15,000 దిగువకు నిఫ్టీ - Sensex down by 397 pts
close

Published : 15/03/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15,000 దిగువకు నిఫ్టీ

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ ఒడుదొడుకులను చవిచూశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాల నేపథ్యంలో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అంతకంతకూ దిగజారుతూ పోయాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ కీలక 50వేల మార్క్‌ను.. నిఫ్టీ 15వేల మార్క్‌ను కోల్పోయాయి. ఉదయం 51,404 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ ప్రీట్రేడింగ్‌లో 50,834 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత 49,799 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 397 పాయింట్లు నష్టపోయి 50,395 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15,048 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 15,048 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి 303 పాయింట్లు కోల్పోయి 14,745 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 107 పాయింట్లు నష్టపోయి 14,923 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.47 వద్ద నిలిచింది.

ఆసియా సూచీలు మిశ్రమంగా కదలాడాయి. కరోనా తర్వాత చైనా పునరుత్తేజంపై వెలువడిన గణాంకాలు ప్రతికూలంగా ఉండడం అక్కడి మదుపర్లను నిరాశ పరిచింది. దీంతో షాంఘై కాంపోజిట్‌ నష్టాల్లో ముగిసింది. మరోవైపు అమెరికా సూచీలు గతవారాన్ని ప్రతికూలంగా ముగించాయి. ఇక శుక్రవారం వెలువడిన రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తికి సంబంధించిన గణాంకాలు మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపగా.. మధ్యాహ్నం సమయంలో వచ్చిన టోకు ద్రవ్యోల్బణ సూచీ గణాంకాలు తీవ్ర నిరాశలోకి నెట్టాయి. దీంతో ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను కాసేపు తీవ్రంగా కలవరపెట్టాయి. అయితే, మధ్యాహ్నం 1:30 గంటల నుంచి లోహ, విద్యుత్తు, బేసిక్‌ మెటీరియల్స్‌ రంగాల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కోలుకున్నాయి. అయినప్పటికీ లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాలను ఆర్జించాయి. దివీస్‌ ల్యాబ్‌, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లిమిటెడ్‌, కోల్‌ ఇండియా, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని