స్కైరూట్‌ ‘ఫుల్లీ క్రయోజనిక్‌’ రాకెట్‌ ఇంజిన్‌
close

Published : 26/11/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్కైరూట్‌ ‘ఫుల్లీ క్రయోజనిక్‌’ రాకెట్‌ ఇంజిన్‌

పరీక్ష విజయవంతం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ‘ధావన్‌-1’ ఫుల్లీ క్రయోజనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ ను విజయవంతంగా పరీక్షించింది. ద్రవీకృత సహజవాయువు-ఆక్సిజన్‌తో పనిచేసే ‘ఫుల్లీ క్రయోజనిక్‌’ రాకెట్‌ ఇంజిన్‌ను మనదేశంలో ప్రైవేటు రంగంలో రూపొందించడం, పరీక్షించటం ఇదే తొలిసారి అని సంస్థ తెలిపింది. క్రయోజనిక్‌ ఇంజిన్లు రాకెట్లలో అత్యంత సమర్థంగా పనిచేస్తాయి. ‘ఫుల్లీ క్రయోజనిక్‌’ ఇంజిన్లను రాకెట్‌లోని ‘అప్పర్‌ స్టేజ్‌’ లో వినియోగిస్తారు. వీటికి నిర్దిష్ట ప్రేరణ (స్పెసిఫిక్‌ ఇంపల్స్‌) ఉంటుంది. అందువల్ల అధిక బరువును తీసుకెళ్లగలవు. ఇంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కొన్ని దేశాలకు మాత్రమే ఉంది. మనదేశానికి చెందిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త అయిన డాక్టర్‌ సతీష్‌ ధావన్‌ను గుర్తుచేసుకుంటూ, తాము రూపొందించిన ఫుల్లీ క్రయోజనిక్‌ ఇంజిన్‌కు ‘ధావన్‌-1’ అని పేరు పెట్టినట్లు స్కైరూట్‌ ఏరోస్పేస్‌ వెల్లడించింది. ఈ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించటం ద్వారా ఎల్‌ఎన్‌జీ (90 శాతం మిథేన్‌) ని భవిష్యత్తు అప్పర్‌ స్టేజ్‌ రాకెట్‌ ఇంజిన్‌ ఇంధనంగా నిరూపించినట్లు అవుతోందని పేర్కొంది. నాగ్‌పూర్‌లోని సోలార్‌ ఇండస్ట్రీస్‌ అనే సంస్థకు చెందిన ‘టెస్ట్‌ ఫెసిలిటీ’ లో దీన్ని పరీక్షించారు. ఈ పరీక్ష నిర్వహించడం కోసం మొబైల్‌ క్రయోజనిక్‌ ఇంజిన్‌ టెస్ట్‌ స్టాండ్‌ను ఈ సంస్థ ఆవిష్కరించింది. ‘ధావన్‌-1’ ఫుల్లీ క్రయోనిక్‌ ఇంజిన్‌ పరీక్షను విజయవంతంగా నిర్వహించటం ద్వారా ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల కొద్ది కంపెనీల్లో స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఒకటిగా నిలిచిందని సంస్థ సహవ్యవస్థాపకుడు, సీఈఓ పవన్‌ కుమార్‌ చందన వివరించారు. ఈ ఇంజిన్‌ను ఆవిష్కరించడం ద్వారా తమ విక్రమ్‌ సిరీస్‌ రాకెట్లకు అవసరమైన 3 దశల ఇంజిన్లను ఆవిష్కరించినట్లు అవుతోందని మరొక సహ వ్యవస్థాపకుడు నాగ భరత్‌ డాక పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని