లాభాల స్వీకరణ కొనసాగొచ్చు
close

Published : 25/10/2021 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల స్వీకరణ కొనసాగొచ్చు

ఫలితాల ప్రభావం కనిపించొచ్చు
ఊగిసలాటలకు అవకాశం
బ్యాంకు షేర్ల నుంచి మద్దతు
లోహ, గనుల షేర్లకు ప్రతికూలతలు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

దేశీయ సూచీల్లో బలహీనతలు కొనసాగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక ఫలితాలు మిశ్రమ ధోరణిలో ఉండడం; బ్రోకరేజీల నుంచి ఎటువంటి రేటింగ్‌ పెంపులు కనిపించకపోవడంతో మదుపర్లు ఎక్కువ విలువ గల షేర్లలో లాభాల స్వీకరణ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఊగిసలాటలకూ అవకాశం ఉందంటున్నారు. నిఫ్టీ కనుక 18,050 దిగువకు వస్తే లాంగ్‌ పొజిషన్లు తీసుకోకపోవడమే మంచిదని బ్రోకరేజీ సంస్థ ఒకటి సూచిస్తోంది. ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాల ప్రభావం సోమవారం కనిపించొచ్చంటున్నారు. బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు కొనసాగుతుండడం వల్ల మార్కెట్‌కు కొంత మద్దతు లభించే అవకాశం ఉంది.  ఫలితాల నేపథ్యంలో ఎంపిక చేసిన షేర్లలో చలనాలను గమనించొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* సిమెంటు కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి చలించొచ్చు. అధిక విలువల కారణంగా లాభాలు పరిమితంగా ఉండొచ్చు. అంబుజా సిమెంట్‌, దాల్మియా భారత్‌ ఫలితాలు కీలకం కానున్నాయి. 

* లోహ, గనుల కంపెనీల్లో నష్టాలు కొనసాగొచ్చు. గిరాకీ తగ్గుతున్న నేపథ్యంలో(ముఖ్యంగా చైనా నుంచి) అంతర్జాతీయంగా ప్రాథమిక లోహాలు, ఉక్కు ధరలపై ఒత్తిడి పడొచ్చు. 

* కొన్ని ఫార్మా కంపెనీల ఫలితాలు మదుపర్లను నిరుత్సాహపరచిన నేపథ్యంలో ఆయా షేర్లు అంతగా రాణించకపోవచ్చు. అధిక ముడి పదార్థాల ధరలు, సరఫరా సమస్యలు, అమెరికాలో కొత్త ఔషధాల అనుమతుల్లో ఆలస్యం తదితరాలు.. ఫలితాలపై ప్రభావం చూపొచ్చు.

* టెక్‌ మహీంద్రా (25న), పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ (26న) కంపెనీలు ఈ వారం వెలువరించే ఫలితాలపై మదుపర్ల కన్ను పడొచ్చు. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే టెక్‌ మహీంద్రా విక్రయాలు 4-5% వృద్ధిని నమోదు చేయొచ్చు. 

* ఎల్‌ అండ్‌ టీ ఫలితాల(27న)పైనే అందరి కళ్లూ ఉండొచ్చు. ఆయా కంపెనీల ఆర్డర్లు, ఫలితాల నేపథ్యంలో ఎంపిక చేసిన స్క్రిప్‌లలో చలనాలు నమోదు కావొచ్చు.

* బుధవారం వెలువడే మారుతీ సుజుకీ, బజాజ్‌ ఆటో జులై-సెప్టెంబరు ఫలితాల ఆధారంగా వాహన రంగ షేర్లు కదలాడవచ్చు. మారుతీ నికర లాభం సగానికి సగం తగ్గి రూ.700 కోట్లకు చేరొచ్చని అంచనా. 

* ముడి పదార్థాల వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల్లో సెంటిమెంటు స్తబ్దుగా ఉండొచ్చు. గత కొద్ది నెలల్లో పెరిగిన వీటి ధరలు ఇప్పట్లో తగ్గకపోవచ్చు. ఫలితాల నేపథ్యంలో కోల్గేట్‌ పామోలివ్‌, టాటా కన్జూమర్‌ వెలుగులోకి రావొచ్చు. కీలక సూచీల ఆధారంగా ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు చలించొచ్చు.

* జియో ఫలితాల నుంచి టెలికాం కంపెనీలు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.  వీటి ప్రభావం భారతీ, వొడాఫోన్‌లపై ఈ వారం కనిపించొచ్చు.

* ఎంపిక చేసిన బ్యాంకు షేర్లలో కదలికలు గమనించొచ్చు శనివారం వెలువడ్డ ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాలతో పాటు; మంగళవారం వచ్చే యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా; బుధవారం ప్రకటించే ఇండస్‌ఇండ్‌ ఫలితాలు కీలకం కానున్నాయి. 

* రిలయన్స్‌ ఫలితాలు చమురు షేర్లపై ప్రభావం చూపొచ్చు. మొత్తం మీద ఈ వారం అంతర్లీనంగా సానుకూల ధోరణితో స్థిరీకరణకు గురికావొచ్చు. చమురు ధరల ధోరణిని బట్టి అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు కదలాడవచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని