రాజస్థాన్‌లో సెంచరీ కొట్టిన పెట్రో ధరలు - petrol 100 mark in rajasthan
close

Updated : 15/02/2021 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజస్థాన్‌లో సెంచరీ కొట్టిన పెట్రో ధరలు

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. వరుసగా ఏడో రోజూ ధరల పెరుగుదల కొనసాగడంతో.. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర సెంచరీకి దగ్గరగా వెళ్తోంది. ఇక ఇంధన పన్ను అధికంగా విధిస్తోన్న రాజస్థాన్‌లో పెట్రోల్‌ ధర రూ.99.56కి చేరింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ పలుచోట్ల లీటరు ధర సెంచరీ దాటింది.

పన్నుల భారం..

గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావం దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై పడుతోంది. దీంతో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. సోమవారం పెట్రోల్‌పై 26పైసలు, డీజిల్‌పై 29పైసలు పెరిగింది. దీంతో ఆయా రాష్ట్రాలు విధించే పన్నులు కలుపుకోవడంతో ఇది మరింత ఎక్కువైంది. ఇలా గడిచిన వారంలోనే పెట్రోల్‌పై రూ.2.04, డీజిల్‌పై రూ.2.22 పెరగడం వినియోగదారులకు పెను భారంగా మారింది. రిటైల్‌ అమ్మకపు ధరపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్రోల్‌పై 61శాతం, డీజిల్‌పై 56శాతం పన్నుల భారం విధిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించకపోవడంతో పెట్రోల్, డీజిల్‌ ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

రాజస్థాన్‌లో లీటరు పెట్రోల్‌ వంద!

ఇంధనంపై అత్యధిక పన్ను విధిస్తోన్న రాష్ట్రాల్లో రాజస్థాన్‌ ముందుంది. దీంతో ఇక్కడ రికార్డుస్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోయాయి. శ్రీగంగానగర్‌లో పెట్రోల్‌ ధర గరిష్ఠంగా రూ.99.56కు చేరగా, డీజిల్‌ ధర రూ.91.48కి పెరిగింది. అయితే, పెట్రోల్‌, డీజిల్‌పై ఉన్న వ్యాట్‌పై రెండు శాతం తగ్గిస్తున్నట్లు రాజస్థాన్‌ గతనెలలో ప్రకటించింది. అయినప్పటికీ పెట్రోల్‌పై 36శాతం వ్యాట్‌తోపాటు అదనంగా రోడ్డు సుంకం విధిస్తోంది. డీజిల్‌పైనా 26శాతం వ్యాట్‌, రోడ్డు సుంకం వేయడంతో వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

సెంచరీ దాటిన ప్రీమియం ఇంధనం..

ఇక సాధారణ పెట్రోల్‌ ధరలు ఇలా ఉంటే, ప్రీమియం పెట్రోల్‌ ధరలు ఇప్పటికే వంద దాటుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పలు నగరాల్లో ఆదివారం వీటి ధర వంద మార్కును దాటింది. ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో ప్రీమియం పెట్రోల్‌ లీటరుకు రూ.102.34గా ఉంది.. డీజిల్‌ ధర గరిష్ఠంగా రూ.95.15కి పెరిగింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు అదేవిధంగా పెరిగిపోతున్నాయి. దేశరాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.88.99కి చేరగా, డీజిల్‌ ధర రూ.79.35కి చేరింది. ఇక ఆర్థిక రాజధాని ముంబయిలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో రూ.95.46కు చేరగా, డీజిల్‌ ధర రూ.86.34కి పెరిగింది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర గరిష్ఠ స్థాయిలో నమోదైంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.53 ఉండగా.. డీజిల్‌ ధర రూ.86.55 గా నమోదైంది.

మండిపడుతోన్న విపక్షాలు..

ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండడంతో విపక్షాలు మండిపడుతున్నాయి. సామాన్యుడిపై ఈ భారం తగ్గించేందుకు పన్నులను తగ్గించాలని కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. అయితే, వీటిపై ఇప్పట్లో పన్నులను తగ్గించే ఆలోచన ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పార్లమెంట్‌లో వెల్లడించారు. ఇక ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా ఒడిశాలో ఆరుగంటల బంద్‌కు రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి.

ఇవీ చదవండి..

అంబానీ ఆలోచన వెనుక అతను..!

రిసెప్షనిస్టు నుంచి ప్రపంచ శక్తమంతురాలిగా..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని