close

ఆంధ్రప్రదేశ్

సైబర్‌ సమరం

పార్టీల వెబ్‌సైట్ల హ్యాకింగ్‌.. సమాచారం తస్కరణ
ఎన్నికలకు ముందు ప్రధాన పక్షాలపై దాడి

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ అధికారిక వెబ్‌సైట్‌ దాదాపు 12 రోజుల క్రితం హ్యాకయింది. ఇప్పటికీ అది సాధారణ స్థితికి రాలేదు. 
సాంకేతిక కారణాల’ వల్ల మా సైట్‌ డౌన్‌లో ఉంది. అది హ్యకింగ్‌కు గురికాలేదు.
- అమిత్‌ మాలవీయ, భాజపా ఐటీ విభాగం అధిపతి

కప్పుడు ఎన్నికలంటే.. గోడమీద రాతలు, వాల్‌ పోస్టర్లు, బ్యానర్లు, మైకుసెట్ల హోరు... ఇవన్నీ ఉండేవి. రెండు పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఎదురుపడ్డారంటే ఇక చిన్నపాటి యుద్ధమే. నాయకులు, కార్యకర్తల స్థాయిలో భారీగా గొడవలు జరిగేవి. కాలం మారింది. అప్పట్లా రోడ్లమీద పడి కొట్టుకోవడం లేదు. పెద్ద ఏసీ గదిలో 50-100 మంది వరకు కూర్చుంటారు. అందరి ముందు అత్యాధునిక కంప్యూటర్లుంటాయి. వాళ్ల మెదళ్లు కంప్యూటర్ల కంటే వేగంగా పరిగెడుతుంటాయి. ఆ నిపుణులు అవతలి వాళ్లనే లక్ష్యంగా చేసుకుని అస్త్రశస్త్రాలకు పదును పెడతారు. సైబర్‌ యుద్ధాలకు సిద్ధమవుతారు.

భాజపా డేటా మాయం?
భాజపా వెబ్‌సైట్‌ హ్యాకయింది. ఆ సైట్‌లో ఉన్న స్టాటిక్‌, డైనమిక్‌ డేటా మొత్తం తుడిచి పెట్టుకుపోయిందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెబ్‌సైట్‌లో పార్టీ సభ్యుల ఈమెయిల్‌ ఐడీలు, దాతల వివరాలు, అభ్యర్థులపై పార్టీ సర్వేలు, ప్రాంతాల వారీ, కులాలవారీ విశ్లేషణలు.. అన్నీ ఉంటాయి. ఎన్నికలకు ముందు ఈ సమాచారం పార్టీలకు అత్యంత అవసరం. ఇంత కీలకమైన సమాచారాన్ని సాధారణంగా ఆఫ్‌లైన్‌లో కూడా స్టోర్‌ చేసుకుని ఉంటారు. దాన్నంతటినీ ఆన్‌లైన్‌లో పెట్టడం, సైట్‌ను పునరుద్ధరించడం కష్టం కాదు. కానీ ఇంకా రాలేదంటే అంతకంటే చాలా పెద్ద సమస్యే ఏమైనా వచ్చిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఎవరి పని అయి ఉండొచ్చు..?
సాధారణంగా పార్టీల సాంకేతిక విభాగాలు ఎవరికి వారికే ఉంటాయి. వీళ్లంతా తమ సొంత సైట్‌ నిర్వహణ చూసుకోవడంలోనే తలమునకలై ఉంటారు తప్ప సాధారణంగా అవతలి పార్టీ మీద దాడి చేయరు. ఇటీవలి కాలంలో ఉగ్రవాదం మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం పాకిస్థాన్‌ లాంటి దేశాలకు కంటగింపుగా మారింది. అందువల్ల పాకిస్థాన్‌, లేదా దాని మిత్రదేశమైన చైనా నుంచి ఈ దాడులు జరిగి ఉండచ్చన్న అనుమానాలూ తలెత్తుతున్నాయి. హ్యాకర్లు డబ్బులు డిమాండు చేయడం, అవతలివాళ్ల సమాచారాన్ని తుడిచి పెట్టేయడం ద్వారా వారికి నష్టం కలిగించాలని కూడా భావిస్తారు.

ఇతర పార్టీలు, రాష్ట్రాలలోనూ..
సైబర్‌ దాడులు కేవలం ఒక్క భాజపాకే కాదు, ఇతర పార్టీలకూ ఎదురవుతున్న ముప్పే. ఫిబ్రవరి 21వ తేదీన ఛత్తీస్‌గఢ్‌ భాజపా వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. 2012 నుంచి 2018 వరకు తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం లాంటి పార్టీల సైట్లు పలుమార్లు హ్యాకయ్యాయి. గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయినపుడు అందులో హార్దిక్‌ పటేల్‌ లైంగిక ఆరోపణలకు గురైనప్పటి వీడియో నుంచి ఫొటోలు తీసి పెట్టారు. దాంతో ఇది స్థానిక హ్యాకర్ల పనేనని భావించారు. తెలుగుదేశం వెబ్‌సైట్‌ సైతం హ్యాకింగ్‌కు గురైంది. హోంపేజి తెరవగానే దానిమీద ఇటాలియన్‌ భాషలో కొంత సందేశం పెట్టారు. తెలుగుదేశం సాంకేతికంగా ముందంజలో ఉన్నది కావడంతో అతి తక్కువ సమయంలోనే దాన్ని మళ్లీ పునరుద్ధరించుకోగలిగారు. అయితే, ఇలా వెబ్‌సైట్లు హ్యాక్‌ అయిన పార్టీలన్నీ ఎంత మేర సమాచారాన్ని కోల్పోయాయి, అందులో ఎంత పునరుద్ధరించుకున్నాయనేది ప్రశ్నార్థకమే.

అమెరికాకు కూడా..
అమెరికాకు 2016లో అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు కూడా సమాచార చౌర్యం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. రష్యా నిఘావిభాగం అధికారులు పిషింగ్‌ ఈ మెయిళ్లు, ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి హిల్లరీ క్లింటన్‌ సిబ్బంది వివరాలు హ్యాక్‌ చేశారన్నారు. కీలకమైన ఓటర్ల జాబితాను సేకరించారని, తద్వారా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. ఈ విషయం తెలిసి యావత్‌ ప్రపంచమే నివ్వెరపోయింది. జనవరిలో ఆస్ట్రేలియా పరిశోధకుడు 200 కోట్ల ఈమెయిళ్లు, వాటి పాస్‌వర్డులు హ్యాక్‌చేసి వాటిని వెబ్‌లో పెట్టారు. 2015లో హ్యాకర్లు 30 దేశాలకు చెందిన బ్యాంకులను హ్యాక్‌ చేసి, 100 లక్షల కోట్ల డాలర్ల సొమ్ము కాజేశారు.

హ్యాకర్లు దాడి చేసే పద్ధతి ఇదీ..

హ్యాకర్లు ఐడీ సెర్వ్‌, నెట్‌క్రాఫ్ట్‌, హెచ్‌టీటీపీ రెకాన్‌, హూఈజ్‌ అనే టూల్స్‌ ద్వారా వెబ్‌ సైట్లపై దాడిచేస్తారు. వెబ్‌ సర్వర్లలో ఈలోపాలుంటే దాడి సులభం అవుతుంది..సరైన ఫైలు, డైరెక్టరీ అనుమతులు లేకపోవడం అక్కర్లేని సేవలు, కంటెంట్‌ నిర్వహణ, రిమోట్‌ అనుసంధానం బయటి సిస్టంలతో సరైన అనుమతులు లేకుండా అనుసంధానం అకౌంట్‌ పేరు, పాస్‌వర్డ్‌ వాటంతట అవే వచ్చేలా పెట్టుకోవడం ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లేదా నెట్‌వర్క్‌ కాన్ఫిగరేషన్‌ సరిలేకపోవడం సర్వర్‌ సాఫ్ట్‌వేర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లేదా వెబ్‌ అప్లికేషన్‌లో బగ్‌లు.

దాడి చేస్తే ఏమవుతుంది?

సేవల తిరస్కరణ  ఈ దాడి చేస్తే వెబ్‌ సర్వర్‌ క్రాష్‌ అవ్వచ్చు లేదా యూజర్లకు అందుబాటులో ఉండకపోవచ్చు
డీఎన్‌ఎస్‌ హైజాక్‌  ఈ రకం దాడి చేస్తే డీఎన్‌ఎస్‌ సెట్టింగులు మారిపోతాయి. వాటిని మార్చడానికి యూజర్‌కు వీలుండదు
స్నిఫింగ్‌  ఎన్‌క్రిప్ట్‌ చేయని డేటాను నెట్‌వర్క్‌ ద్వారా పంపితే దాన్ని మధ్యలోనే సంగ్రహించే అవకాశం ఉంటుంది.
డీఫేస్‌మెంట్‌  ఈ రకం దాడిలో సంస్థ వెబ్‌సైట్‌ పేరు మార్చేసి, వేరే పేరు, బొమ్మలు, సందేశాలు పెట్టచ్చు. ఎక్కువగా ఈ తరహా దాడులే జరుగుతున్నాయి.

సెకనుకో బగ్‌

2018 జనవరి నుంచి జూన్‌ వరకు మన దేశంలో 6.9 లక్షల సైబర్‌ దాడులు జరిగాయి. వాటిలో మూడింట రెండు వంతులు రష్యా, అమెరికా, చైనాల నుంచే. మన దేశంలో కార్పొరేట్లు, ప్రభుత్వాలు అన్నీ సైబర్‌ స్నూపింగ్‌ బారిన పడుతున్నాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా హెచ్చరించారు. మూడేళ్ల క్రితం ప్రతి నిమిషానికోసారి కొత్త వైరస్‌, యాడ్‌వేర్‌ లాంటి బగ్‌లు పుట్టుకొచ్చేవి. కానీ ఇప్పుడు సెకనుకొకటి వస్తున్నాయి. గత జూలై నెలలో రక్షణ, హోం, కార్మిక, న్యాయమంత్రిత్వశాఖల వెబ్‌సైట్లు దాదాపు ఆరుగంటల పాటు డౌన్‌ అయ్యాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు