హోండాకు కొత్త అధిపతి - New head for Honda
close

Updated : 20/02/2021 07:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హోండాకు కొత్త అధిపతి

టోక్యో: జపాన్‌ వాహన దిగ్గజం హోండా ప్రెసిడెంట్‌గా ఒక సాంకేతిక నిపుణుడు నియమితులయ్యారు. సరికొత్త వృద్ధి దిశగా కంపెనీని నడిపించడానికి, పర్యావరణ మోడళ్లు, భద్రతా సాంకేతికతపై దృష్టి సారించేందుకు పరిశోధనా నిపుణుడైన తొషిహిరో మైబ్‌ను కంపెనీ ప్రెసిడెంట్‌గా నియమించారు. ప్రస్తుత ప్రెసిడెంట్‌ తకహిరో హచిగో స్థానంలో ఏప్రిల్‌ 1 నుంచి ఈయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ‘హచిగో ఎంతో కష్టపడి వేసిన పునాదిపై ,హోండా భవిష్యత్‌ ఇంటిని నేను నిర్మించదలచాను. ఆ భవనం చిరస్థాయిగా నిలిచిపోయాలా జాగ్రత్తలు తీసుకుంటామ’ని మైబ్‌ విలేకర్లతో అన్నారు. 1987లో హోండాలో చేరిన మైబ్‌ భావి ప్రెసిడెంట్‌ అవుతారని జపాన్‌ మీడియా ఎప్పటి నుంచో అంచనాలు వేస్తోంది. అమెరికాకు చెందిన జనరల్‌ మోటార్స్‌(జీఎమ్‌)తో హోండా భాగస్వామ్యం కుదుర్చుకోవడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. రెండు దశాబ్దాలుగా ఈ రెండు కంపెనీలూ కలిసి ఉండడం విశేషం.


కెయిర్న్‌పై అప్పీలుకు ప్రభుత్వం సై!

దిల్లీ: 1.4 బిలియన్‌ డాలర్ల అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేసులో గెలిచిన కెయిర్న్‌ ఎనర్జీపై అప్పీలుకు వెళ్లాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ పన్ను వివాద పరిష్కారానికి ఆర్థిక కార్యదర్శి, కంపెనీ అధికారుల మధ్య రెండు రోజుల పాటు చర్చలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయం రాలేదని.. అందుకే ప్రభుత్వం అప్పీలుకు వెళ్లవచ్చని ఈ పరిణామాలతో సంబంధమున్న వర్గాలు పేర్కొన్నాయి. పన్ను విషయంలో తన సార్వభౌమ హక్కును రక్షించుకునేందుకే ప్రభుత్వం మొగ్గుచూపొచ్చని సమాచారం. కెయిర్న్‌ సీఈఓ సైమన్‌ థామ్సన్‌, ఆర్థిక కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ల మధ్య సమావేశం ముగిశాక ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని తెలిపాయి. కెయిర్న్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య గురు-శుక్రవారాల్లో జరిగిన చర్చల్లో ప్రభుత్వం అప్పీలుకు వెళుతుందన్న అంశం చర్చకు రాలేదని మరో అధికారి పేర్కొన్నారు. 2006-07లో ఐపీఓకు ముందు భారత వ్యాపారాలను ఆ బ్రిటిష్‌ కంపెనీ పునర్నిర్మించగా, వచ్చిన మూలధన లాభాలకు సంబంధించి భారత పన్ను విభాగం మార్చి 2015లో రూ.10,247 కోట్ల పన్ను నోటీసు పంపిన విషయం తెలిసిందే.


మళ్లీ తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు

ముంబయి: విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు మళ్లీ తగ్గాయి. ఫిబ్రవరి 12తో ముగిసిన వారానికి ఫారెక్స్‌ నిల్వలు 249 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1840 కోట్లు) తగ్గి 583.697 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.43.7 లక్షల కోట్లు)కు చేరాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. విదేశీ కరెన్సీ ఆస్తులు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్‌బీఐ తెలిపింది. అంతకు ముందు వారంలో నిల్వలు 6.24 బి.డాలర్లు తగ్గి 583.945 బి.డాలర్లుగా నమోదయ్యాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు 1.387 బిలియన్‌ డాలర్లు తగ్గి 540.951 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.40 లక్షల కోట్లు)కు చేరాయి. బంగారు నిల్వలు 1.26 బిలియన్‌ డాలర్లు పెరిగి 36.227 బిలియన్‌ డాలర్లకు చేరాయి. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) 10 మిలియన్‌ డాలర్లు పుంజుకుని 1.513 బిలియన్‌ డాలర్ల వద్ద ఉన్నాయి. ఐఎంఎఫ్‌లో దేశ నిల్వల స్థానం 132 మి.డాలర్లు తగ్గి 5.006 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ పేర్కొంది.


స్థిరమైన వ్యాపారంతోనే అధిక లాభదాయకత

యాక్సెంచర్‌ సీఈఓ జూలీ స్వీట్‌

దిల్లీ: స్థిరమైన వ్యాపారాన్ని నిర్మించడంతోనే సంస్థలకు ఎక్కువ లాభాలు వస్తాయని, విజయం దిశగా అడుగులు పడతాయని యాక్సెంచర్‌ సీఈఓ జూలీ స్వీట్‌ వెల్లడించారు. ఇతరుల నుంచి తమను వేరుగా చూపించుకునేందుకు కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. నాస్కామ్‌ టెక్నాలజీ అండ్‌ లీడర్‌షిప్‌ ఫోరమ్‌లో ఆమె మాట్లాడారు. ‘కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జీవితాలను, వ్యాపారాలను ప్రభావితం చేసినప్పటికీ ప్రజలు ఒకరితో ఒకరు కలిసి ఉండటాన్ని కొనసాగించారు. ప్రతి వ్యాపారం కూడా స్థిరంగా సాగగలదనేది మా అంచనా. ఒకసారి స్థిరమైన వ్యాపారం నిర్మించగలిగితే అధిక లాభదాయకత, విజయం సాధించడం సులువవుతుంద’ని జూలీ వివరించారు. తమ వ్యాపార వ్యూహంలో స్థిరత్వాన్ని సాధించేందుకు ప్రయత్నించిన కంపెనీలు మిగతా వాటితో పోలిస్తే 2.5 రెట్లు అధికంగా విజయం సాధించాయని ఒక పరిశోధనను ఆమె ఉటంకించారు. స్థిరత్వం సాధించడానికి కంపెనీల్లోని ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచాల్సిన (రీస్కిల్లింగ్‌) అవసరం ఉంటుంది. వారిలో సమర్థత పెరిగితే, ఉత్పాదకత పెరిగి, వ్యయాలు కూడా నియంత్రణలోకి వస్తాయని, తద్వారా లాభదాయకత పెరుగుతందని ఆమె అభిప్రాయపడ్డారు. యాక్సెంచర్‌లో స్థిరత్వం సాధించేందుకు ఉద్యోగులకు లక్షల గంటల కొద్దీ నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నట్లు, ఇందుకోసం వందల కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని