కెరియర్ గైడెన్స్ - గణితం
దేశంలో ఎక్కువమంది విద్యార్థులు చదువుతోన్న సబ్జెక్టుల్లో గణితశాస్త్రం ఒకటి. లెక్కలంటే మక్కువ, ప్రావీణ్యం ఉన్నవారికి విరివిగా అవకాశాలు లభిస్తున్నాయి. బోధన, పరిశోధన, శిక్షణ, సాఫ్ట్వేర్...ఇలా పలు రంగాల్లో వీరు ప్రవేశించవచ్చు. ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రత్యేక సంస్థలు, రాష్ట్రీయ వర్సిటీల్లో గణితంలో యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సులు చేసుకోవచ్చు. ప్రత్యేక సబ్జెక్టుగా గణితం చదివే అవకాశం ఇంటర్మీడియట్ నుంచి వస్తుంది. ఇంటర్లో ఈ సబ్జెక్టు చదివితే ఇంజినీరింగ్, బీఎస్సీ/ బీఏ మ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్ పీజీ (మ్యాథ్స్) కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. డిగ్రీలో మ్యాథ్స్ చదివినవాళ్లే పీజీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ స్థాయుల్లో మ్యాథ్స్ చదవడానికి అర్హులవుతారు. మారుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ఐఐటీలు, సెంట్రల్, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సును రూపొందించారు. ఇంటర్లో మ్యాథ్స్ చదివినవాళ్లు వీటిలో చేరవచ్చు. డిగ్రీలో మ్యాథ్స్ చదివినవాళ్లకు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పీహెచ్డీ కోర్సు ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది. ఐఐఎస్ఈఆర్, ఎన్ఐఎస్ఈఆర్, ఐఎంఎస్...ఇలా ప్రముఖ సంస్థల్లో ఈ కోర్సులను బోధిస్తున్నారు.దేశంలో దాదాపు అన్ని విశ్వవిద్యాయాల ప్రాంగణాల్లోనూ గణితానికి సంబంధించిన కోర్సులను అందిస్తున్నారు. పీజీ స్థాయిలో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
|
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ
జేఈఈతో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, బీఎస్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఐఐటీ-బాంబే బీఎస్ మ్యాథ్స్; ఐఐటీ-ఖరగ్‌పూర్, హైదరాబాద్, కాన్పూర్, రోపార్, వారణాసి, గువాహటి, గయ, ధన్‌బాద్ - మ్యాథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్; ఐఐటీ-రూర్కీ- అప్లయిడ్ మ్యాథ్స్; నిట్-ఆగర్తలా, పట్నా, రవుర్కెలా, సూరత్ - ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ మ్యాథ్స్ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ఐఎస్ఈఆర్, ఐఐఎస్ఈఆర్ల్లోనూ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ మ్యాథ్స్ కోర్సు ఉంది. ఐఐఎస్సీ నాలుగేళ్ల బీఎస్ మ్యాథ్స్ కోర్సు ఆఫర్ చేస్తోంది. ఐఐఎస్‌ఈఆర్‌ల్లో బీఎస్-ఎంఎస్ మ్యాథ్స్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి.
|
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ
ఐఐటీలు నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టు ఎమ్మెస్సీ (జామ్)తో ఐఐఎస్సీ, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, ఎమ్మెస్సీ పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. ఈ పరీక్ష స్కోరు ద్వారా ప్రవేశం కల్పిస్తోన్న సంస్థలు, కోర్సులు... ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ: ఐఐఎస్సీ-బెంగళూరు, పలు ఐఐఎస్ఈఆర్లు. జాయింట్ ఎమ్మెస్సీ పీహెచ్డీ: ఐఐటీ-భువనేశ్వర్, ఖరగ్‌పూర్. ఎమ్మెస్సీ: ఐఐటీ- బాంబే, దిల్లీ, గాంధీనగర్, ఇండోర్, జోధ్‌పూర్, కాన్పూర్, మద్రాస్, పట్నా, రూర్కీ, రోపార్, పలు ఎన్ఐటీలు. ఎమ్మెస్సీ మ్యాథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్: ఐఐటీ-ధన్‌బాద్, గువాహటి, హైదరాబాద్, భిలాయ్. ఎమ్మెస్సీ మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్: ఐఐటీ-తిరుపతి. ఎమ్మెస్సీ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ: ఐఐటీ - జోధ్‌పూర్ (మ్యాథమేటిక్స్- డేటా అండ్ కంప్యుటేషనల్ సైన్సెస్).
|
ప్రత్యేక నైపుణ్యముంటే..

గణితంలో పీజీ పూర్తిచేసినవారికి బోధన రంగంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, సాధారణ డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీ పోస్టులు వేల సంఖ్యలో ఉంటాయి. ఎంసెట్, ఐఐటీ-జేఈఈ పరీక్షల కోసం గణితంలో ప్రత్యేక ప్రావీణ్యం ఉన్నవారిని ఎక్కువ వేతనంతో శిక్షణ సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. మ్యాథ్స్‌పై పట్టున్న శిక్షకులకు రూ.లక్షల్లో వేతనం లభిస్తోంది. సబ్జెక్టుపై పట్టు, బోధనానుభవం, నైపుణ్యం..తదితరాల ఆధారంగా ఎక్కువ వేతనం అందుతుంది. ప్రముఖ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు బహుళజాతి సాఫ్ట్వేర్, కన్సల్టింగ్ కంపెనీలు ప్రాంగణ నియామకాల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. దాదాపు ప్రతి ప్రవేశపరీక్ష, పోటీ పరీక్షల్లోనూ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ తప్పనిసరిగా ఉంటున్నాయి. మ్యాథ్స్‌పై పట్టున్నవారు వీటిని బాగా బోధిస్తారు. అందువల్ల శిక్షణ సంస్థలు వీరికి అవకాశం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో హోం ట్యూషన్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. వాటి ద్వారా నెలకు రూ. 20-30 వేలు సంపాదించుకోవచ్చు. మ్యాథ్స్ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఎక్కువ శాతం ప్రశ్నలు గణితంతోే ముడిపడి ఉండడమే దీనికి కారణం. సాఫ్ట్వేర్ రంగంలో ఆపరేషన్స్ రిసెర్చ్ అనలిస్ట్, కంప్యూటర్ సిస్టం అనలిస్ట్ తదితర హోదాలు మ్యాథ్స్ గ్రాడ్యుయేట్లకు అందుతున్నాయి. పీజీ అనంతరం కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులు ముఖ్యంగా డేటా సైన్స్, బిగ్‌డేటా, టెస్టింగ్ టూల్స్ లాంటివి నేర్చుకుని మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. వివిధ ఆర్థిక, బీమా సంస్థలు మ్యాథ్స్‌లో పీజీ చేసినవారిని డేటా అనలిస్ట్ ఉద్యోగానికి తీసుకుంటున్నాయి.
|
ప్రముఖ సంస్థలు
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) కోల్‌కతా, బెంగళూరు: బీమ్యాథ్స్, ఎంమ్యాథ్స్ * సెంటర్ ఫర్ అప్లికబుల్ మ్యాథమేటిక్స్, బెంగళూరు: ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పీహెచ్డీ * చెన్నై మ్యాథమేటికల్ ఇన్స్టిట్యూట్, చెన్నై: బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ * ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్, చెన్నై: ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, పీహెచ్డీ * హరీశ్చంద్ర రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, అలహాబాద్: ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, పీహెచ్డీ * నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, భువనేశ్వర్: ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, పీహెచ్డీ * హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, రెండేళ్ల ఎమ్మెస్సీ మ్యాథ్స్, పీహెచ్డీ వీటిలో పలు సంస్థలు కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ప్రతినెలా స్టయిపెండ్ అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఎమ్మెస్సీ మ్యాథ్స్ కోర్సు ఉంది. వీటితోపాటు వివిధ కళాశాలల్లో పీజీ మ్యాథ్స్ కోర్సు ఆఫర్ చేస్తున్నారు.
|