ఈ ఏడాది మీ పొదుపును పరుగులు పెట్టించాలంటే.. - Ways to save more this year
close

Updated : 16/02/2021 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఏడాది మీ పొదుపును పరుగులు పెట్టించాలంటే..

ఈ సూత్రాలను పాటించండి

‘రూపాయిని ఆదా చేస్తే.. రూపాయి సంపాదించినట్లే’ ఈ పొదుపు మంత్రం అందరికీ తెలిసిందే. దీని విలువ కరోనా సంక్షోభంలో ప్రతిఒక్కరికీ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. కొవిడ్‌ సంక్షోభంలో అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, పొదుపు మంత్రం ముందు నుంచీ పాటించినవారు కాస్త సర్దుబాటు చేసుకోగలిగారు. ఇక ఆదాపై అంతగా శ్రద్ధ పెట్టనివారికి ఇక్కట్లు తప్పలేదు. 

ఇక 2020లో అనేక మంది ఆర్థిక ప్రణాళికలు పేపర్లకే పరిమితమయ్యాయి. తగినంత డబ్బు లేక అన్నింటినీ వాయిదా వేయడమో లేక శాశ్వతంగా పక్కనపెట్టడమో చెయ్యాల్సి వచ్చింది. కొన్ని తప్పనిసరి బాధ్యతల్ని మాత్రం 2021లోనైనా నిభాయించాల్సిందే. ఈ నేపథ్యంలో వాటన్నింటినీ తిరిగి గాడిన పెట్టాలంటే గత ఏడాది నష్టాల్ని పూడ్చుకోవడంతో పాటు మరింత ఎక్కువ సొమ్మును సమకూర్చుకోవాలి. దీనికి మన దగ్గర ఉన్న తక్షణ మార్గం.. పొదుపును పెంచుకోవడం. మరి దానికోసం పాటించాల్సిన కొన్ని కీలక సూత్రాలేంటో చూద్దాం..!


2020లో మీ ఆర్థిక ప్రయాణాన్ని సమీక్షించండి

గత ఏడాది మీ ఆర్థిక చరిత్రను తీరిగ్గా కూర్చుకొని సమగ్రంగా విశ్లేషించండి. 2020లో మీరు వేసుకున్న ఆర్థిక ప్రణాళిక నుంచి మొదలు పెట్టండి. మీ ఆదాయ వనరులు ఏంటి.. అవి ఎలా దెబ్బతిన్నాయో గమనించండి. వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టారో చూడండి. అనసరంగా ఖర్చు చేశారేమో ఆలోచించండి. అవి ఈ ఏడాది జరగకుండా జాగ్రత్తపడండి. ఎక్కడ సర్దుబాటు చేసుకోగలరో యోచించండి. పోయిన ఆదాయ వనరుల్ని తిరిగి ఎలా రాబట్టుకోవాలో ఆలోచించండి. తప్పు ఎక్కడ జరిగిందో మథించండి. లేదా ప్రత్యామ్నాయాలైనా వెతకండి. అలా తొలుత మీ ఆదాయ వనరులపై సమగ్రంగా సమీక్షించుకోండి. ఆదాయం ఉంటేనే కదా.. పొదుపు చేసేది!


పొదుపు ఫస్ట్‌... ఖర్చులు నెక్ట్స్‌..

సాధారణంగా ఎక్కువ మంది ఖర్చులు పోయిన తర్వాత మిగిలింది పొదుపు చేస్తుంటారు. కానీ, అది ఆచరణీయం కాదు. మన స్తోమత, ఖర్చులను బట్టి కచ్చితంగా ఇంత పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. నెలాఖరులో మీ వేతనం రాగానే దాంట్లో నుంచి పొదుపును తీసి పక్కన పెట్టాలి. మిగిలిన దాన్ని ఖర్చులకు వాడుకోవాలి. అయితే, మీ లక్ష్యం సమంజసంగా ఉండాలి. కనీస అవసరాలకు కూడా లేనంతగా పొదుపు చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా పొదుపులో 50:30:20 థంబ్‌ రూల్‌ను పాటిస్తుంటారు. అంటే మన ఆదాయంలో 50% కనీస అవసరాలకు, 30% కోరికలకు, 20% పొదుపునకు వినియోగించాలని సూచిస్తుంటారు. కానీ, ఈ ఏడాది దీన్ని కాస్త మార్చుకోవడం మంచిది. మీ ఆర్థిక పరిస్థితి, బాధ్యతలను బట్టి దీన్ని 50:20:30 మరీ అవసరమైతే 50:10:40గా మార్చుకోండి. సంక్షోభం కారణంగా ఇప్పటికే ఏడాది నుంచి విహార యాత్రలు, పార్టీలు, సినిమాలు, షికార్లకు దూరమయ్యారు. మరో సంవత్సరం పాటు వీటిని నియంత్రించాలంటే కష్టమైన పనే. కానీ, మన అవసరాలను బట్టి తప్పదు. పూర్తిగా కట్టడి చేయకుండా కొంత పరిమితి విధించుకుంటే 2022 నాటికి భారం తగ్గుతుంది.


తెలివిగా ఖర్చు చేయండి

జీవితంలో ఖర్చులు తప్పవు. అలా అని నియంత్రణ లేని ఖర్చు ప్రమాదకరం. మీ ఖర్చుని ప్రణాళికాబద్ధంగా ఉండేలా చూసుకోండి. అత్యవసరమైతేనే జేబు నుంచి డబ్బు తీయండి. మీ జేబు నుంచి వెళుతున్న ప్రతి పైసాతో మీకు ప్రయోజనం ఒనగూరేలా చూసుకోండి. ఇక ప్రయాణాలు తప్పనిసరైతే ముందే ప్రణాళిక వేసుకోండి. గరిష్ఠంగా ఎంత ఖర్చు చేయాలో ముందే నిర్ణయించుకోండి. టికెట్‌, హోటల్‌, ఆహారం కోసం ఖర్చు చేసేటప్పుడు ఆఫర్లేమైనా ఉంటే వినియోగించుకోండి. షాపింగ్‌ విషయంలోనూ ఇదే పాటించండి. మీ క్రెడిట్‌ ఖాతాలో ఉన్న డిస్కౌంట్‌ కూపన్లను వాడుకోండి. క్యాష్‌బ్యాక్‌, ఎక్స్‌ఛేంజ్‌ వంటి ఆఫర్లను వినియోగించుకోండి. వీలైతే.. దుస్తులు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఫోన్ల వంటి కొనుగోలు కోసం ప్రత్యేక సీజన్‌ వరకు వేచిచూడండి.


ఖర్చులకూ ఓ క్రమం

మీ ఖర్చు మొట్టమొదట అత్యవసర వస్తువులు, పనులపైనే ఉండాలి. తర్వాతే మిగిలిన వాటిపై దృష్టి పెట్టండి. వాటిలోనూ మళ్లీ ఓ క్రమం పెట్టుకోండి. అత్యవసరమైన వాటిని జాబితాలో ముందు వరుసలో ఉంచండి. అలా ఒక్కొక్కటి పూర్తయిన తర్వాత చివరి వాటి వరకు మీ బడ్జెట్‌ సహకరిస్తే ముందుకు వెళ్లండి. లేదంటే వాయిదా వేయడమో.. మనేయడమో చేయండి. ప్రతి వారం మీ బడ్జెట్‌ను సమీక్షించుకోండి. దాన్ని బట్టి ఖర్చులను ప్లాన్‌ చేసుకోండి. మీ ప్రణాళికకు అనుగుణంగా మీ ఖర్చు లేకపోతే వెంటనే దిద్దుబాటు చేసుకోండి.


రుణాలపై సమీక్ష

మీకున్న అన్ని రకాల రుణాలను పూర్తిగా సమీక్షించండి. ఎంత వడ్డీరేటు ఉందో ఒకసారి చూడండి. వీలైతే వాటన్నింటినీ పునర్‌వ్యవస్థీకరించుకునే ప్రయత్నం చేయండి. ఉదాహరణకు మీరు గృహరుణం 11 శాతం వడ్డీరేటుకు తీసుకున్నట్లైతే.. దాన్ని ఇతర బ్యాంకులు టేకప్‌ చేసి తక్కువ వడ్డీరేటును ఆఫర్‌ చేస్తుంటాయి. అలాంటి వెసులుబాటు ఉంటే వినియోగించుకోవడం మంచిది. అయితే, కాలపరిమితి, ప్రాసెసింగ్‌ ఫీజు వంటి వాటన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. కేవలం వడ్డీరేటు తగ్గితే సరిపోదు. మీ నెలవారీ చెల్లింపుల్లో తగ్గింపుతో పాటు దీర్ఘకాలంలోనూ దానివల్ల మీకు ప్రయోజనం ఉండాలి.


కొత్త అప్పుల నివారణ

వీలైనంత వరకు కొత్తగా అప్పులు, రుణాలు తీసుకోకండి. ఇప్పటికే దెబ్బతిన్న మీ ఆర్థిక పరిస్థితిని ఇవి మరింత కుంగదీస్తాయి. కనీస అవసరాలకు కూడా డబ్బు సమకూరని పరిస్థితుల్లో మీ ముందున్న అన్ని మార్గాలను అన్వేషించి.. చివరి ప్రత్యామ్నాయంగా రుణ సదుపాయాన్ని వినియోగించుకోండి.

 


ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు

ప్రస్తుతం సంపాదిస్తున్న దాంట్లోనే పొదుపు చేయడంతో పాటు కొత్త ఆదాయ మార్గాల్ని అన్వేషించడం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక్కోసారి మనం పొదుపు చేసింది కూడా సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు అదనపు ఆదాయం వరంగా మారుతుంది. అయితే, మీరు ఎంచుకునే మార్గం సమర్థంగా, సమంజసనీయంగా ఉండాలి. మీ ఇల్లు పెద్దదైతే కొన్ని గదుల్ని అద్దెకు ఇవ్వడం.. మీకున్న ప్రత్యేక నైపుణ్యాల్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం, వీలైనప్పుడల్లా మీరు పనిచేసే సంస్థల్లో అదనపు గంటలు పనిచేయడం వంటి మార్గాల్ని ఎంచుకోండి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి...

మీ పిల్లలకు నేర్పుతున్నారా ఈ పాఠాలు..?

పెట్టుబడికి బంగారు బాట


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని