close

ఆంధ్రప్రదేశ్

ఓటమి భయంతోనే హత్యలు, విధ్వంసాలు

శాసనసభ స్పీకర్‌పైనే కిరాతకంగా దాడి చేస్తారా?
వైకాపా కరడుగట్టిన నేరగాళ్ల పార్టీ అని మళ్లీ రుజువైంది
ఈవీఎంలు సహకరించి ఉంటే పోలింగ్‌ మరింత పెరిగేది
పోలింగ్‌ నిర్వహణలో ఈసీ విఫలం: చంద్రబాబు
ఈనాడు - అమరావతి

వీఎంలు పనిచేయకపోవడం, పోలింగ్‌ ప్రారంభమైన కాసేపట్లోనే మొరాయించడం, పార్టీల గుర్తులు మారడం, ఒకపార్టీకి ఓటేస్తే మరో పార్టీకి పడటం వంటి దుష్పరిణామాలన్నీ ఈ ఎన్నికల్లో చోటుచేసుకున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. దేశంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు చూడలేదని, వీటిని ముందే ఊహించి బ్యాలెట్‌ పేపర్‌ పెట్టాలని ఎన్నికల సంఘాన్ని ఎన్నోసార్లు కోరినా పెడచెవిన పెట్టిందని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో ఇలాంటివి జరగలేదని, ఏపీలోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని ఆవేదన చెందారు. పోలింగ్‌ ప్రారంభమై మూడు గంటలు దాటాక కూడా రాష్ట్రవ్యాప్తంగా 30% ఈవీఎంలు పనిచేయలేదని వెల్లడించారు. ఇలాంటి కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గురువారం ఉదయం నుంచి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల సరళిని పరిశీలిస్తూ ఓటర్లకు జాగ్రత్తలు చెప్తూ, పలు సూచనలు చేశారు. ఈవీఎంలు మొరాయించడంతో ఇంటికి వెళ్లిపోయిన ఓటర్లను తిరిగి పోలింగ్‌ కేంద్రాలకు రావాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎక్కువ సమయం వరసల్లో వేచి ఉన్నామని విసుగు చెందొద్దని సూచించారు.

కావాలనే ఓటింగ్‌కు ఆటంకాలు..
‘‘ఓటేసేందుకు గురువారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చారు. అభివృద్ధి, సంక్షేమానికే ఓటేస్తామని బాహాటంగా చెప్పారు. తెదేపాకు ఓటింగ్‌ ఏకపక్షంగా పడుతోందని నిర్ధరణ కావడంతో వైకాపా వారు ఓటింగ్‌ ప్రక్రియకు ఆటంకాలు కల్పించారు. ఓటింగ్‌ను దెబ్బతీయడం ద్వారా గెలవాలని కుట్రలకు పాల్పడ్డారు. వైకాపా, భాజపా, తెరాస కుట్రలకు ఇప్పుడు కొత్తగా ఎన్నికల సంఘం(ఈసీ) తోడయ్యింది. ఓటర్లకు సౌకర్యాలు కల్పించడం, సక్రమంగా పోలింగ్‌ నిర్వహించడంలో ఈసీ విఫలమైంది. ఈవీఎంలు సహకరించి ఉంటే ఓటింగ్‌ మరింత పెరిగేది. పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈవీఎంలు పనిచేయకపోవడం, మరమ్మతుల కారణంగా అనేక మంది ఓటర్లు వెనుదిరిగి పోయారు. మధ్యాహ్నం వరకు ఇలా ఇబ్బంది పెడితే ఓటింగ్‌ కేంద్రాలకు వచ్చినవారు ఇళ్లకు వెళ్లిపోయి మళ్లీ తిరిగిరారనే దురాలోచనతో కుట్రలకు తెగబడ్డారు. ఈ ఎన్నిక మన రాష్ట్రానికి కీలకం. కావాలని రౌడీయిజం చేయాలని చూశారు. హింసావిధ్వంసాలు సృష్టించడం ద్వారా పోలింగ్‌ను దెబ్బ తీసే కుట్రలకు పాల్పడ్డారు.’’ అంటూ సీఎం విమర్శించారు.

వయసు సైతం చూడకుండా చొక్కా చించేస్తారా?
తాడిపత్రి తెదేపా నేత సిద్ధా భాస్కరరెడ్డి హత్య, సత్తెనపల్లిలో స్పీకర్‌ కోడెలపై దాడిని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తాడిపత్రిలో తెదేపా నేతను వేటకొడవళ్లతో నరుకుతారా? శాసనసభ స్పీకర్‌పైనే కిరాతంగా దాడిచేస్తారా? వయసు కూడా చూడకుండా చొక్కా చించేస్తారా? సీనియర్‌ ఎమ్మెల్యేపై పిడిగుద్దులు కురిపిస్తారా? మంత్రి అఖిలప్రియ భర్త, సోదరిపై దౌర్జన్యం చేస్తారా? మాగంటి రూప వాహనంపై దాడికి తెగిస్తారా?.. అంటూ చంద్రబాబు ఆగ్రహం ప్రకటించారు. చీరాల, రాప్తాడులో దౌర్జన్యాలకు పాల్పడటాన్ని ప్రస్తావిస్తూ.. రౌడీ ముఠాలను రాష్ట్రంపైకి జగన్‌ పురికొల్పారంటూ ఆయన మండిపడ్డారు. వైకాపా కరడుగట్టిన నేరగాళ్ల పార్టీ అనేది ఈ దాడులతో రుజువైందన్నారు. ఈ రాక్షస ధోరణిని అంతా ఖండించాలని సూచించారు.

రీపోలింగ్‌ జరపాలంటూ ఈసీకి లేఖ, వైకాపాపై డీజీపీకి ఫిర్యాదు..
రాష్ట్రంలో ఈవీఎంలు పనిచేయని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి లేఖ రాశారు. ఇదే విషయమై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కూడా దిల్లీలో ఈసీని కలిశారు. మరోవంక.. ఎన్నికల్లో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు డీజీపీకి ఫిర్యాదు చేశారు. గురువారం వివిధ జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల జాబితాను ఆ ఫిర్యాదుకు జోడించారు.

కుప్పంలో పోలింగ్‌ సరళిపై ఆరా
శాంతిపురం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను పోటీ చేస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం శాసనసభ నియోజకవర్గంలో గురువారం పోలింగ్‌ సరళిని స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ నిర్దేశిత గడువులోపు వీలైనంత ఎక్కువగా నమోదయ్యే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూంలో భద్రపరచే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వైకాపావి హత్యా రాజకీయాలు..

విజయం సాధించాలనే వైకాపా నేరాలు-ఘోరాలకు పాల్పడిందని, భాజపా, తెరాస మద్దతుతో అరాచకాలు సృష్టించిందని ముఖ్యమంత్రి విమర్శించారు. ఓటర్లను పోలింగ్‌కు రాకుండా చేయాలనే బీభత్సకాండ సృష్టించిందన్నారు. దీన్నంతా నిరసించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. వైకాపా ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సింది ఓర్లేనంటూ వారికి ధైర్యం నూరిపోశారు. ఈ ఎన్నిక రాష్ట్రంలో శాంతిస్థాపనకు నాంది కావాలంటూ ప్రసార మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేశారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని మండిపడ్డారు. ఈవీఎంల వైఫల్యంతో విసిగి వెనక్కి వెళ్లిన వారంతా తిరిగి పోలింగ్‌ కేంద్రాలకు రావాలంటూ సీఎం అభ్యర్థించారు. రాష్ట్రం కోసం ఈ ఒక్క రోజూ కష్టపడండని, మళ్లీ పోలింగ్‌ కేంద్రాలకకు వెళ్లి ఓట్లు వేయాలని కోరారు. సాయంత్రం ఐదింటిలోపే బూత్‌ ప్రాంగణాలకు ఓటర్లు చేరుకోవాలని, ఓటింగ్‌ను అడ్డుకోవాలనే వైకాపా కుట్రలను విఫలం చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటు వేయకపోతే అరాచకాన్ని ప్రోత్సాహించినట్లే అవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఐదేళ్లు కష్టపడ్డానని, అరాచక మూకల చేతుల్లోకి దాన్ని పోనివ్వద్దంటూ పిలుపునిచ్చారు. ఓటు వేసే గంట విలువ రాబోయే ఐదేళ్ల బంగారు జీవితానికి పునాదని, రాష్ట్రాన్ని బిడ్డలా భావించి తప్పక ఓటువేయాలని సూచించారు. మరోవంక.. ఈవీఎంల మొరాయింపు సమస్యతో పోలింగ్‌ ఆలస్యంగా ఆరంభమైన కేంద్రాల్లో సమయాన్ని పొడిగించాలని కోరుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సమస్యలను అధిగమించి ఓటింగులో పాల్గొన్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు