Stock Market: బుల్ జోరుకు బ్రేక్‌.. సూచీల ఆరంభ లాభాలు ఆవిరి - Market snaps 7 session winning run
close

Updated : 19/10/2021 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: బుల్ జోరుకు బ్రేక్‌.. సూచీల ఆరంభ లాభాలు ఆవిరి

ముంబయి: దేశీయ మార్కెట్ల లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. గత ఏడు సెషన్లలో దూకుడు మీదున్న బుల్‌.. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఒడుదొడుకులను ఎదుర్కొంది. గరిష్ఠ స్థాయిలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు స్వల్ప నష్టాలను చవిచూశాయి. 

దేశీయంగా ఉన్న బలమైన సానుకూల సంకేతాలతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 400 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఆరంభంలోనే 62వేల మైలురాయిని దాటింది. ఒక దశలో 62,245 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అయితే కాసేపటికే సూచీ జోరు నెమ్మదించింది. గరిష్ఠ స్థాయిలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఆరంభ లాభాలను కోల్పోయిన సెన్సెక్స్‌ నష్టాల్లోకి జారుకుంది. రోజులో చాలా వరకు లాభనష్టాల్లో ఊగిసలాడిన సూచీ.. చివరకు 49.54 పాయింట్లు కోల్పోయి 61,716.05 వద్ద ముగిసింది. అటు జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ కూడా 58.30 పాయింట్లు దిగజారి.. 18,418.75 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీలో టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫోసిస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు లాభపడగా.. ఐటీసీ, టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌, టైటాన్ షేర్లు పతనమయ్యాయి. రంగాల వారీగా ఐటీ, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు రాణించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, రియల్టీ సూచీలు దాదాపు 2 శాతం మేర కుంగాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని