అధిక మైలేజీకి ప్రాధాన్యం
close

Published : 22/09/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అధిక మైలేజీకి ప్రాధాన్యం

మారుతీ సుజుకీ ఇండియా

దిల్లీ: ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో, అధిక మైలేజీకి వినియోగదార్లు ప్రాధాన్యమిస్తామని, కొత్త కార్ల అభివృద్ధిలో ఈ అంశానికి ప్రాధాన్యమిస్తామని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాత్సవ వెల్లడించారు. దేశంలో అత్యంత ఇంధన సామర్థ్యంతో కార్లను ఆఫర్‌ చేస్తున్న దిగ్గజ సంస్థగా 3 దశాబ్దాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ‘కామ్‌ సే కామ్‌ బనేగా’ పేరుతో మారుతీ ప్రచారం నిర్వహిస్తోంది. వాహనాల పని తీరుపై ఎలాంటి ప్రభావం పడకుండా, ఇంధన సామర్థ్య లక్ష్యాల్ని సాధించడానికి రాజీ లేకుండా ప్రయత్నిస్తున్నామని శశాంక్‌ పేర్కొన్నారు. ‘మేము అంతర్గతంగా జరిపిన అధ్యయనాల్లో ఇంధన సామర్థ్యం బాగున్న కార్లనే కొనుగోలు చేస్తామని వినియోగదార్లు వెల్లడించారు. ఇంధన ధరలు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇదే తరహా సమాధానాలు వచ్చాయి. ఇప్పుడేమో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కార్ల కొనుగోలు నిర్ణయంలో వినియోగదార్లు కచ్చితంగా ఇంధన సామర్థ్యాన్ని పరిశీలిస్తార’ని శశాంక్‌ వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి దేశంలో అమల్లోకి రాబోతున్న కఠిన కార్పొరేట్‌ సరాసరి ఇంధన ఎకానమీ (కేఫ్‌) నిబంధనల నేపథ్యంలో వాహన సంస్థలు (ఓఈఎంలు) తప్పకుండా ఇంధన సామర్థ్యం అధికంగా ఉన్న కార్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. 2017-2022 మధ్య కేఫ్‌ నిబంధనల తొలి దశ అమలులో భాగంగా సరాసరి కార్పొరేట్‌ సీఓ2 ఉద్గారాలు 130 గ్రాములు/కిలో కంటే తక్కువగా ఉండేలా చూశారు. వచ్చే ఏడాది నుంచి అమలు చేయబోతున్న రెండో దశలో ఈ ఉద్గారాలు 113 గ్రాములు/కిలో తక్కువగా ఉండాలి. మూడో దశ 2027లో అమల్లోకి వస్తుంది.


స్పైస్‌జెట్‌ లాజిస్టిక్స్‌ వ్యాపారం బదిలీకి వాటాదార్ల ఆమోదం

దిల్లీ: అనుబంధ సంస్థ స్పైస్‌ ఎక్స్‌ప్రెస్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కార్గో, లాజిస్టిక్స్‌ సేవల వ్యాపారాన్ని గంపగుత్తగా బదిలీ చేయడానికి వాటాదార్లు ఆమోదం తెలిపారని స్పైస్‌జెట్‌ వెల్లడించింది. ఈ లావాదేవీ విలువ రూ.2,555 కోట్లు. స్పైస్‌జెట్‌ ప్రతికూల నికర విలువ తగ్గేందుకు వ్యాపార బదిలీ దోహదపడనుంది. అర్హులైన సంస్థాగత మదుపర్ల (క్యూఐపీ) ద్వారా రూ.2500 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు సైతం వాటాదార్లు పచ్చజెండా ఊపారు. కరోనా సంక్షోభం నుంచి విమానయాన పరిశ్రమ నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. జూన్‌ త్రైమాసికానికి స్పైస్‌జెట్‌ ప్రతికూల నికరవిలువ రూ.3300 కోట్లుగా ఉండగా.. లాజిస్టిక్స్‌ వ్యాపార బదిలీతో రూ.745 కోట్లకు తగ్గే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని