close

తాజా వార్తలు

సినిమాల్లేక వాచ్‌మెన్‌గా  మారిన నటుడు

దర్శకుడి నుంచి ఊహించని స్పందన

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సవీ సిద్ధు సినిమాల్లేక బతుకుతెరువు కోసం వాచ్‌మెన్‌ ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయన ఫొటోలు బయటికి రావడంతో ఈ విషయం కాస్తా బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దాంతో ఆయనకు అవకాశాలు ఇవ్వండి అంటూ పలువురు నెటిజన్లు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు తెగ మెసేజ్‌లు పంపుతున్నారట. దీనిపై అనురాగ్‌ నుంచి ఊహించని స్పందన వచ్చింది. ‘నా సినిమాల్లో ఆయనకు మూడు సార్లు అవకాశం ఇచ్చాను. సినిమాల్లేకుండా ఖాళీగా ఉంటున్న ఇతర నటుల్లా కాకుండా ఆయన తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఓ ఉద్యోగం ఎంచుకున్నందుకు ఆయన పట్ల నాకు గౌరవం పెరిగింది. కొందరైతే సినిమాల్లేక తాగుబోతులుగా మారుతుంటారు. నవాజుద్దిన్‌ సిద్ధిఖీ కూడా వాచ్‌మెన్‌గా, వెయిటర్‌గా పని చేసి ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు. రోడ్లపై భేల్‌పురి అమ్ముకుంటున్న ఓ నటుడ్ని నేను కలిశాను. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే.. సినిమాల్లేవని ఓ నటుడి పట్ల జాలి పడి వారికి అవకాశాలు ఇవ్వకూడదు. అది వారిని అవమానించినట్లు అవుతుంది. సిద్ధూ తన జీవితాన్ని తానే రక్షించుకోవాలి. ఆయన కోసం ఏదన్నా సాయం చేయాలనుకుంటే కాస్టింగ్‌ డైరెక్టర్ల వద్దకు తీసుకెళ్లగలం. వాచ్‌మెన్‌ అంటే చిన్న ఉద్యోగం అని తీసిపారేస్తున్నారు. ఇది నాకు చిన్న ఉద్యోగం కాదు. అలా అని పెద్దదీ కాదు. కనీసం ఆయన అడుక్కోవడంలేదు కదా..? ఒకవేళ సిద్ధులాంటి ఆర్టిస్ట్‌లకు మీరు సాయం చేయాలనుకుంటే వారు నటించిన సినిమాలను థియేటర్‌కు వెళ్లి టిక్కెట్లు కొనుక్కుని చూడండి. అప్పుడే వారి విలువను గుర్తించి మరిన్ని అవకాశాలు ఇవ్వడానికి ముందుకొస్తారు. అంతేకానీ.. ఇలా ఆయన పడుతున్న బాధలను నాకు వివరించడంలో అర్ధంలేదు. నేను చెప్పదలచుకున్నది ఇంతే. ధన్యవాదాలు’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు అనురాగ్‌. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు