close
అమ్మేద్దామనుకుని.. ఆగిపోయారు

ఓఎన్‌జీసీ కీలక క్షేత్రాల విక్రయం నిలిపివేత
చమురు, సహజవాయువు ఉత్పత్తి 95% వీటి నుంచే
ప్రైవేటుకు ఎలా ధారాదత్తం చేస్తారంటూ ప్రశ్న
ఓఎన్‌జీసీ, ప్రభుత్వ వర్గాల్లోనే తీవ్ర అంతర్గత వ్యతిరేకత
దిల్లీ

రూ.వేల కోట్ల పెట్టుబడితో ఆవిష్కరించిన చమురు, సహజవాయువు క్షేత్రాల విక్రయ ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టినట్లు సమాచారం. ఓఎన్‌జీసీతో పాటు ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే ఇది సాధ్యపడింది.

ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ కీలక ఆస్తుల విక్రయం నిలిచిపోయిందని సమాచారం. ముంబయి హై, వాసాయ్‌ ఈస్ట్‌ వంటి 9 విలువైన ఆస్తులను ప్రైవేటు, విదేశీ కంపెనీలకు విక్రయించాలనే ప్రణాళిక తుదిదశకు చేరిన నేపథ్యంలో, ప్రభుత్వంలోనే అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో, అమ్మకాన్ని నిలిపి వేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

దేశీయ ఉత్పత్తిలో 95 % ఈ క్షేత్రాల నుంచే

పశ్చిమతీర ఆఫ్‌షోర్‌ చమురు, సహజవాయువు క్షేత్రాలైన ముంబయి హై, హీరా, డీ-1, వాసాయ్‌ ఈస్ట్‌, పన్నా; అస్సోంలోని గ్రేటర్‌ జోరజాన్‌, గెలెకీ; రాజస్థాన్‌లోని భగ్వేవాలా, గుజరాత్‌లోని కలోల్‌ చమురు క్షేత్రాన్ని ప్రైవేటు, విదేశీ కంపెనీలకు విక్రయించాలని గతేడాది ఆఖరులో నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని ఉన్నతాధికార కమిటీ నిర్ణయించింది. దేశీయ చమురు-సహజవాయువు ఉత్పత్తిలో 95 శాతం ఈ క్షేత్రాల నుంచే వస్తోంది. ఇంతటి కీలకమైన ఆస్తుల విక్రయ ప్రతిపాదన వల్ల, దురుద్దేశాలకు వీలు కల్పించే వీలుందని ఓఎన్‌జీసీతో పాటు ప్రభుత్వంలోని కొన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడంతో, ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఆగిందని నీతిఆయోగ్‌తో పాటు ప్రభుత్వ వర్గాలు కూడా వెల్లడించాయి.

* అయితే మొత్తం ఉత్పత్తిలో 5 శాతానికి సమానమైన మరో 149 చిన్న క్షేత్రాలను మాత్రం బిడ్‌ల ప్రక్రియ ద్వారా విక్రయించనున్నారు.

ఎలా అమ్మేస్తారు: ఓఎన్‌జీసీ

* నాలుగు దశాబ్దాల పాటు శ్రమించి, రూ.వేల కోట్ల పెట్టుబడులతో ఆవిష్కరించిన చమురు, సహజవాయువు క్షేత్రాలను ప్రైవేటు-విదేశీ సంస్థలకు ఎలా కట్టబెడతారనే ప్రశ్న ఓఎన్‌జీసీ నుంచి వచ్చింది.
* ఇంతటి విలువైన ప్రైవేటు/విదేశీ సంస్థలకు అప్పగించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమిటనే విషయమై ప్రభుత్వంలోనే కొన్ని వర్గాలకు మింగుడు పడలేదు. ప్రైవేటుకు విక్రయించడం ద్వారా, సహజవాయువు-చమురు ఉత్పత్తిని మరింత పెంచవచ్చంటూ గణాంకాలు ఎలా రూపొందించారో స్పష్టత లేదు.

* కనీసం ఆయా బేసిన్‌/క్షేత్రాలను పరిశీలించకనే కమిటీ ఎలా నివేదిక ఇచ్చిందో వెల్లడి కాలేదు.

ఇదీ జరిగింది

ప్రభుత్వరంగ చమురు కంపెనీల ఆధీనంలో ఏళ్ల తరబడి ఉన్న క్షేత్రాల నుంచి ఉత్పత్తి పెరగకపోవడంతో, వీటిని ప్రైవేటు/విదేశీ కంపెనీలకు విక్రయించాలనే ప్రతిపాదన వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ గత అక్టోబరులో నియమించిన రాజీవ్‌కుమార్‌ కమిటీకి చేరింది. మార్కెటింగ్‌, ధరల నిర్ణయంలో వాటికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలనీ సూచించారు. ఈ కమిటీ తుది నివేదికను జనవరి 29న ప్రభుత్వానికి అందించింది.

చిన్న క్షేత్రాలకు బిడ్‌

ఓఎన్‌జీసీకి చెందిన 64, ఆయిల్‌ ఇండియాకు చెందిన 2 చిన్న క్షేత్రాలను 4 నెలల్లోగా బిడ్‌ల ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.
* జాతీయ కంపెనీలు మరో 64 క్షేత్రాలు అట్టేపెట్టుకునేందుకు అనుమతించాలని సూచించారు. ఇందులో ఓఎన్‌జీసీకి 49, ఆయిల్‌ ఇండియాకు 3 ఉంటాయి. ఈ క్షేత్రాల్లో ఉత్పత్తి పెంచే చర్యలు ఇప్పటికే చేపట్టడం ఇందుకు కారణం.
* ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
* కొత్త అన్వేషణలకు అంగీకరించే ఒప్పందంపైనే ఇక నుంచి క్షేత్రాలను కేటాయించాలని నిర్ణయించారు. తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయ్యే క్షేత్రాల నుంచి లాభాలను ప్రభుత్వంతో పంచుకోవాల్సిన అవసరం ఉండదు.

కొత్త అన్వేషణలకు ప్రైవేటు/విదేశీ కంపెనీలు దూరం

అయితే కొత్త క్షేత్రాల్లో సహజ వనరుల అన్వేషణకు ప్రైవేటు/విదేశీ కంపెనీలు దూరంగా ఉంటాయి. వ్యయ ప్రయాసలకు తోడు నష్టభయం అధికంగా ఉండటం ఇందుకు కారణం. దీనికి బదులుగా ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా వంటి సంస్థలు అభివృద్ధి చేసిన చమురు-సహజ వాయువు క్షేత్రాల్లో వాటా కోసం అవి ప్రయత్నిస్తుంటాయి. కొత్త పెట్టుబడి, సాంకేతికత ద్వారా ఉత్పత్తి పెంచుతామని ఇవి ప్రకటించుకుంటుంటాయి. 

* అదే జాతీయ కంపెనీలు చూస్తే.. వీటికి మార్కెటింగ్‌, ధరలు నిర్ణయించుకునే అంశాల్లో స్వేచ్ఛ ఉండదు. అయినా కూడా 10 శాతం చొప్పున అదనపు వ్యాపారాన్ని నమోదు చేస్తున్నాయి. వీటికీ ఈ స్వేచ్ఛ ఇస్తే, కొత్త సాంకేతికతను అవీ అమలు చేయగలవని చెబుతున్నారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.