ఈ ఏడాది వేతనాలు ఎంత పెరగొచ్చంటే.. - India to see average salary increase of 7pc in 2021 says a Survey
close

Published : 15/02/2021 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఏడాది వేతనాలు ఎంత పెరగొచ్చంటే..

ప్రముఖ సర్వే అంచనాలు

దిల్లీ: 2021లో భారత్‌లో ఉద్యోగుల వేతన పెంపు సగటు 6.4 శాతంగా ఉండే అవకాశం ఉందని విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ సర్వే నివేదిక అంచనా వేసింది. గత ఏడాదిలో నమోదైన 5.9 శాతం సగటుతో పోలిస్తే ఈసారి జీతభత్యాలు కాస్త మెరుగుపడనున్నాయని పేర్కొంది. కరోనా సంక్షోభంతో కుదేలైన కార్పొరేట్‌ రంగం భారీగా పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ ఇండియా టాలెంట్‌ అండ్‌ రివార్డ్‌ విభాగ అధిపతి రాజుల్‌ మాథుర్‌ అన్నారు. కానీ, అదే స్థాయిలో వేతన పెంపు బడ్జెట్‌లో పెరుగుదల ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రతిభకే పట్టం...

సంస్థల్లో కీలక ఉద్యోగులు, అత్యంత ప్రతిభ కనబరుస్తున్న నిపుణులకు వేతన పెంపులో కంపెనీలు పెద్దపీట వేసే అవకాశం ఉందని ఈ సర్వే తెలిపింది. సంస్థల్లో అత్యంత మెరుగైన ప్రతిభ కనబరిచే వారికి ఈ ఏడాది సగటున 20.6 శాతం వేతన పెంపు ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. ఈ కేటగిరీ కిందకు వచ్చే ఉద్యోగులు మన దేశంలో 10.3 శాతం మంది ఉన్నట్లు అంచనా. ‘శాలరీ బడ్జెట్‌ ప్లానింగ్‌ రిపోర్ట్‌’ పేరిట రూపొందించిన ఈ నివేదిక గత ఏడాది అక్టోబరు/నవంబరులో ఆన్‌లైన్‌ ద్వారా 130 దేశాలకు చెందిన 18,000 కంపెనీల ప్రతినిధుల నుంచి సేకరించిన సమాచారంతో సర్వే చేసి తయారు చేశారు. సర్వేలో పాల్గొన్న భారత కంపెనీల్లో 37 శాతం.. వచ్చే సంవత్సర కాలంలో ఆదాయంపై సానుకూలంగా ఉన్నట్లు తేలింది. అయితే, ఉద్యోగ నియామకాలు మాత్రం ఇంకా పుంజుకోవాల్సి ఉంది. కేవలం 10 శాతం కంపెనీలు మాత్రమే కొత్త ఉద్యోగులకు అవకాశం కల్పించేందుకు ఆసక్తి కనబరిచాయి.

ఆయా దేశాలు, రంగాల్లో ఇలా...

ఇక ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని కీలక మార్కెట్లయిన ఇండోనేసియాలో 6.5 శాతం, చైనాలో 6 శాతం, ఫిలిప్పీన్స్‌లో 5 శాతం, సింగపూర్‌లో 3.5 శాతం, హాంకాంగ్‌లో 3 శాతం వేతన పెంపు ఉండొచ్చని సర్వే లెక్క గట్టింది. సాంకేతిక, ఔషధ, కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్ అండ్‌ రిటైల్ రంగాల్లోని ఉద్యోగులకు సగటున 8 శాతం జీతం పెరిగే అవకాశం ఉందని లెక్కగట్టింది. ఆర్థిక సేవలు, తయారీ రంగాల్లో పని చేసే వారి వేతనాలు 7 శాతం, బీపీఓ సెక్టార్‌లో పని చేసే వారి వేతనం 6 శాతం, ఇంధన రంగంలో పని చేసే వారి వేతనం అత్యల్పంగా 4.6 శాతం పెరగొచ్చని సర్వే తెలిపింది.

ఇవీ చదవండి...
బ్యాంకు...మీ ఇంటి వద్దకే...

ఆరోగ్య బీమా.. ప్రీమియం ఇలా..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని