close
దక్షిణాదిన ప్లాంటు

భవిష్యత్‌ అంతా విద్యుత్‌ ద్విచక్ర వాహనాలదే
పన్ను రాయితీలతో మారుతున్న ముఖచిత్రం

‘ఈనాడు’ ఇంటర్వ్యూ 


జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ ఎండీ అమిత్‌రాజ్‌ సింగ్‌ 

భవిష్యత్‌ అంతా విద్యుత్‌ ద్విచక్ర వాహనాలదేనని గ్రేటర్‌ నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ ఎండీ అమిత్‌రాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాల వల్ల విద్యుత్‌ వాహనాలకు ఆదరణ గణనీయంగా పెరుగుతుందన్నారు. వచ్చే అయిదారేళ్లలో విద్యుత్‌ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 10 లక్షలకు మించిపోతాయని అంచనా వేశారు. చైనా సంస్థ ఒపాయ్‌ ఎలక్ట్రిక్‌ భాగస్వామ్యంతో మనదేశంలో ఏర్పాటైన ఈ సంస్థ ఇటీవల తన నూతన విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించింది. దక్షిణాదిలో ఒక కొత్త ప్లాంటు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఆ విశేషాలు ఇలా..

ఈనాడు - హైదరాబాద్‌

? విద్యుత్తు ద్విచక్ర వాహనాలు ఎందుకు మనదేశంలో వినియోగదార్లకు దగ్గరకాలేకపోతున్నాయి
సాధారణ ఐసీఈ (ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజన్‌) వాహనాల నుంచి ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల వైపు మార్పు వెంటనే రాదు. అది క్రమంగా రావాలి. కాకపోతే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తి పెరిగింది. మనదేశంలోనూ మార్పు వస్తోంది. ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వినియోగించే విడిభాగాలపై కస్టమ్స్‌ పన్నును 5 శాతానికి, జీఎస్‌టీని 12% నుంచి 5 శాతానికి తగ్గించింది. ఎలక్ట్రిక్‌ వాహనం కొనుగోలుకు తీసుకున్న అప్పుపై కట్టే వడ్డీకి ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తోంది. వీటన్నింటితో వినియోగదార్లు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపే అవకాశం ఏర్పడింది.

? విద్యుత్తు ద్విచక్ర వాహన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి
ఈ-వాహనాలపై ప్రజల్లో తగినంత అవగాహన లేదు. దీనిపై పరిశ్రమ వైపు నుంచి మేం కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలి. కిందిస్థాయి వరకూ విద్యుత్తు ద్విచక్ర వాహనాల సర్వీసు, మరమ్మతు సదుపాయాలను విస్తరించాల్సిన అవసరమూ ఉంది.

? పరిశ్రమ ఇంకా వేగంగా విస్తరించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది
ఛార్జింగ్‌ సదుపాయాలు తగినంతగా లేకపోవటం ప్రధాన అవరోధం. అతిపెద్ద సమస్య కూడా. వినియోగదార్లు విద్యుత్తు వాహనాలు అంతగా కొనుగోలు చేయకపోవటానికీ ఇదే కారణం. ఇక పన్నుల పరంగా కూడా కొంత వెసులుబాటు కావాలి.

? మనదేశంలో సంప్రదాయ ద్విచక్ర వాహన పరిశ్రమ అతిపెద్దది. ఇందులో దేశీయ, విదేశీ కంపెనీలు ఉన్నాయి. వాటికి నిధుల కొరత లేదు. అవి   విద్యుత్తు వాహనాల తయారీ చేపడితే..., కొత్తగా ఈ రంగంలోకి వచ్చిన మీ వంటి సంస్థలు పోటీని తట్టుకోగలవా
దేశీయంగా ద్విచక్ర వాహన వినియోగదార్ల సంఖ్య ఎక్కువ. ఏ ఒకరిద్దరో ఈ మార్కెట్‌ను శాసించడం కష్టం. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన పరిశ్రమ పరుగు మొదలయితే ఆగదు, ఎంతో పెద్ద పరిశ్రమగా ఎదుగుతుంది. సంస్థ చిన్నదైనా, పెద్దదైనా నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తేనే మనుగడ. మా వద్ద నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉంది, ఇక్కడి వాతావరణం, రహదార్లకు అనుగుణంగా మా వాహనాలను తీర్చిదిద్దుతున్నాం. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీలో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ‘ఒపాయ్‌’ తో మాకు భాగస్వామ్యం, ‘సాంకేతిక పరిజ్ఞానం బదిలీ’ ఒప్పందం ఉన్నాయి. దేశీయ మార్కెట్లో క్రియాశీలకంగా ఎదగాలన్నది మా లక్ష్యం. గ్రేటర్‌ నోయిడాలోని మా యూనిట్లో 1.5 లక్షల వాహనాల తయారీ సామర్థ్యం కల ప్లాంట్‌ ఏర్పాటు చేశాం.  ఎటువంటి విడిభాగాలు దిగుమతి చేసే పనిలేకుండా వచ్చే ఏడాది వ్యవధిలో నూరుశాతం వాహనాలను ఇక్కడే తయారు చేయాలనుకుంటున్నాం. ఈ స్కూటర్లలో వినియోగించే  లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీని (బరువు 6.5-9 కిలో కిలోలు) ఛార్జింగ్‌ అయిపోయిన వెంటనే మార్చుకోవచ్చు. అందువల్ల విస్తారమైన స్థాయిలో ఇప్పటికిప్పుడు ఛార్జింగ్‌ సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు. సమీప భవిష్యత్తులో మా డీలర్ల వద్ద ఛార్జింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేస్తాం.

? వచ్చే అయిదారేళ్లపై మీ అంచనా ఏమిటి?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ మొత్తం మీద 7.5 లక్షల విద్యుత్‌ వాహనాల అమ్మకాలు నమోదవుతాయని అంచనా వేస్తున్నాం. ఇందులో విద్యుత్తు ద్విచక్ర వాహనాలు 1.2 లక్షల వరకూ ఉండవచ్చు. ఎక్కువగా విద్యుత్‌ త్రి-చక్ర వాహనాలు ఉంటాయి. వచ్చే అయిదారేళ్లలో 10 లక్షల వాహనాల స్థాయిని చేరుకోవచ్చు.

? దక్షిణాది మార్కెట్లో విస్తరించే ఆలోచన ఉందా
ప్రస్తుతం మా దృష్టి దక్షిణాది రాష్ట్రాల వైపే ఉంది. ఈ ప్రాంతంలో డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరించే సన్నాహాల్లో ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ ఆకర్షణీయమైన మార్కెట్లు. హైదరాబాద్‌లో ఇప్పటికే మా విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో సమీప భవిష్యత్తులో భాగా విస్తరిస్తాం. అంతేగాక దక్షిణ భారత దేశంలో మరొక ప్లాంటు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. ఎక్కడే అనేది ఇంకా నిర్ణయించలేదు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.