close
అలాగైతేనే పార్కింగ్‌కు పన్ను కట్టండి

? నేను నా వాహనాన్ని ప్రతి రోజు హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్‌లో పార్క్‌ చేస్తుంటాను. ఇందుకు నెలకు రూ.450తో పాటు రూ.80 జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. నెలవారీ కార్డును ఒకటి వాళ్లు ఇచ్చారు. అయితే దానిపై జీఎస్‌టీ సంఖ్య ముద్రించిలేదు. నేను ఈ విషయమై చాలా సార్లు అడిగాను. కానీ వాళ్ల నుంచి స్పందన లేదు. నేను జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుందా? లేదా? దీనిపై ఎవరిని సంప్రదించాలి

- ఎం.మధుసూదన్‌ రెడ్డి

జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ ఉన్న ప్రతి ఒక్కరు వస్తువుల విక్రయం లేదా సేవలను అందించినప్పుడు తప్పనిసరిగా రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇచ్చే నెలవారీ కార్డులో జీఎస్‌టీ సంఖ్య లేదంటే పార్కింగ్‌ యజమానికి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ లేదని అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ జీఎస్‌టీ చెల్లించాల్సిందేనని ఒత్తిడి తెస్తే మీరు కేంద్ర, రాష్ట్ర జీఎస్‌టీ అధికారుల వద్ద ఫిర్యాదు చేయండి.

? 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.3.81 లక్షలను అధికంగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకున్నాను. నాకు సరఫరా చేసిన డీలర్లు జీఎస్‌టీ రిటర్న్‌లు ఇవ్వకపోవడం వల్ల ఇది జరిగింది. దీనికి నేను బాధ్యుడినా? క్రమంతప్పకుండా రిటర్న్‌లు దాఖలు చేస్తున్నా కూడా నాదే ఈ తప్పు అవుతుందా? ఒకవేళ ఇప్పుడు వాళ్లు రిటర్న్‌లు దాఖలు చేసిన 2018-19లో జమ అవ్వదు అని అంటున్నారు. పైగా జరిమానా చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. నిజాయతీగా చేస్తున్న వారికి కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం ఎంత వరకు సమంజసం. దీనిపైనాకు సలహా ఇవ్వగలరు.

- శ్రీ సాయి టెలికమ్యూనికేషన్స్‌

2018-19 ఆర్థిక సంవత్సరానికి సరఫరాదారు మీకు జారీ చేసిన రశీదులను 2019 సెప్టెంబరు వరకు అప్‌లోడ్‌ చేయచ్చు. జీఎస్‌టీఆర్‌-2ఏలో లభ్యమవుతున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మీరు సరఫరాదారుని సంప్రదించండి. అలాగే సరఫరాదారు రిటర్న్‌ దాఖలు చేసేలా మీ ప్రయత్నం మీరు చేయండి. ఒకవేళ 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే దాఖలు చేసి ఉంటే, ప్రస్తుత సంవత్సరం రిటర్న్‌లో ఆ రశీదులోని తేదీలతోనే వాటి వివరాలను చేర్చమని అడగండి. సెంట్రల్‌ ట్యాక్స్‌ సర్క్యులర్‌ సంఖ్య: 26/2017 ప్రకారం ఇలా చేర్చేందుకు వీలుంది. జీఎస్‌టీఆర్‌-1, జీఎస్‌టీఆర్‌-1ఏ, జీఎస్‌టీఆర్‌-2, జీఎస్‌టీఆర్‌-2ఏ, జీఎస్‌టీఆర్‌-3.. ఇలా ఇన్ని రకాల రిటర్న్‌ల ద్వారా పూర్థి స్థాయిలో రశీదులను సరిపోల్చే విధానాన్ని ప్రభుత్వం అనుసరించడం లేదు. అందువల్ల మీరు చెల్లించాల్సిన అవసరం రాకపోవచ్చు. ఒకవేళ.. సరఫరాదారు మీ నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి కట్టకుంటే.. అప్పుడు మీరు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే.. జీఎస్‌టీ నిబంధనలు ఆ మాదిరిగా రూపొందించారు మరి.

? మేం నిర్మాణ సేవల వ్యాపారంలోకి అడుగుపెట్టాం. ప్రస్తుతం సబ్‌ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నాం. ప్రధాన కాంట్రాక్టులకు మాకు పనులు ఇస్తారు. ఈ సంవత్సరం టర్నోవరు రూ.60- 70 లక్షల వరకు ఉండొచ్చని అనుకుంటున్నాం. మేం జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోవాల్సి ఉంటుందా? లేదా? తెలియజేయగలరు

- దీపక్‌ అయ్యర్‌

ప్రధాన సరఫరాదారుకు సబ్‌కాంట్రాక్టర్‌గా మీరు అందించే సేవలు ‘సరఫరా’ కిందకు వస్తాయి. దీనికి జీఎస్‌టీ కూడా వర్తిస్తుంది. రూ.20 లక్షల్లోపు టర్నోవరు ఉంటే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మీ టర్నోవరు దీని కంటే ఎక్కువగానే ఉన్నందున రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. అయితే మీరు వ్యాపారంలోకి అడుగుపెట్టింది ఈ సంవత్సరంలోనే కనుక.. అసలు మొదటి ఏడాది పూర్తయ్యే వరకు ఎంత టర్నోవరు నమోదవుతుందో చూడండి. ఒకవేళ రూ.20 లక్షలు మించితేనే రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోండి. మొదటి ఏడాదిలో కనీస పరిమితికి మించి వార్షిక టర్నోవరు నమోదైనందున.. రెండో ఏడాది నుంచి మీకు కనీస టర్నోవరు పరిమితి వర్తించదు.

? ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలకు రుణ వసూళ్ల బృందం (డెట్‌ రివకరీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) ఏజెంట్‌గా పనిచేస్తున్నాను. బ్యాంకులు నాకిచ్చే కమిషన్‌పై జీఎస్‌టీ మినహాయించుకుంటున్నారు. ఈ విషయాన్ని నేను సంబంధిత బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. దీనిపై నాకు ఏమైనా సలహాలు ఇవ్వగలరు.

- కె.ఎస్‌.ఆర్‌.రావు

జీఎస్‌టీ చట్టంలోని నిబంధనల ప్రకారం.. మీరు అందిస్తున్న సేవలకు రివర్స్‌ ఛార్జీ పద్ధతి వర్తిస్తుంది. అంటే.. మీరు సేవలు అందించిన ప్రతిసారీ బ్యాంకులు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు జీఎస్‌టీతో కలిపే కమిషన్‌ను చెల్లిస్తామనే నిబంధనతో బ్యాంకులు, మీకు మధ్య ఒప్పదం కుదిరి ఉంటే మీకు ఇస్తున్న కమిషన్‌ నుంచి జీఎస్‌టీ మినహాయించుకోవడం సరైనదే. అదే జీఎస్‌టీ కలపకుండా కమిషన్‌ను చెల్లిస్తామని ఒప్పందమైతే మాత్రం బ్యాంకులు మీ కమిషన్‌ నుంచి జీఎస్‌టీ మినహాయించుకోవడం తప్పు. అందువల్ల మీరు ఈ సమస్యను బ్యాంకుల దృష్టికి తీసుకొని వెళ్లడానికి ముందు ఒకసారి ఒప్పంద పత్రాన్ని పరిశీలించుకోవడం మంచిది.

? మాది అనంతపురం జిల్లా లేపాక్షి గ్రామం. మా ఊళ్లోనే నేను సైకిల్‌ మైకానిక్‌ షాప్‌ను నిర్వహిస్తున్నాను. త్వరలోనే ఆటోమొబైల్స్‌ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. ఇందుకు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. దీనిపై జీఎస్‌టీ ఎంత కట్టాలి? ఆటోమొబైల్స్‌ వ్యాపారానికి సంబంధించి జీఎస్‌టీ వివరాలను తెలియజేయండి.

- హుమాలకుంట సలీం

మీరు చేయాలనుకుంటున్న వ్యాపారంలో పెట్టే పెట్టుబడిపై జీఎస్‌టీ వర్తించదు. అయితే జీఎస్‌టీకి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాలంటే మీరు జీఎస్‌టీ కన్సల్టెంట్‌ను సంప్రదించండి. ‘ప్రశ్నలు- సమాధానాలు’ శీర్షిక ద్వారా పూర్తి నిబంధనలను వివరించడం వీలుకాదు. మరో గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ప్రస్తుత వ్యాపార టర్నోవరుతో పాటు కొత్తగా పెట్టబోయే వ్యాపార టర్నోవరు పరిమితి రూ.20/ 40 లక్షల లోపు ఉంటే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోనవసరం లేదు. ఆ పరిమితిని మించితేనే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలి.

? నేను 2018 జనవరి 29న ఫ్లాటును కొనుగోలు చేశాను. మేం జీఎస్‌టీ ఎంత చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాటు మొత్తం విలువపై జీఎస్‌టీ చెల్లించాలా లేదంటే రిజిస్ట్రేషన్‌ మొత్తంపైనా? ప్లాటు పూర్తి విలువపై జీఎస్‌టీ కట్టాలని నిర్మాణదారు అంటున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వగలరు.

- సిహెచ్‌.వి.టి.ఎం.నాయుడు, అనకాపల్లి

ఈ తరహా ప్రశ్నలపై గతంలోనూ నేను సమాధానమిచ్చాను. అయినప్పటికీ.. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కనుక.. మళ్లీ చెబుతాను. ఫ్లాటు కొనుగోలు సమయంలో నిర్మాణదారు, కొనుగోలుదారు ఎంత మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నారో.. ఆ మొత్తం విలువపై జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బులను మీరు బ్యాంకు రుణం లేదా ఇతరత్రా ఏ రూపంలో చెల్లించినా దాంతో సంబంధం లేదు. ఒప్పందం కింద కుదుర్చుకున్న మొత్తం విలువలో కొంత భాగంపైనే రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. అందువల్ల మొత్తం విలువపైనే జీఎస్‌టీ కట్టాలి.

? మేం మా స్థలాన్ని నిర్మాణదారుకు అభివృద్ధి నిమిత్తం ఇచ్చాం. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2019 డిసెంబరులో మా వాటా కింద నిర్మాణదారు ఐదు ఫ్లాట్లు ఇవ్వనున్నాడు. అయితే దీనిపై 5 శాతం జీఎస్‌టీ చెల్లించమని అడుగుతున్నాడు. కొనుగోలుదారు నుంచి వసూలు చేసే జీఎస్‌టీని నిర్మాణదారుకు మేం చెల్లించిన జీఎస్‌టీతో సర్దుబాటు చేసుకునే వీలుందా

- ఎస్‌.శశినాధ్‌

నిర్మాణదారు మీకు నిర్మాణ సేవలు అందిస్తున్నందున.. మీ వాటా కిందకు వచ్చిన ఫ్లాట్ల నిర్మాణ వ్యయంపై మీరు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించి కొత్త నిబంధనల ప్రకారం.. నిర్మాణదారు మీకు ఫ్లాటు అందజేసిన తేదీకి దగ్గర్లో ఇతరులకు ఫ్లాటు అమ్మిన విలువపై మీరు నిర్మాణ సేవలకు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణ సేవలపై నిర్మాణదారు నుంచి లభించే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌తో స్థల యజమాని చెల్లించాల్సిన జీఎస్‌టీని సర్దుబాటు చేసుకోవచ్చు.


మీ సందేహాలు పంపండి
జీఎస్‌టీకి సంబంధించి మీ సందేహాలు మాకు పంపించండి.. మీ సందేహాలు  ఎలాంటివైనా సరే అవి క్లుప్తంగాను, సరళంగాను ఉండాలి.. మా చిరునామా
eenadubusinessdesk@gmail.com; businessdesk@eenadu.net

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.