సాయికుమార్‌తో నేనెప్పుడూ అలా అనలేదు! - Alitho Saradaga funny chat show with Actors Suman and Bhanu Chander
close
Updated : 09/12/2020 12:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాయికుమార్‌తో నేనెప్పుడూ అలా అనలేదు!

తెరపై వీరు సమవుజ్జీలు. తెర వెనుక చిరకాల స్నేహితులు. మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది కథానాయకులుగా తెరపైకి వచ్చిన ఈ అందగాళ్లు తమ గ్లామర్‌తో, పెర్ఫామెన్స్‌తో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కలల రాకుమారులు, అప్పటి తరం గ్రీకువీరులు. వారే మచిలీపట్నం చిన్నోడు భానుచందర్‌, మంగళూరు సోగ్గాడు సుమన్‌ తల్వార్‌. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. వారి నట జీవితం ఎలా మొదలైంది, ఎలా సాగుతోంది, కుటుంబం, దర్శకులు, ముఖ్యంగా వారిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైంది ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

చిత్ర పరిశ్రమకు వచ్చాక స్నేహితులయ్యారా? లేక అంతకుముందే మీ మధ్య స్నేహం ఉందా?

సుమన్‌: చిత్ర పరిశ్రమకు వచ్చాకే స్నేహితులమయ్యాం. తమిళ చిత్ర పరిశ్రమలో చేసిన మొదటి చిత్రమైన ‘నల్లదే నడంది తీరమ్‌’ షూటింగ్‌లో నేను భానును కలిశాను. మా ఇద్దరికి ఓ కనెక్షన్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్‌. దాంతో ఫైట్స్ తీసేటప్పుడు అలా ఒకరికొకరం మిత్రులమయ్యాం. ఇక అక్కడినుంచి చాలా సినిమాలు తెలుగులో, తమిళంలో చేశాం. మరొక విషయం ఏంటంటే నన్ను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది భాను అన్ననే. దేవుడు భాను అన్న ద్వారా ‘తెలుగులో నువ్వు పెద్ద స్టార్ అవుతావు’ అని తెలుగు చిత్ర సీమకు పరిచయం చేశారు. అలా తమ్మారెడ్డి భరద్వాజ పరిచయం అవడం. ‘ఇద్దరు కిలాడీలు’ తీయడం జరిగిపోయింది.

భానుచందర్‌: క్లుప్తంగా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో బాపు-రమణ వంటి మహనీయులు స్నేహానికి నాంది. స్నేహం విషయంలో మేము కూడా అంతేనని నేను అనుకుంటున్నా.

తెలుగులో మీ మొదటి చిత్రం ఏది?

సుమన్‌: ‘ఇద్దరు కిలాడీలు’, దాని తర్వాత ‘తరంగిణి’.

భానుచందర్‌: ఆ చిత్రంలో నేను విలన్‌, సుమన్‌ కథానాయకుడు.

మీ తండ్రి పెద్ద సంగీత దర్శకుడు. మరి మీరు నటనవైపు ఎందుకు రావాలనిపించింది?

భానుచందర్‌: మా నాన్న పేరు మాస్టర్‌ వేణు. నేను నటిస్తానంటే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. ‘నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? నువ్వు గిటార్‌ అద్భుతంగా వాయిస్తావు. సంగీతం నేర్చుకోవచ్చు కదా’ అని అన్నయ్యతో పాటు అందరూ తిట్టేవారు. కానీ, మా అమ్మ నాకు స్ఫూర్తి. ‘మీ నాన్న తెరవెనకే ఉన్నారు. కానీ, నువ్వు తెరముందుకు రావాలి. నువ్వు హీరో అవ్వాలి’ అని చెప్పింది. నేను మా అమ్మ కోరిక నెరవేరుస్తాను అని అంటే ‘ఏడ్చావులే’ అని అందరూ నవ్వారు. ‘నవ్విన నాప చేనే పండుతుంది’ అని అలా నేను కథానాయకుడయ్యాను. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో మార్షల్‌ ఆర్ట్స్‌పైన ఓ చిత్రం తీద్దామని, సుమన్‌ని తీసుకొని తమ్మారెడ్డి భరద్వాజ అన్నయ్యకు వద్దకు తీసుకెళ్లాను. ఆయన ఆలోచించుకొని మా చేత ‘ఇద్దరు కిలాడీలు’ చిత్రాన్ని తీశారు.

సుమన్‌: నేను మొదటిసారిగా భాను ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ జయప్రదగారిని చూశాను. సితార నేర్చుకోవడానికి అక్కడకు వచ్చారని తెలిసింది. అప్పటివరకు నాకు తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఏమీ తెలియదు. ఆ తర్వాత చాలా సార్లు భాను ఇంట్లో భోజనం చేశాను. వాళ్ల అమ్మగారు చాలా బాగా చూసుకునేవారు. షూటింగ్‌లు లేనప్పుడు భాను వాళ్ల ఇంటిపైనే అందరం కలిసేవాళ్లం. సినిమా ఫీల్డ్‌లో చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోతే మేము ఎలా ఉంటామో అక్కడ రిహార్సల్స్‌ చేసేవాళ్లం. కానీ, మా ఇద్దరికి ఇంత గొప్ప స్థానం ప్రేక్షకులు కల్పిస్తారని ఏ రోజూ, ఎప్పుడూ ఊహించలేదు. 

చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతోంది?

సుమన్‌: డిసెంబర్‌ 25కి 43వ సంవత్సరంలోకి అడుగుపెడతాను.

భానుచందర్‌: 44 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ సుమన్‌ గురించి మీకొక మాట చెప్పాలి. ఒకసారి నేను, మా అన్నయ్య రోడ్డుపై వెళ్తుంటే ఓ కారు వేగంగా మా మీదకు దూసుకొచ్చి, సడెన్‌గా మా ముందు ఆగిపోయింది. అందులో నుంచి సుమన్‌ దిగాడు. ‘ఏంటది ఇంత ఫాస్ట్‌గా వచ్చావు?’ అని అడిగితే,  ‘రేపటి నుంచి నువ్వు నాకు ఫోన్‌ చేయొద్దు. ఎందుకంటే నేను ఒక కేసులో ఇరుక్కున్నా. అందుకే నాతో ఎవరైనా స్నేహం చేస్తున్నట్లు తెలిస్తే, వారిని కూడా విచారణకు పిలిచి హింసిస్తున్నారు. రెండు నెలలు దూరంగా ఉండు’ అని అన్నాడు. మరుసటి రోజు పేపర్‌ చూస్తే తమ్ముడిని అరెస్ట్‌ చేశారన్న వార్త వచ్చింది. నేను షాకయ్యా. ఆ తర్వాత తప్పుడు కేసు అని కోర్టు కొట్టేసింది. అనంతరం వెంకటేశ్వరస్వామి పాత్ర సుమన్‌ తమ్ముడిని వరించింది. ఎన్టీఆర్‌, హరినాథ్‌ల తర్వాత మా సుమన్‌కి అంతటి గొప్ప పేరు వచ్చింది. ఒకరికి చెడు చేయాలనుకుంటే దేవుడు చూస్తూ ఉంటాడు. అదే సుమన్‌ విషయంలో నిజమైంది.

తమిళం కంటే తెలుగులో మీరిద్దరూ కలిసి నటించటానికి గల కారణాలు ఏంటి?

భానుచందర్‌: తమిళం కంటే తెలుగులో ఫైట్స్, పాటలు ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువ యాక్షన్‌ ఉంటుంది. యాక్షన్‌ హీరోలకు జీవితం ఎక్కువ ఉండేది. అందుకు ఈ తెలుగు చిత్ర పరిశ్రమను ఎక్కువ ఇష్టపడతాం.

సుమన్‌: అప్పట్లో తమిళంలో ఊటీ తప్ప ఎక్కడా షూటింగ్‌లు చేసేవారు కాదు. కానీ, తెలుగులో చాలా దేశాల్లో తీసేవారు. తెలుగు చిత్ర పరిశ్రమ చాలా కలర్‌ఫుల్‌గా ఉండేది. తమిళంలో ఆఫ్‌బీట్‌ చిత్రాలు ఉండేవి. తెలుగులో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువగా ఉండేది. 

‘నిరీక్షణ’లో ఓ సన్నివేశంలో మీకు గుండు కొట్టి, బట్టలన్నీ తీసేసి లాఠీలతో కొడతారు. ఆ సన్నివేశం ఎందుకు చేయాల్సి వచ్చింది?

భానుచందర్‌: బాలు మహేంద్రగారు మలయాళం, తెలుగు రెండు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళంలో మమ్ముట్టి ఈ సన్నివేశాన్ని చేయనన్నారు. ఇదే విషయాన్ని నాకు చెబితే నేను చేస్తానన్నా. ఇక్కడ నేను కేవలం ఆ సన్నివేశంలోని పాత్రను చేస్తున్నా. ఆ సీన్‌ తీసిన తర్వాత నా కమిట్‌మెంట్‌ చూసి, బాలూ మహేంద్ర కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పట్లో నేను ఏడాదికి 12 సినిమాలు చేస్తున్నా. ‘పోనీలేండి వేరే సినిమాల్లో విగ్గు పెట్టుకుంటా’ అని ఆయనను సముదాయించే ప్రయత్నం చేశా. ‘పట్నం పిల్ల.. పల్లెటూరి చిన్నోడు’ చిత్రంలో చివరి సన్నివేశం ఒకటి మిగిలి పోయింది. సుహాసినిని వివాహం చేసుకోవాలి. అప్పుడు నేను గుండు చేయించుకుని ఉండటంతో ‘పెళ్లయితే గుండు చేయించుకుంటా’ అని దర్శకుడు నాపై డైలాగ్‌ రాశారు.

మీ కెరీర్ లో ఇలాంటి బెస్ట్ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా?

సుమన్‌: నేను బాగా కష్టపడింది, ఇష్టపడింది ‘అన్నమయ్య’ చిత్రం. 

మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు?

సుమన్‌: తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, తులు, హిందీ, ఆంగ్ల భాషలు మాట్లాడగలను.

మరి మీరు నటించిన చిత్రాలకు ఎందుకు డబ్బింగ్‌ చెప్పుకోలేదు?

సుమన్‌: తమిళంలో నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెప్పుకొంటా. మొదట తెలుగులో నటించినప్పుడు పాత్రకు తగ్గట్టుగా గొంతు ఉండాలని సాయికుమార్‌తో నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత తెలుగు నేర్చుకున్నాను. కానీ, ఒక్కసారిగా వాయిస్‌ను మారిస్తే ప్రేక్షకుల ఎలా తీసుకుంటారోనని, అంతేకాకుండా వాయిస్‌ మారిస్తే చిత్రాలు హిట్‌ అవ్వవేమోనని ఇలా కొన్ని సెంటిమెంట్స్‌ ఉన్నాయి. అందుకని సాయికుమార్‌ వాయిస్‌తోనే కొనసాగించారు. మధ్యలో కొన్ని చిత్రాలకు నేను డబ్బింగ్ చెప్పాను. కన్నడలోనూ చెప్పాను. మరో విషయం ఏంటంటే, నటించిన వారి వాయిస్‌ ఉంటేనే అవార్డులు వస్తాయని ఒక నిబంధన ఉంది. వాటి కోసం నేనెప్పుడూ దర్శక-నిర్మాతలపై ఒత్తిడి చేయలేదు.

‘అన్నమయ్య’లో నటనకు గానూ ఏమైనా అవార్డులు వచ్చాయా?

సుమన్‌: నాకేమీ రాలేదు. దీని గురించి చాలా దుమారం రేగింది. అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌శర్మతో కలిసి కూర్చొని ఆ చిత్రాన్ని చూశాను. నా వరకు అదే పెద్ద గొప్ప అవార్డుగా భావిస్తున్నాను. రోజంతా ఆయనతో కలిసి ఉన్నాను. అంతేకాకుండా ఆ చిత్రంలోని పాత్ర నాకు ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించింది. భాష తెలియకుండా తమ నటనతో మెప్పించిన వారికి నిజంగా అవార్డులు ఇవ్వాలి. ఎందుకంటే ఆ భాష తెలిసిన వారికి కథ, సన్నివేశం అర్థం చేసుకోవడం, అందులో నటించడం మరింత సులువు. ఇతర భాషా నటులకు ఆ అవకాశం ఉండదు. అయినా కూడా వారు అద్భుతంగా నటిస్తున్నందుకు అవార్డు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా.

మీరిద్దరూ కలిసి తమిళం, తెలుగు కలిపి ఎన్ని చిత్రాల్లో నటించారు?
భానుచందర్‌-సుమన్‌ 15 చిత్రాలు ఉంటాయి.

మీ దగ్గరకు కొత్త కథలతో దర్శకులు వచ్చినప్పుడు ఒకరి పేరు మరొకరు సూచించేవారా?

సుమన్‌: మా ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుంది. కాబట్టి ఒకరి పక్కన ఒకరు నటిస్తే బాగుంటుందని చెప్పేవారు. పైగా యాక్షన్‌ ఓరియెంటెడ్‌ ఫిల్మ్స్‌ చేసినప్పుడు ఫైట్స్‌ విషయంలో ఇద్దరి మధ్యా అవగాహన ఉండేది. అలా అవి తెరపై బాగా వచ్చేవి.

భానుచందర్‌: దేవి ప్రసాద్‌ ‘బందీపోటు’ నాతో చేద్దామని వచ్చారు. కానీ, నేను సుమన్‌ పేరు చెప్పాను. ఆ చిత్రం 100 రోజులు ఆడింది. అప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది.

జీవితంలో కింద పడిన ప్రతి వ్యక్తికి మళ్లీ పైకి ఎదగాలనే ఒక సపోర్ట్ ఉంటుంది. మీకు ఎవరు ఆ సపోర్ట్?

సుమన్‌: నేను సమయాన్ని ఎక్కువగా నమ్ముతాను. నేను సినిమా ప్రపంచానికి చాలా దూరం. మా ఇంట్లో ఒక్క సినిమా పుస్తకం కూడా ఉండేది కాదు. మా అమ్మ కాలేజీలో లెక్చరర్‌. మా నాన్న ఐఓసీఎల్‌ లో మేనేజర్‌. అసలు సినిమాలకు సంబంధం లేని వ్యక్తి చిత్ర పరిశ్రమకు రావటం అనేది నిజంగా టైమ్. ఇప్పుడు సినిమాల్లో రావడం సులభం. కానీ, అప్పుడు సినిమాల్లోకి రావాలంటే చాలా తెలిసి ఉండాలి. చాలా భాషల్లో నటించాను.

ఈ మధ్య మీరు రాసి, పాడిన ఓ పాట యూట్యూబ్‌లో వైరల్‌ అయిందట!

భానుచందర్‌: అవును. కరోనా వైరస్‌ మీద జనానికి అవగాహన రావటం కోసం ఓ ఆలోచన వచ్చి రాత్రి 11 గంటలకు మొదలుపెట్టి ఉదయం 5 గంటలకు పాట రాయటం పూర్తి చేశాను. ఓ ట్యూన్‌ని కంపోజ్‌ చేసి, ఎల్.వి. జనార్ధన్‌ రెడ్డి స్టూడియోలో రికార్డ్‌ చేశాను. మా బాలూ అన్నయ్యను మాకు దూరం చేసిన కరోనా వైరస్‌ను ఏం చేసినా పాపం లేదు.

మీకు సాయికుమార్‌ డబ్బింగ్‌ చెప్పేవారు. అదే సమయంలో రాజశేఖర్‌కూ చెప్పేవారు. ఆయనకు చెబితే, మీరు.. మీకు చెబితే ఆయన సాయిని తిట్టేవారట నిజమేనా?

సుమన్‌:  అలా ఎప్పుడూ జరగలేదు. రాజశేఖర్‌ కంటే నేను ముందుగా సినిమాల్లోకి వచ్చాను. అప్పటికే నాకు తెలుగు మాట్లాడటం కూడా వచ్చు. నాకు అంత జీవితం ఇచ్చిన మనిషి(సాయికుమార్‌)తో నేనెప్పుడూ అలా మాట్లాడను. సరదాకు కూడా అలా అనలేదు. అయితే, ఓ స్థాయి నటులకు డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో ఆ స్థాయి తగ్గించుకోవద్దని మాత్రం చెప్పేవాడిని. అది కూడా సరదాగా. అంతేకానీ, ‘నాకు డబ్బింగ్‌ చెబితే వాళ్లకు చెప్పొద్దు’ అని ఎప్పుడూ అనలేదు. అదంతా సాయి ఇష్టం కదా!

‘దోషి-నిర్దోషి’ చిత్రంలో మీరు, సాయి ఇద్దరూ చేశారు కదా.. మీకేమో సాయి డబ్ చెప్పాడు. మరీ సాయికి ఎవరు చెప్పారు?

సుమన్‌: సాయి సాయికే చెప్పాడు.(వెంటనే ఆలీ అందుకుని సాయికుమార్‌కు వాళ్ల నాన్న చెప్పి ఉంటారు.. నవ్వులు)

మీరిద్దరిలో ఎక్కువ లవ్‌ లెటర్స్‌ ఎవరికి వచ్చేవి?

భానుచందర్‌: సుమన్‌కి వచ్చేవి. తను లవర్ బాయ్‌. అమ్మాయిలే కాదు. అబ్బాయిల్లోనూ అభిమానులు ఉన్నారు.

చిన్నప్పుడు నటుడు రవిబాబును కొట్టడం.. గిల్లడం చేసేవారట! ఎందుకు అతనంటే అంత కోపం మీకు?

భానుచందర్‌: చలపతిరావు గారు మా ఇంటి ఔట్‌ హౌస్‌లో అద్దెకు ఉండేవారు. రవి అంటే మా నాన్నకు ప్రాణం. ఆ చనువు తీసుకొని మా దగ్గరకు వచ్చి అల్లరి చేసి హింస పెట్టేవాడు. తన వల్ల మాకు తిట్లు వస్తున్నాయని రేడియో సౌండ్ ఎక్కువ పెట్టి కొట్టడం, గిల్లడం చేసేవాడిని. వాడు ఏడ్చే కొద్దీ రేడియో సౌండ్‌ను పెంచేవాడిని. ‘మనసారా’ చిత్రం షూటింగ్‌ సమయంలో ఈ విషయం రవికి గుర్తుచేశాను. కానీ, అలాంటి రవి ఇప్పుడు ఇంత గొప్ప దర్శకుడు కావడం నాకు చాలా గర్వంగా ఉంది.

మీరు ఇండస్ట్రీకి వచ్చాక డ్యాన్స్‌ నేర్చుకున్నారా లేదంటే ముందే వచ్చా?

సుమన్‌: నాకు నటన గురించి ఏమీ తెలియదు. ఇండస్ట్రీలోకి వచ్చే ముందు మా అమ్మగారి స్నేహితురాలైన చిత్ర గారి భర్త తంగప్పన్‌ మాస్టర్‌. కమల్‌హాసన్‌ గారి గురువు. ఆయన డ్యాన్స్‌ కచ్చితంగా నేర్చుకోమన్నారు. అప్పటికే నా చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ చిత్రానికి ప్రభుదేవా గారి నాన్న సుందరం మాస్టర్‌ దగ్గర నేను డ్యాన్స్‌ నేర్చుకున్నా. ఆ తర్వాత చిన్ని ప్రకాశ్‌ వద్ద నేర్చుకున్నా.

మీ దృష్టిలో స్నేహం అంటే అర్థం ఏంటి?

సుమన్‌: ఈ రోజు నేను ఈ షోకు రావడానికి ఒక కారణం ఉంది. ఈ రోజుల్లో స్నేహమనేది చాలా కమర్షియల్ అయిపోయింది. ‘అతనితో మాట్లాడితే నాకేంటి లాభం’ అని చాలా మంది అనుకుంటున్నారు. ఒక్కసారి స్నేహితులయ్యాక అవతలి వ్యక్తిలో చెడు తెలిసినా కూడా వాళ్లని మార్చడానికి మనం ప్రయత్నించాలి. ఒకవేళ కుదరక పోయినా కూడా అలాగే ఉండాలి. కానీ, మధ్యలో వదిలేయకూడదు. మా ఇద్దరి స్నేహం అందరికీ ఆదర్శంగా నిలవాలని నేను భావిస్తున్నా. ఒక్కోసారి ఎవరూ లేకపోయినా స్నేహితులు మనకు అండగా ఉంటారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని