Eenadu Online Edition Business News - EENADU
close
నెట్టింట్లో మనది రెండో స్థానం

  జియో పాత్ర ఎనలేనిది
 మేరీ మీకర్‌ 2019 నివేదిక

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్‌ వినియోగదార్లలో 12 శాతం మంది మనదేశంలోనే ఉన్నారు. అత్యధికంగా ఇంటర్నెట్‌ వినియోగదార్లున్న దేశాల్లో మనదేశం రెండోస్థానానికి చేరింది. ఈ ఘనత దక్కడంలో, అధికవేగం డేటా సేవల (4జీ)ను, తక్కువ ధరల్లో అందుబాటులోకి తెచ్చిన రిలయన్స్‌ జియో పాత్ర ఎంతో కీలకమని మేరీ మీకర్‌ 2019 నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్‌ ట్రెండ్స్‌పై ఈ సంస్థ అధ్యయనం చేస్తుంటుంది. అమెరికా బయట చూస్తే, అత్యంత వినూత్న సేవలు అందిస్తున్న ఇంటర్నెట్‌ కంపెనీల్లో జియో ఒకటని ఆ సంస్థ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం..

ప్రపంచవ్యాప్తంగా 380 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగదార్ల సంఖ్య 380 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో ఇది సగానికి కంటే ఎక్కువ. నెట్‌ వినియోగదార్ల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నా, గతంతో పోలిస్తే వృద్ధి నెమ్మదిస్తోంది. 2016తో పోలిస్తే, 2017లో ఇంటర్నెట్‌ వినియోగదార్ల సంఖ్య 7 శాతం వృద్ధి చెందగా, 2018లో వృద్ధి 6 శాతానికి పరిమితమైంది. ప్రపంచ దేశాల్లో చూస్తే, ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్యా పరంగా చైనా అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో భారత్‌ నిలిచింది.

21 శాతం: ప్రపంచ ఇంటర్నెట్‌ వినియోగదార్లలో చైనా వాటా
12 శాతం: భారత వినియోగదార్ల వాటా
8 శాతం: అమెరికాలోని వినియోగదార్ల వాటా

నియంత్రణలు ఫరవాలేదు
ఇంటర్నెట్‌పై నియంత్రణలు భారత్‌లో మధ్యశ్రేణిలో ఉంటాయని నివేదిక పేర్కొంది. అవమానించేదిగా ఉన్న కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌ ఉంటుందని తెలిపింది.

జియో సంచలనమే
ఉచిత కాల్స్‌, డేటాకు తక్కుధ రుసుములు వసూలు చేయడంతో, ఏడాది వ్యవధిలోనే జియోకు అత్యధిక చందాదార్లు సమకూరగా, డేటా వినియోగం రెండింతలైంది. 30.7 కోట్ల మొబైల్‌ కనెక్షన్లు కలిగిన రిలయన్స్‌ జియో, ఇ కామర్స్‌ రంగాన్ని సంప్రదాయ దుకాణదార్లతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ‘దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్‌ రిటైల్‌ విక్రయశాలల్లో అడుగిడే 35 కోట్ల మందిని, జియో చందాదార్లయిన 30.7 కోట్ల మందిని, 3 కోట్ల మంది చిరు వ్యాపారులను అనుసంధానించి, మారుమూల ప్రాంతాల వినియోగదార్లకు అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుస్తాం’ అని రిలయన్స్‌ జియో అధిపతి ముకేశ్‌ అంబానీ ప్రకటించారని నివేదిక గుర్తు చేసింది. తమ ఆన్‌లైన్‌ పోర్టల్‌ నుంచి సరకు చేరవేసేందుకు, వస్తువుల సమీకరణకు కేంద్రాలుగా జియో స్టోర్లను వినియోగించుకోవాలన్నది ముకేశ్‌ అంబానీ ప్రణాళిక. మొత్తం 95 శాతం జనాభాకు చేరువ కావాలన్నది సంస్థ ఆశయం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.