భారత్‌తో వాణిజ్యం ఉండబోదు: ఇమ్రాన్‌ఖాన్‌ - No trade with India says Pak PM Khan
close

Updated : 03/04/2021 13:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌తో వాణిజ్యం ఉండబోదు: ఇమ్రాన్‌ఖాన్‌

ఇస్లామాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో ఎలాంటి వాణిజ్యం నిర్వహించేది లేదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. గురువారం కేబినెట్‌ సభ్యులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రముఖ పత్రిక ‘డాన్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్‌ నుంచి చక్కెర, పత్తి దిగుమతుల నిర్ణయంపై పాకిస్థాన్‌ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూటర్న్‌ తీసుకోవడానికి ముందు జరిగిన పరిణామాలను కొన్ని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ డాన్‌ ప్రచురించింది. 

పత్తి, చక్కెర విషయంలో పాకిస్థాన్‌ తీవ్ర కొరత ఎదుర్కొంటోంది. దీంతో భారత్‌ నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పాక్‌ ఆర్థిక మంత్రి హమ్మద్‌ అజహర్‌ బుధవారమే ప్రకటన చేశారు. ఒక్క రోజులోనే దీనికి విరుద్ధంగా పాక్‌ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో వాణిజ్యం ఉండబోదని ఆ దేశ మానవ హక్కుల మంత్రి షిరీన్‌ మజారీ ట్వీట్‌ చేశారు. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌ స్వయంప్రతిపత్తి రద్దు తర్వాత భారత్‌తో ఉన్న వాణిజ్య సంబంధాలను పాక్‌ పూర్తిగా నిలిపివేసింది.

డాన్‌ కథనం ప్రకారం.. ఈ పరిణామాలపై ఇమ్రాన్‌ఖాన్‌ శుక్రవారం కేబినెట్‌ సమావేశంలో చర్చించారు. కొరత ఉన్న వస్తువుల దిగుమతి కోసం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ‘ఎకనమిక్‌ కోఆర్డినేషన్‌ కమిటీ(ఈసీసీ)’ సిఫార్సుల మేరకు భారత్‌ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకోవాలన్న ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదనలను పక్కనపెట్టేయాలన్నారు. జమ్మూ-కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి రద్దు వంటి చర్యలను వెనక్కి తీసుకోనంత కాలం భారత్‌తో సాధారణ సంబంధాలు ఉండబోవని ఇమ్రాన్‌ఖాన్‌ స్పష్టం చేశారు.

పాక్‌తో భారత్‌ ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటోంది. అయితే, ఆ గడ్డపై సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేయాలని కోరుతోంది. కానీ, ఇప్పటి వరకు పాక్‌ ఆ దిశగా పటష్ఠ చర్యలు తీసుకోలేదు. దీంతో ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పే బాధ్యత పాక్‌పైనే ఉందని భారత్ స్ప ష్టం చేసింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని