close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హరిత వర్ణం.. నవరత్న శోభితం

భూమిపూజ నాడు అయోధ్య రామునికి వస్త్రాలు
‘భగవత్‌’ సోదరులే దర్జీలు

అయోధ్య: అంగరంగ వైభవంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆగస్టు 5న భూమిపూజ చేస్తున్న వేళ.. ఉత్సవమూర్తి శ్రీరాముడిని ప్రత్యేక రూపలావణ్య వస్త్రాలతో అలంకరిస్తారు. వీటిని తయారుచేసే దర్జీలు ఎవరో తెలుసా! అయోధ్యలో ఓ చిన్న టైలరింగ్‌ దుకాణం నడుపుతున్న భగవత్‌ ప్రసాద్‌ పహాడీ, ఆయన సోదరుడు శంకర్‌లాల్‌ శ్రీవాస్తవలు.

నవరత్న శోభితం..
అయోధ్యలోని ఆలయాల్లో దశాబ్దాల తరబడి దేవతామూర్తులకు ఈ కుటుంబమే వస్త్రాలను తయారుచేస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమిపూజ జరిగే రోజున శ్రీరాముడిని.. నవగ్రహాల సాక్షిగా హరిత వర్ణంలో, నవరత్నాలు పొదిగిన ముకమల్‌ వస్త్రాలతో అలంకరిస్తారు. అయోధ్య రాముడిని వారానికో రంగు వస్త్రాలతో అలంకరిస్తుంటారు. బుధవారాల్లో ఆకుపచ్చ రంగు ఉంటుంది. భూమిపూజ జరుగుతున్నది అదే రోజు కావడంతో భగవత్‌ సోదరులు ఆ రంగు వస్త్రాలనే సిద్ధం చేశారు. భూమిపూజ సందర్భంగా శ్రీరాముడితో పాటు లక్ష్మణ, భరత, శతృఘ్నులు, ఆంజనేయస్వామి మూర్తులకు కూడా ప్రత్యేక వస్త్రాలు సిద్ధమవుతున్నాయి. వీటన్నింటికీ కలిపి 17 మీటర్ల వస్త్రాన్ని వినియోగించారు. ద్వారాల తెరలు, పాన్పు వస్త్రం కూడా దీంతోనే తయారు చేశారు. ఆభరణాలతో కూడిన ప్రత్యేక దండను కూడా శ్రీరాముని కోసం సిద్ధం చేశారు.

ఎంత భాగ్యమో..!
‘‘సాక్షాత్తూ రాముడికే వస్త్రాలు కుట్టే అవకాశం దక్కడం మాకు మహాభాగ్యం’’ అని భగవత్‌ ప్రసాద్‌ సోదరులు పరవశించిపోతున్నారు. దాదాపు 3 దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్‌దాస్‌ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్‌ ప్రసాద్‌ తండ్రి బాబూలాల్‌కు అప్పగించారు. నాటి నుంచి ఆ కుటుంబం ఎంతో భక్తిశ్రద్ధలతో అనవాయితీగా ఈ వస్త్రాలను తయారుచేస్తూ వస్తోంది. నేపాల్‌లోని జనక్‌పుర్‌లో ఉన్న జానకిమాత ఆలయానికి కూడా ఈ కుటుంబమే వస్త్రాలను తయారు చేసి పంపిస్తోంది. జానకిమాత ఆలయ పరిధిలోనే ఉన్న విక్రమ్‌స్వామికి కూడా వీరు తయారుచేసిన వస్త్రాలనే అలంకరిస్తారు. అయోధ్యలోని బడీకుటియా ప్రాంతంలో ఈ అన్నదమ్ములు ‘రామ్‌ బాబు లాల్‌ టైలర్స్‌’ పేరుతో చిన్న దుకాణాన్ని నడుపుతున్నారు.

అయోధ్యకు పవిత్ర జలాలు, మట్టి తరలింపు
ఉత్తర్‌కాశి: రామ మందిర నిర్మాణానికి ఆగస్టు 5న జరగనున్న భూమి పూజలో వినియోగించేందుకు యమునోత్రి నుంచి పవిత్ర మట్టి, యమునా నది జలాలను అక్కడి పూజారులు శుక్రవారం అయోధ్యకు తరలించేందుకు విశ్వ హిందూ పరిషద్‌ సభ్యులకు అందజేశారు. వీటితోపాటు హిమాలయ పర్వత ప్రాంతాల్లో పుష్పించే బ్రహ్మ కమలాలను కూడా ఇచ్చారు. అలాగే గంగోత్రి ధామం నుంచీ పవిత్ర మట్టి, గంగా నది జలాలను స్పీడ్‌ పోస్ట్‌లో పంపినట్లు గంగోత్రి మందిర్‌ సమితి ఓ ప్రకటనలో పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు