2024 కల్లా గ్యాస్‌ ఉత్పత్తిలో 52% వృద్ధి - Gas production to grow by 52 percent by 2024
close

Published : 23/04/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2024 కల్లా గ్యాస్‌ ఉత్పత్తిలో 52% వృద్ధి

ఓఎన్‌జీసీ, రిలయన్స్‌-బీపీలే కీలకం

దిల్లీ: 2024 కల్లా భారత సహజ వాయువు ఉత్పత్తి 52 శాతం పెరిగి రోజుకు 122 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీ)కు చేరుకుంటుందని అంచనా. రిలయన్స్‌-బీపీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ సైతం కేజీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి పెంచనుండడమే ఇందుకు కారణం. 2019-20లో సహజ వాయువు ఉత్పత్తి 85 ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీ కాగా.. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 80 ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీకి పరిమితమైందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి 93 ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎండీకి; వచ్చే ఆర్థిక సంవత్సరంలో 107 ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎండీకి; 2023-24కు 122 ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీకి చేరుకోగలదని ఆ బ్రోకరేజీ అంచనా వేసింది. దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను 2030 కల్లా 15 శాతానికి పెంచుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఉత్పత్తి తోడ్పాటునందిస్తుందని తెలిపింది.

సున్నా ఉద్గారాలే విప్రో పర్యావరణ లక్ష్యం

దిల్లీ: 2040 కల్లా నికర సున్నా ఉద్గారాలు (జీహెచ్‌జీ) సాధించాలని ఐటీ దిగ్గజం విప్రో లక్ష్యంగా పెట్టుకుంది. పారిస్‌ ఒప్పందం ప్రకారం.. ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా జీహెచ్‌జీ ఉద్గారాల విషయంలో విప్రో లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా 2030 కల్లా ఉద్గారాలను 2016-17తో పోలిస్తే 55 శాతం మేర తగ్గించుకోవాలన్న మధ్యంతర లక్ష్యాన్నీ పెట్టుకుంది. పునరుత్పాదక ఇంధనాన్ని పెంచుకోవడం కోసం ప్రైవేటు ఇంధన కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. సొంతంగా సౌర విద్యుత్‌నూ ఏర్పాటు చేసుకోనుంది. తద్వారా మొత్తం మీద ఇంధన వినియోగాన్ని తగ్గించుకోనుంది. ఇంధనం, నీటి వినియోగాన్ని గత రెండు దశాబ్దాలుగా స్థిరంగా తగ్గించుకుంటూ వస్తున్నట్లు విప్రో తెలిపింది. లక్షాన్ని చేరడమే తమ ప్రాధాన్యత కాదని.. ఆ మార్గంలో విప్రో విలువలు, వ్యాపార బాధ్యతలనూ కొనసాగిస్తామని కంపెనీ ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. కంపెనీ కార్యకలాపాల్లో పర్యావరణహిత ఇంధన వనరులను ఏర్పాటు చేస్తామని కంపెనీ సీఈఓ, ఎండీ థియరీ డెలాపోర్ట్‌ తెలిపారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని