పీఎన్‌బీ హౌసింగ్‌పై సెబీ అప్పీలు కొట్టివేత
close

Published : 21/10/2021 06:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీఎన్‌బీ హౌసింగ్‌పై సెబీ అప్పీలు కొట్టివేత

దిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు చెందిన రూ.4,000 కోట్ల మూలధన సమీకరణ ప్రణాళికకు సంబంధించి సెక్యూరిటీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(శాట్‌) ఆదేశాలను సవాలు చేస్తూ సెబీ దాఖలు చేసిన అప్పీలును సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అప్పీలు ‘నిష్ప్రయోజనమైనది’గా భావిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వర రావు ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ప్రిఫరెన్షియల్‌ ఇష్యూను ఇక ముందుకు తీసుకెళ్లరాదని భావిస్తూ, ఆ మేరకు అప్పీలును వెనక్కి తీసుకోవడానికి అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ వద్ద దరఖాస్తు చేసినట్లు పీఎన్‌బీ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో సెబీ అప్పీలును నిష్ప్రయోజనమైనదిగా భావించి కొట్టివేస్తున్న’ట్లు తెలిపారు. ధర్మాసనం సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు తెలుపుతూ ఆగస్టు 9న శాట్‌ ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. నిధుల సమీకరణ ప్రణాళికపై వాటాదార్ల ఓటింగ్‌ ఫలితాలను తదుపరి ఆదేశాల వరకు వెల్లడించరాదని జూన్‌ 21, 2021న శాట్‌ తన మధ్యంతర ఆదేశాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. మే 31న కంపెనీ ప్రమోటరు అయిన పీఎన్‌బీ మూలధన సమీకరణ ప్రణాళికను ప్రకటించింది. అయితే కంపెనీ ప్రమోటరు, మైనారిటీ వాటాదార్ల ప్రయోజనాలకు అనుగుణంగా ఈ ప్రణాళిక లేదని ఒక సలహా సంస్థ పేర్కొనడంతో ఆ ప్రక్రియకు అడ్డుపడింది. షేర్ల విలువను స్వతంత్ర ‘వేల్యువర్‌’తో లెక్కించేంత వరకు ముందుకు వెళ్లరాదని సెబీ ఆదేశించింది. అప్పటి మార్కెట్‌ ధరతో పోల్చితే చాలా తక్కువ(రూ.390)కు ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ధరను పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నిర్ణయించడంతో వివాదం మొదలైందని చెప్పాలి. సెబీ నిబంధనల మేరకే ఇష్యూ ధరను నిర్ణయించినట్లు కంపెనీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని