పెట్టుబడుల ఉపసంహరణ రూ.19,499 కోట్లే - Withdrawal of investment is Rs.19499 crore
close

Published : 01/02/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్టుబడుల ఉపసంహరణ రూ.19,499 కోట్లే

2020-21లో విధించుకున్న లక్ష్యం రూ.2.10 లక్షల కోట్లు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) పెట్టుబడుల ఉపసంహరణ, షేర్ల బైబ్యాక్‌ల ద్వారా 2020-21లో ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.19,499 కోట్ల నిధులు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ఇలా నిర్దేశించుకున్న లక్ష్యం రూ.2.10 లక్షల కోట్లు కావడం గమనార్హం.  రూ.1.2 లక్షల కోట్లు సీపీఎస్‌ఈల్లో వాటాల విక్రయాల ద్వారా, రూ.90,000 కోట్లు షేర్ల విక్రయాల ద్వారా సమీకరించాలని భావించారు. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో పెద్ద సంస్థల్లో వ్యూహాత్మక విక్రయాలు, ఎల్‌ఐసీ వంటి దిగ్గజ బీమా సంస్థను స్టాక్‌ మార్కెట్‌లో నమోదు చేయలేకపోవడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ (హెచ్‌ఏఎల్‌), భారత్‌ డైనమిక్స్‌, ఐఆర్‌సీటీసీ, సెయిల్‌ కంపెనీల్లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా వాటాలు విక్రయించి రూ.12,907 కోట్లు సమీకరించింది. ఐఆర్‌ఎఫ్‌సీ, మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీఓల ద్వారా రూ.1,984 కోట్లు రాబట్టింది. ప్రైవేటు కంపెనీల్లో ప్రభుత్వానికి ఉన్న వాటాల్ని విక్రయించడం ద్వారా మరో రూ.1,837 కోట్లను సమీకరించింది. రైట్స్‌, ఎన్‌టీపీసీ, కేఐఓసీఎల్‌, ఎన్‌ఎమ్‌డీసీ సంస్థల్లో షేర్ల బైబ్యాక్‌ ద్వారా రూ.2,769 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్‌ (గతంలో వీఎస్‌ఎన్‌ఎల్‌)లో ప్రభుత్వానికి ఉన్న 26.12 శాతం వాటా విక్రయించడానికి సిద్ధమవుతోంది. ఎయిరిండియా, బీపీసీఎల్‌, పవన్‌హాన్స్‌, బీఈఎంఎల్‌, షిప్పింగ్‌ కార్ప్‌, నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌, ఫెర్రో స్క్రాప్‌ నిగమ్‌ (ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌) వంటి సంస్థల్ని ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని