Petrol Prices: 7 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టిన పెట్రోల్‌! - Petrol prices crossed rs 100 in 7 states
close

Updated : 18/06/2021 13:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Petrol Prices: 7 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టిన పెట్రోల్‌!

దిల్లీ: ఒకరోజు విరామం తర్వాత దేశంలో పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 26-27 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 28-30 పైసలు పెంచుతూ శుక్రవారం దేశీయ ఇంధన విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103 చేరుకుంది. ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ.109కి చేరడం గమనార్హం. మొత్తం 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 పైకి ఎగబాకింది. ఈ జాబితాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, లద్దాఖ్‌, కర్ణాటక ఉన్నాయి.

మే 29న ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 చేరుకుంది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టడం అదే మొదటిసారి. ప్రస్తుతం ముంబయిలో లీటర్ పెట్రోల్‌ రూ.103.8గా, డీజిల్‌ ధర రూ.95.14గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.74గా, డీజిల్‌ రూ.95.59గా నడుస్తోంది. దేశ రాజధాని దిల్లీలో ఈ రేట్లు వరుసగా.. రూ.96.93, రూ.87.69గా ఉన్నాయి.

మే తొలి వారం నుంచి ప్రారంభమైన ధరల పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతకుముందు ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు 18 రోజుల పాటు ధరల పెరుగుదల నిలిచిపోయింది. మే 4 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు పెట్రోల్‌ ధర రూ.6, డీజిల్‌ ధర రూ.7 ప్రియమైంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వరుసగా రెండో రోజూ పడిపోయాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో డాలర్‌ బలపడింది. దీంతో బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ బ్యారెల్‌ ధర 52 సెంట్లు పడిపోయి 72.56 డాలర్లుగా నడుస్తోంది. ఇక యూఎస్‌ డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 48 సెంట్లు తగ్గి 70.56 డాలర్లుగా కొనసాగుతోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని