3 రోజుల్లో రూ.11,168 కోట్ల రుణాలు
close

Published : 27/10/2021 02:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 రోజుల్లో రూ.11,168 కోట్ల రుణాలు

 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమంలో భాగంగా కేవలం 3 పని దినాల్లో బ్యాంకులు సుమారు 2 లక్షల మందికి రూ.11,168 కోట్ల మేర రుణాలు మంజూరు చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అర్హులకు నిబంధనల మేరకు రుణాలు మంజూరు చేశాయని తెలిపారు. చాలా బ్యాంకులు పండుగల ఆఫర్ల పేరుతో, రాయితీ వడ్డీ రేట్లకే రుణాలు ఇవ్వడం సహా ప్రాసెసింగ్‌ రుసుములను రద్దు చేశాయని పేర్కొన్నారు. ‘జిల్లాలు-రంగాల వారీగా క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌ను బ్యాంకులు నిర్వహించాయ’ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. లక్ష మందికి రూ.6,268 కోట్ల విలువైన వ్యాపార రుణాలు, 5,058 మందికి రూ.448 కోట్ల వాహన రుణాలు, 3,401 మందికి రూ.762 కోట్ల గృహ రుణాలు ఈ నెల 16-20 తేదీల్లో 3 పని దినాల్లో మంజూరు చేసినట్లు తెలిపింది. మొత్తమ్మీద బ్యాంకులు 405 జిల్లాల్లో 924 క్యాంపుల్ని నిర్వహించి 1.93 లక్షల మందికి రూ.11,168 కోట్ల మేర రుణాల్ని మంజూరు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ కార్యాలయం వెల్లడించింది.

ముఖ్య ఆర్థిక సలహాదారుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభం

దిల్లీ: ముఖ్య ఆర్థిక సలహాదారుడిని (సీఈఏ) ఎంపిక చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న కె.వి.సుబ్రమణియన్‌ మూడేళ్ల పదవీ కాలం వచ్చే నెలలో పూర్తికానుంది.  దీంతో కొత్తగా ముఖ్య ఆర్థిక సలహాదారుడిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆసక్తి గలవారు 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ, ఆర్థిక శాస్త్రంలో కనీసం ఆరేళ్ల పాటు పరిశోధనలు నిర్వహించిన అనుభవం, 56 ఏళ్ల లోపు వయస్సు కలవారు దీనికి అర్హులని పేర్కొంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని