ ఖరారవ్వగా.. మరో హీరోను ఎంపిక చెయ్యాల్సి ఉంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’తో    విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి.. ‘మహా సముద్రం’ పేరుతో ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. దీంట్లో శర్వానంద్‌, సిద్ధార్థ కథానాయకులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న బడా మల్టీస్టారర్‌ చిత్రాల జాబితాలో వెంకటేష్‌ - వరుణ్‌ తేజ్‌ల ‘ఎఫ్‌ 2’ సీక్వెల్‌ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఎఫ్‌3’ పేరుతో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు