కరోనా ముందు స్థాయిలకు నియామకాలు - Appointments to corona front levels
close

Published : 29/12/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ముందు స్థాయిలకు నియామకాలు

2021లో సాధ్యమే: సర్వే

ముంబయి: కరోనా ముందు స్థాయులకు నియామకాలు కొత్త ఏడాదిలో చేరుకుంటాయని కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. 1327 కంపెనీలు, కన్సలెంట్లతో నౌకరీ.కామ్‌ నిర్వహించిన హైరింగ్‌ అవుట్‌లుక్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అందులో ఇంకా ఏముందంటే..
* వచ్చే 3-6 నెలల్లో కరోనా ముందు స్థాయులకు నియామకాలు చేరతాయని 26 శాతం కంపెనీలు అంటున్నాయి. అందుకు 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టొచ్చని 34 శాతం సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
* కొవిడ్‌ వల్ల వైద్య లేదా ఆరోగ్య సంరక్షణ, ఐటీ, బీపీఓ/ఐటీఈఎస్‌ రంగాల్లోని నియమాకాలపై పెద్ద ప్రభావం పడలేదు. రిటైల్‌, ఆతిథ్య, రవాణా రంగాల్లో ఉద్యోగవకాశాలు తగ్గాయి.
* 2020 నియామకాల మార్కెట్‌ సానుకూల ధోరణితోనే ప్రారంభమైంది. కరోనా ముందు వరకు కూడా వృద్ధి కనిపించింది. మార్చి ఆఖరులో లాక్‌డౌన్‌ విధించడంతో, ఏప్రిల్‌, మే నెలల కల్లా నియామకాలు 2019 అదే సమయంలో పోలిస్తే 60 శాతం వరకు తగ్గాయి. జూన్‌ నుంచి స్థిరంగా పుంజుకోవడం ప్రారంభించాయి. అయినప్పటికీ 28 శాతం తక్కువగానే నమోదయ్యాయి.
* పని సంప్రదాయాల్లో మార్పులు, డిజిటైజేషన్‌పై ఆధారపడే తత్వాన్ని బట్టి కీలక రంగాల్లో నియమాకాల హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి.
బ్రెగ్జిట్‌ తర్వాతా మన ఐటీ-ఫార్మాకు ఢోకా లేదు
బెంగళూరు: యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) వైదొలగడం వల్ల భారత ఐటీ, ఔషధ కంపెనీలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పరిశ్రమ దిగ్గజాలు అంటున్నాయి. బ్రెగ్జిట్‌ తర్వాతా భారత వ్యాపారాలు యథాతథంగానే కొనసాగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ డిసెంబరు 31న వైదొలగనున్న నేపథ్యంలో ఈ అభిప్రాయాలు వెల్లడయ్యాయి.  
‘బ్రిటన్‌లో భారత టెకీలకు మంచి వీసా విధానమే ఉంది కాబట్టి భారత్‌పై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదు. ఐరోపాలోనే అంతే. కాబట్టి బ్రెగ్జిట్‌ తర్వాత విపరీతమైన మార్పులు ఉంటాయని భావించడం లేదు. అంతక్రితం కూడా వీసాల విషయంలో బ్రిటన్‌, ఐరోపాలతో విడివిడిగానే కంపెనీలు సంప్రదింపులు జరిపేవ’ని ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ, ఎక్స్‌ఫినిటీ వెంచర్‌ పార్టనర్స్‌ ఛైర్మన్‌ కూడా అయిన వి. బాలకృష్ణన్‌ పేర్కొన్నారు.
‘బ్రిటన్‌ మార్కెట్లో భారత ఫార్మా రంగం కీలకమైనది. బ్రెగ్జిట్‌ తర్వాత కూడా కీలక విభాగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం వల్ల భారత్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఆ విభాగాల్లో ఫార్మా కూడా ఒకట’ని బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా పేర్కొన్నారు.


ఒకే రకంగా ప్రయాణ బీమా
ఐఆర్‌డీఏఐ ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఉపయోగపడే ప్రయాణ బీమాకు సంబంధించి ఒక ప్రామాణిక పాలసీని తీసుకురావాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రతిపాదించింది. కవరేజీ, మినహాయింపులు, నియమ నిబంధనలన్నీ ఒకే విధంగా ఉండేలా ఈ పాలసీ ముసాయిదాను విడుదల చేసింది. బీమా సంస్థలు తమ అభిప్రాయాలను 2021 జనవరి 6 లోగా పంపించాలని సూచించింది. విదేశీ ప్రయాణాల్లో తీవ్రంగా గాయపడిన తర్వాత 365 రోజుల్లోగా మరణిస్తే.. పూర్తి పరిహారాన్ని నామినీ/వారసులకు ఇవ్వడం లాంటివి ఇందులో ప్రతిపాదించారు. ఒకవేళ పాలసీదారుడు మైనర్‌ అయితే, పాలసీ మొత్తంలో 50శాతం ఇవ్వాల్సి ఉంటుంది. దేశీయ ప్రయాణాల్లోనూ ప్రజా రవాణాలో ప్రయణిస్తున్నప్పుడు ప్రమాదం బారిన పడి, 365 రోజుల్లోగా మరణిస్తే పరిహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. విమానాన్ని అందుకోలేకపోవడం, సామగ్రి పోవడం, ప్రయాణం ఆలస్యం, పాస్‌పోర్టు పోవడం లాంటి సందర్భాలతో పాటు, ప్రమాదవశాత్తు మరణిస్తే.. పార్థివదేహాన్ని తరలించడం లాంటివీ ఈ ప్రయాణ బీమాలో భాగంగా ఉంటాయి. అయితే, వైద్య చికిత్సల కోసం చేసే ప్రయాణాలకు ఈ బీమా వర్తించదు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని