అంజనీ పోర్ట్‌ల్యాండ్‌ చేతికి భవ్య సిమెంట్‌
close

Published : 27/05/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంజనీ పోర్ట్‌ల్యాండ్‌ చేతికి భవ్య సిమెంట్‌

ఒక్కో షేరు ధర రూ.51.53

ఈనాడు, హైదరాబాద్‌: భవ్య సిమెంట్‌ను అంజనీ పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్‌ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రెండూ హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలే. భవ్య సిమెంట్‌లో మెజార్టీ వాటా కొనుగోలు చేయటానికి ఆ సంస్థ ప్రమోటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని అంజనీ పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్‌ బుధవారం వెల్లడించింది. ఒక్కో భవ్య సిమెంట్‌ షేరును  రూ.51.53 ధరకు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. కానీ భవ్య సిమెంట్‌ షేర్లు ఎన్ని.. దాని ప్రకారం ఈ కొనుగోలు ఖర్చు ఎంత.. అనే విషయాలను అంజనీ పోర్ట్‌ల్యాండ్‌ వెల్లడించలేదు.
భవ్య సిమెంట్‌ 2007లో ఏర్పాటైన కంపెనీ. గుంటూరు జిల్లా దాచేపల్లి సమీపంలో దీనికి సిమెంటు ప్లాంటు ఉంది. ఈ సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.4 మిలియన్‌ టన్నులు. ఆర్డినరీ పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్‌, పొజలోనా సిమెంట్‌, స్లాగ్‌ సిమెంట్‌ను ఈ సంస్థ తయారు చేస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.303.90 కోట్ల టర్నోవర్‌ను భవ్య సిమెంట్‌ నమోదు చేసింది. వి.ఆనంద ప్రసాద్‌ ఈ సంస్థ వ్యవస్థాపకుడు.
అంజనీ పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్స్‌ను 2014లో కేవీ విష్ణురాజు నుంచి చెన్నైకు చెందిన చెట్టినాడ్‌ సిమెంట్స్‌ కొనుగోలు చేసింది. ప్రస్తుతం అంజనీ పోర్ట్‌ల్యాండ్‌లో దాదాపు 75 శాతం వాటా చెట్టినాడ్‌ సిమెంట్స్‌ చేతిలో ఉంది. అయినప్పటికీ అంజనీ బ్రాండుకు మార్కెట్లో ఉన్న గుర్తింపును పరిగణలోకి తీసుకొని అంజనీ పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్‌ను తనలో విలీనం చేసుకోకుండా స్వతంత్రంగా కొనసాగిస్తూ వస్తోంది. అంజనీ పోర్ట్‌ల్యాండ్‌కు ప్రస్తుతం 1.2 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. తాజాగా భవ్య సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్న ఫలితంగా అంజనీ పోర్ట్‌ల్యాండ్‌ ఉత్పత్తి సామర్థ్యం 2.4 మిలియన్‌ టన్నులకు పెరుగుతుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని