ఇంటి రుణం.. ఇవన్నీ చూశాకే...
close

Published : 30/07/2021 04:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటి రుణం.. ఇవన్నీ చూశాకే...

సొంతింటి కోసం చూస్తున్న వారికి ప్రస్తుతం అనుకూల పరిస్థితులే ఉన్నాయని చెప్పొచ్చు. స్థిరాస్తి మార్కెట్లో ఇళ్లపై కొంత రాయితీలు లభిస్తుండంతోపాటు, వడ్డీ రేట్లూ గతంతో పోలిస్తే అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. గృహరుణం కోసం బ్యాంకు లేదా గృహరుణ సంస్థలను ఎంపిక చేసుకునేటప్పుడు ఒక్క తక్కువ వడ్డీ రేటునే ప్రామాణికంగా తీసుకోవడం ఎప్పుడూ సరికాదు.  గమనించాల్సిన ఇతర విషయాలూ అనేకం ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాం..

త్యంత తక్కువ వడ్డీ రేటు.. రుణాలకు సంబంధించిన ఈ మాట మనల్ని ఎప్పుడూ ఆకర్షిస్తుంది. నిజానికి కొన్నిసార్లు ఈ మాయలో పడిపోయి అప్పులు తీసుకుంటుంటాం. గృహరుణం కనీసం 15-20 ఏళ్లు కొనసాగే దీర్ఘకాలిక అప్పు. ఈ వ్యవధిలో ఎన్నో మార్పులు రావచ్చు. కాబట్టి, రుణం తీసుకునేటప్పుడు.. వ్యవధినీ దృష్టిలో పెట్టుకోవాలి.

ఏ అనే కంపెనీ రూ.10 లక్షల రుణాన్ని 20 ఏళ్ల వ్యవధికి 9శాతం వడ్డీకి అందిస్తోంది. బి అనే సంస్థ రూ.10లక్షల రుణాన్ని 15 ఏళ్ల వ్యవధికి 11శాతానికి అందిస్తోంది. సాధారణంగా తక్కువ వడ్డీ ఉండే ఏ కంపెనీ నుంచే మనం రుణం తీసుకుంటాం. కానీ, వ్యవధి తీరేలోపు ఏ కంపెనీ దగ్గర తీసుకున్న రుణానికి రూ.11.59లక్షల వడ్డీ చెల్లిస్తే.. బి సంస్థకు చెల్లించే వడ్డీ రూ.10.45 లక్షలు మాత్రమే. అంటే ఇక్కడ వడ్డీతోపాటు, వ్యవధినీ గమనించాలన్న సంగతి స్పష్టమవుతోంది.

ముందుగానే చెల్లించేస్తే..

నెలనెలా వాయిదాలతోపాటు.. ఎంతోకొంత మొత్తం చెల్లిస్తూ వెళ్లే అవకాశం మీ రుణ సంస్థ కల్పిస్తోందా లేదా చూసుకోండి. దీనివల్ల మీరు తొందరగా రుణ విముక్తులయ్యే అవకాశం ఉంటుంది. వడ్డీ భారమూ తగ్గుతుంది. ఉదాహరణకు మీకు ఉద్యోగంలో బోనస్‌లాంటివి    వచ్చాయనుకుందాం.. లేదా వ్యాపారంలో కలిసొచ్చిందనుకుందాం. ఇలాంటప్పుడు రుణానికి మీ మిగులు మొత్తం కేటాయించండి. దీనివల్ల మీ అసలు తగ్గుతుంది. ఫలితంగా మీ రుణ వ్యవధిలోనూ మార్పు వస్తుంది. అయితే, కొన్ని రుణ సంస్థలు ఇలాంటివాటికి అంగీకరించకపోవచ్చు. కొన్ని నిబంధనలు లేదా రుసుములు అడ్డం వస్తాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించడం వీలుకాకపోతే.. నెలకు మీరు చెల్లించే ఈఎంఐలో అదనంగా రూ.500 నుంచి రూ.1,000 అదనంగా చెల్లిస్తూ వెళ్లండి. తేడా మీకే తెలుస్తుంది. ఎప్పుడైనా ఒకేసారి మొత్తం రుణం తీర్చేయాలని అనుకున్నారనుకోండి.. అప్పుడు ఆ ప్రక్రియ సులభంగా పూర్తవ్వాలి. రుసుముల్లాంటివి ఉండకూడదు.

రుణ అర్హత ఎంత?

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వేర్వేరు విధానాల్లో రుణ గ్రహీత అర్హతను నిర్ణయిస్తుంటాయి. కొన్ని సంస్థలు మీ ఆదాయం, ఇతర రుణాలను పరిశీలిస్తే.. మరికొన్ని కాస్త ముందుకెళ్లి, మీ రుణాల చెల్లింపు చరిత్ర, క్రెడిట్‌ స్కోరులాంటివి పరిశీలిస్తాయి. మరికొన్ని ఇప్పుడు మీరున్న పరిస్థితులు, భవిష్యత్‌లో మీ ఆర్థిక స్తోమత ఎలా ఉంటుంది లాంటి అంశాలు పరిశీలిస్తాయి. ఈ మూడు రకాల్లో.. ఇప్పుడు మీరున్న పరిస్థితిని చూడటంతోపాటు, మున్ముందు మీ సంపాదన ఆధారంగా రుణ అర్హతను నిర్ణయించిన వాటికే ఓటు వేయాలి. దీంతోపాటు మీరు కొనుగోలు చేస్తున్న ఇంటి విలువలో గరిష్ఠ మొత్తంలో అప్పు ఇచ్చే సంస్థలనూ ఎంచుకోవచ్చు.

అంతా డిజిటల్‌

కరోనా తర్వాత చాలా లావాదేవీలు డిజిటల్‌కు మారిపోయాయి. ఇంటి రుణం దరఖాస్తు విషయంలోనూ ఇప్పుడు చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు డిజిటల్‌ బాటలోనే వెళ్తున్నాయి. కొన్ని అనివార్య పరిస్థితుల్లో రుణదాత దగ్గరకు వెళ్లాల్సి వచ్చినా.. ఆ తర్వాత కొన్ని సేవలకు మాత్రం ఆన్‌లైన్‌లోనే వీలు కల్పించేలా ఉండాలి. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఖాతా వివరాలు, అసలు ఎంత, పాక్షిక చెల్లింపు వెసులుబాటు, ఈఎంఐని గుర్తు చేయడం, ఆదాయపు పన్ను దాఖలు సమయంలో అవసరమైన పత్రాలు తీసుకునేందుకు వీలులాంటివన్నీ ఆన్‌లైన్‌లో ఉన్నాయా లేదా చూసుకోండి.


మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా

మీరు అప్పు తీసుకున్న సంస్థ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకుందా? అదెలా తెలుస్తుందన్నది మీ సందేహమా? మీ అవసరాలను గుర్తించి, మీ దరఖాస్తును వేగంగా పరిష్కరించడమే కాకుండా.. ఎప్పటికప్పుడు మీ సందేహాలను తీరుస్తోందా? అనేది తెలుసుకుంటే చాలు. భవిష్యత్తులో మీతో ఆ సంస్థ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. రుణం తీసుకునేందుకు మీ రోజువారీ పనులను మానుకొని తిరిగితే.. సంస్థ ఎంపిక విషయంలో మరోసారి ఆలోచించాల్సిందే. మంచి రుణ సంస్థ కేవలం అప్పు ఇవ్వడంతోనే తమ పని అయిపోయిందని అనుకోదు. పూర్తి పారదర్శకంగా ఉండటంతోపాటు, మీరు అడిగిన సమాచారాన్ని ఎప్పుటికప్పుడు అందించాలి. అందుకే, రుణం ఎక్కడి నుంచి తీసుకుంటే బాగుంటుందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో కొంత పరిశోధన చేయండి.

- గౌరవ్‌ మోహతా,  చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌,  హోమ్‌ఫస్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఇండియా


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని