వడ్డీ రేట్లలో మార్పు లేదు
కొవిడ్-19 వల్ల గిరాకీపై అనిశ్చితి
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రూ.లక్ష కోట్ల బాండ్ల కొనుగోలు
రాష్ట్రాలకు రుణ పరిమితి పెంపు
ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష
కొవిడ్-19 కేసులు ఇటీవల మళ్లీ పెరుగుతున్నందున ఆర్థిక వ్యవస్థ వృద్ధి, గిరాకీ అంచనాల్లో అనిశ్చితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలు విధిస్తున్నందున, ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న గిరాకీపై ప్రభావం పడనుంది.ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరం ఉంది. తాజా పరిస్థితులతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలిచ్చేందుకు ద్రవ్యలభ్యత ఉంది. ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షించేందుకు, అంతర్జాతీయ ప్రతికూలతల ప్రభావం దేశీయ ఆర్థిక మార్కెట్లపై పడకుండా నియంత్రించేందుకు, ఒడుదొడుకులను తట్టుకునేందుకు సరైన సమయంలో తగు విధంగా చర్యలు చేపడతాం.
- శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లను మళ్లీ యథాతథంగా ఉంచింది. రెపో రేటు 4%, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగుతాయని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావాన్ని పరిమితం చేసేందుకు, వృద్ధిలో స్థిరత్వాన్ని తీసుకొచ్చే వరకు సర్దుబాటు విధాన వైఖరిని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ద్రవ్యపరపతి విధాన సమీక్షా సమావేశం (ఈనెల 5-7) వివరాలను బుధవారం ఆర్బీఐ వెల్లడించింది. కీలక రేట్లలో మార్పు చేయొద్దని పరపతి విధాన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. మరికొన్ని ముఖ్య వివరాలు ఇలా..
* జీడీపీ 10.5 శాతం: 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 10.5 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. ఏప్రిల్ -జూన్‌లో 26.2%; జులై- సెప్టెంబరులో 8.3%, అక్టోబరు- డిసెంబరులో 5.4%, జనవరి- మార్చిలో 6.2 శాతంగా వృద్ధి నమోదు కావచ్చు.
* ద్రవ్యోల్బణం నియంత్రిత లక్ష్య (4+2 లేదా 4-2) శ్రేణిలోనే ఉంటుందని, ఎప్పటికప్పుడు గమనిస్తుంటామని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) నాలుగో త్రైమాసికానికి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను 5 శాతానికి సవరించింది. 2021-22 తొలి అర్ధభాగానికి 5.2%, మూడో త్రైమాసికానికి 4.4 శాతంగా ద్రవ్యోల్బణం నమోదుకావచ్చు.
* అదనపు ప్రత్యేక నిధుల లభ్యత కింద నాబార్డ్‌కు రూ.25,000 కోట్లు, ఎన్‌హెచ్‌బీకి రూ.10000 కోట్లు, సిడ్బీకి రూ.15000 కోట్లు అందిస్తారు.
* ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీల పనితీరును కూలంకుషంగా సమీక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది.
* రుణ పరిమితి రూ.47,000 కోట్లకు: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్/ డబ్ల్యూఎంఏ) తీసుకునే రుణాల పరిమితిని రూ.47,000 కోట్లకు ఆర్బీఐ పెంచింది. ప్రస్తుతమున్న రూ.32,225 కోట్ల పరిమితితో పోలిస్తే ఇది 46 శాతం ఎక్కువ. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ప్రకటించిన రూ.51560 కోట్ల తాత్కాలిక డబ్ల్యూఎంఏ పరిమితిని సెప్టెంబరు 30 వరకు కొనసాగించనున్నారు.
* చెల్లింపుల బ్యాంకులు (పేమెంట్స్ బ్యాంక్స్) ఒక ఖాతాదారు నుంచి రూ.2,00,000 వరకు డిపాజిట్ స్వీకరించేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.1,00,000గా ఉంది.
* మారటోరియం అక్కర్లేదు: కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలు విధిస్తున్నప్పటికీ రుణాల చెల్లింపులకు మళ్లీ మారటోరియం సదుపాయాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాపార సంస్థలు పూర్తి సిద్ధంగా ఉన్నాయని భావిస్తున్నామని పేర్కొంది. ఆరు నెలల మారటోరియం సమయంలో రుణగ్రహీతల నుంచి వసూలు చేసిన వడ్డీపై వడ్డీని తిరిగి ఇచ్చేందుకు బోర్డు ఆమోదిత విధానాన్ని తక్షణమే అందుబాటులోకి తేవాలని బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ ఆదేశించింది. వడ్డీపై వడ్డీని రిఫండ్ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ దిశగా సత్వరమే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.
* 15 నుంచి బాండ్ల కొనుగోలు : కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ఏప్రిల్- జూన్‌లో రూ.లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇందుకుగాను సెకండ్ మార్కెట్ జీ-సెక్ అక్విజిషన్ ప్రోగ్రామ్ (జీ-ఎస్ఏపీ 1.0)ను ఆర్బీఐ ప్రకటించింది. ఏప్రిల్ 15 నుంచి మొదటి విడత బాండ్ల కొనుగోలును ప్రారంభిస్తామని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.3 లక్షల కోట్ల బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేయగా, ఈసారీ అంత/అంతకంటే అధికంగా కొనుగోలు చేయొచ్చు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. నా వద్ద జీవన్ సరళ్ పాలసీ ఉంది, 2010 నుంచి రూ. 30,025 ప్రీమియం చెల్లించాను. సరెండర్ చేస్తే ఎంత వస్తుంది?
-
Q. నా దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి. మా పాప పెళ్లి కి ఇంకా 5 ఏళ్ళ సమయం ఉంది. నా డబ్బు కి రిస్క్ లేకుండ మంచి రాబడి వచ్చే పథకాలు ఏమైనా చెప్పండి.
-
Q. నేను బ్యాంకు నుంచి ఇంటి రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు మా భార్య పేరు మీద ఉంది. ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి. ఈ రుణానికి తాను అప్లికెంట్ , నేను కో అప్లికెంట్‌గా ఉన్నాము. ఇద్దరమూ కలిసి ఈఎంఐ కడుతున్నాము కాబట్టి ఇంటి రుణం మీద పన్ను మినహాయింపు ఇద్దరూ పొందొచ్చా?