మస్క్‌, బెజోస్‌లను దాటేసిన అదానీ! - Gautam Adani beats Elon Musk Jeff Bezos
close

Updated : 12/03/2021 18:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మస్క్‌, బెజోస్‌లను దాటేసిన అదానీ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ సంపాదన భారీగా పెరిగింది. అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో ఈ ఏడాది(2021)లో అతి ఎక్కువ సంపదను ఆర్జించిన వ్యక్తిగా నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో నంబర్‌ 1 స్థానానికి పోటీ పడుతున్న ఎలన్‌ మస్క్‌, బెజోస్‌ కంటే అదానీ ఈ విషయంలో ముందున్నారు.

16.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ నికర ఆస్తి విలువ 2021లో 50 బిలియన్‌ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. భారత్‌కు చెందిన మరో కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపాదనపరుడైన ముకేశ్‌ అంబానీ సంపాదన ఇదే సమయంలో 8.1 బిలియన్ల డాలర్లు పెరగడం గమనార్హం. అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు ఒకటి మినహా మిగిలినవన్నీ తక్కువలో తక్కువ 50 శాతం మేర దూసుకెళ్లడంతో అదానీ సంపాదన 2021లో ఈ స్థాయిలో పెరిగింది.

అదానీకి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, కోల్‌మైన్స్‌, పవర్‌ ప్లాంట్లు వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలున్నాయి. ఇటీవల 1 గిగావాట్‌ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ను దేశంలో ఏర్పాటు చేసేందుకు సైతం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ముందుకొచ్చింది. దీంతో సాంకేతిక రంగంలోనూ అదానీ గ్రూప్‌ అడుగుపెట్టినట్లయ్యింది. ఈ ఒక్క ఏడాదిలో అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ షేర్లు 96 శాతం మేర పెరగ్గా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 90%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 79% మేర దూసుకెళ్లాయి. ఇక అదానీ పవర్‌ లిమిటెడ్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్స్‌ లిమిటెడ్‌ వంటి కంపెనీల షేర్లు 52% మేర రాణించాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఒక్కటి  మాత్రమే 12% వృద్ధి చెందింది. గతేడాది ఈ కంపెనీ షేరు 500% మేర పెరగడం గమనార్హం.

ఇవీ చదవండి..
మా ఉద్యోగుల టీకా ఖర్చుమాదే..
బ్యాంకులకు 4 రోజుల వరుస సెలవులు!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని