close

ఆంధ్రప్రదేశ్

త్రిపురలో 81.8 శాతం..

బిహార్‌లో 50 శాతం పోలింగ్‌
అవాంతరాల మధ్య తొలిదశ ఎన్నికలు
కొన్ని రాష్ట్రాల్లో చెలరేగిన హింస
పలుచోట్ల ఈవీఎంలలో సమస్యలు

దిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద పోలింగ్‌ ప్రక్రియ మొదలైంది. తొలి దశ పోలింగ్‌ అవాంతరాలు, ఆరోపణల మధ్య గురువారం పూర్తయింది. ఏడు దశల్లో జరిగే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశలో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా 91 లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్‌ జరిగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా, చాలాచోట్ల ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ పలువురు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికల ఘర్షణలో ఇద్దరు మృతి చెందగా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో నక్సల్స్‌ ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. మరోవైపు.. పోలింగ్‌ ఘర్షణల్లో మొత్తం ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల హింసాత్మక ఘర్షణలు మినహా ప్రశాంతంగానే పూర్తయినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. గణనీయ సంఖ్యలో ముందుకొచ్చి ఓటేసినందుకు ఓటర్లకు కృతజ్ఞతలని డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ఉమేష్‌ సిన్హా పేర్కొన్నారు. పోలింగ్‌ సజావుగా సాగేలా అండగా నిలిచారంటూ ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా బలగాలు, పలు రాష్ట్రాల్లోని నోడల్‌ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

పోలింగ్‌ శాతమిలా..
ఎన్నికల కమిషన్‌ సమాచారం ప్రకారం.. సాయంత్రం 5 గంటల వరకు త్రిపురలో అత్యధికంగా 81.8 శాతం, బిహార్‌లో  అతి తక్కువగా 50 శాతం  పోలింగ్‌ నమోదైంది. జమ్మూకశ్మీర్‌లో 54.49 శాతం, సిక్కింలో 69 శాతం, మిజోరంలో 60 శాతం, మణిపూర్‌లో 78.2 శాతం, అసోంలో 68 శాతం, నాగాలాండ్‌లో 78 శాతం, పశ్చిమబెంగాల్‌లో 81 శాతం, ఒడిశాలో 68 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 63.69 శాతం, మహారాష్ట్రలో 56 శాతం, అండమాన్‌నికోబార్‌లో 56 శాతం, లక్షద్వీప్‌లో 66 శాతం, ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌లో 56 శాతం, అరుణాచల్‌ప్రదేశ్‌లో 66 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఓటింగ్‌ శాతాన్ని ఈసీ వెల్లడించలేదు. తుది గణన తర్వాత పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

హింసాత్మక ఘటనలు..
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా వఘేజరి ప్రాంతంలో ఓ పోలింగ్‌ బూత్‌ సమీపంలో నక్సలైట్లు ఐఈడీని పేల్చగా, ఎవరూ గాయపడలేదు. ఆ తర్వాత ఇదే జిల్లా ఎటాపల్లిలో జరిగిన ఐఈడీ పేలుడులో పోలింగ్‌ సిబ్బందికి రక్షణగా ఉన్న ఇద్దరు పోలీసు కమాండోలు గాయపడ్డారు.
* ఛత్తీస్‌గఢ్‌ బీజాపుర్‌ జిల్లాలో నలుగురు నక్సల్స్‌ను అరెస్టు చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బస్తర్‌ ప్రాంతంలోని నారాయణపూర్‌లో నక్సలైట్లు ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
* అసోం దిబ్రూగఢ్‌ జిల్లాలోని తేయాకు తోటలో చమురు గొట్టంలో అమర్చిన ఐఈడీని ముందుగానే గుర్తించారు.
* పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌ కైరానాలోని ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద గుర్తింపు కార్డులు లేని కొంతమంది బలవంతంగా ఓటేసేందుకు యత్నించగా బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు.

ఈవీఎంలలో సమస్యలు..
ఎన్నికల నిర్వహణకు సంబంధించి యంత్రాంగం తీరు, ఇతరత్రా లోపాలపై తెదేపా అధినేత చంద్రబాబు, ఆప్‌ అధ్యక్షుడు కేజ్రీవాల్‌, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ ఆరోపణలు గుప్పించారు. ఓటర్ల జాబితాల్లో పేర్లు కనిపించడం లేదని చాలామంది ఆరోపణలు చేయడంపై దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్పందించారు. ‘ఏం జరుగుతోంది ఈసీ, ఈ ఎన్నికలు సక్రమమేనా’ అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక ఓట్లను తొలగించారని ఆరోపించారు. మునుపెన్నడూ లేని స్థాయిలో ఓట్లను తొలగించారని వార్తలు వస్తున్నాయన్నారు. తప్పుడు ఈవీఎంలన్నీ ఎప్పుడూ భాజపాకే ఎందుకు ఓటేస్తాయని ట్విటర్‌లో ప్రశ్నించారు.
* పారిశ్రామికవేత్త కిరణ్‌ మజుందార్‌ షా తల్లి పేరు కూడా ఓటర్ల జాబితాలో లేకపోవడంపై ఆమె స్పందించారు. తన తల్లి బాగా నిరాశకు గురయ్యారని, 19 ఏళ్లుగా ఆమె ఒకే చిరునామాలో ఉంటున్నారని షా ట్వీట్‌ చేశారు.
* జమ్మూకశ్మీర్‌లో పోలింగ్‌ హింసాత్మక ఘటనలు లేకుండా ప్రశాంతంగానే సాగింది. భాజపాకు ఓటేసేలా భద్రతా సిబ్బంది ప్రజల్ని ఒత్తిడి చేశారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ ఆరోపించాయి. జమ్మూ పూంఛ్‌ ప్రాంతంలోని కొన్నిచోట్ల ఈవీఎంలు సరిగా పని చేయలేదని, కాంగ్రెస్‌ మీట మొరాయించిందని ఆరోపించాయి.
* భాజపాకు ఓటెయ్యనందుకు బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది అతి ప్రవర్తనకు నిరసనగా భాజపా వ్యతిరేక నినాదాలు చేస్తున్న ఓటర్లకు సంబంధించిన వీడియోను పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ట్వీట్‌ చేశారు.
* ఈవీఎం మీట పనిచేయకపోవడంపై పూంఛ్‌ ప్రాంతానికి చెందిన ప్రిసైడింగ్‌ అధికారి వివరిస్తున్నట్లుగా ఉన్న వీడియోను నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు