‘హ్యాపీడే‌స్‌’ ఆడిషన్‌లో ఆ కండీషన్‌ పెట్టారు! - Alitho Saradaga funny chat show with Hero Nikhil
close
Updated : 17/09/2020 15:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘హ్యాపీడే‌స్‌’ ఆడిషన్‌లో ఆ కండీషన్‌ పెట్టారు!

అతను చిల్‌ అయ్యే లవ్‌స్టోర్‌లతో ఫీల్‌ ఇస్తాడు. థ్రిల్‌ అయ్యే థ్రిల్లర్స్‌తో షాకిస్తాడు. మాస్‌ను మెప్పించడంలో తనదో ట్రేడ్‌ మార్క్‌.. క్లాస్‌ను మెప్పించడంలో అతని ఫిల్మ్‌ ఓ బెంచ్‌మార్క్‌.. విలక్షణ సబ్జెక్ట్‌లతో వరుస హిట్‌లు కొడుతూ, బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న యువ కథానాయకుడు నిఖిల్‌. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు.

కరోనా కాలంలో పెళ్లి చేసుకున్నారు. ఎలా జరిగింది? ఖర్చు ఓ పాతికవేలైందా?

నిఖిల్‌: పెళ్లిలో చాలా బాగా డ్యాన్స్‌ చేశా. ఓ రేంజ్‌లో పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటి నుంచి నాకో కల ఉండేది. కనీసం పదివేల మంది అతిథుల ముందు చేసుకోవాలని అనుకునేవాడిని. నా కల ఏంటంటే టాలీవుడ్‌ స్టార్స్‌, ఫ్యాన్స్‌, గెస్ట్స్‌ అందర్నీ పిలిచి సందడిగా పెళ్లిని చేసుకుందామనుకున్నా. దేవుడు ఇలా రాసి పెట్టాడు. అందువల్ల ఇలా చేసుకోవాల్సి వచ్చింది.

కొవిడ్‌ కాలంలో చేసుకుంటే ఖర్చు తగ్గుతుందని ఎవరైనా సలహా ఇచ్చారా?

నిఖిల్‌: మా కుటుంబ సభ్యులందరం కలిసి ఒక  ముహూర్తం నిర్ణయించుకున్నాం. ఆ గడువు దాటి పోయిన కొద్దీ నా భార్య(పల్లవి) బాధ పడటం మొదలుపెట్టింది. ఎన్ని రోజులైనా పరిస్థితులు ఇలాగే ఉంటాయని నాకనిపించింది. అందువల్ల దూరం పెరగకూడదని వెంటనే వివాహం చేసుకున్నా. నిజం చెప్పాలంటే ఖర్చు కూడా తగ్గింది. దాదాపు 50మంది మాత్రమే నా వివాహానికి హాజరయ్యారు.

కరోనా కాలంలో మిమ్మల్ని చాలా మంది స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ సీజన్‌లో మొదటి వివాహం మీదేననుకుంటా?

నిఖిల్‌: అవునండీ. 15రోజుల తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తాయి కదా. అందుకే నా పెళ్లికి హాజరైన అందరికీ ఎలా ఉన్నారంటూ నేను ఫోన్‌ చేశాను. మంచి విషయం ఏమిటంటే ఎవరికీ కరోనా సోకలేదు.

భీమవరం అమ్మాయిని చేసుకుంటే పెద్ద స్టార్‌ అవుతారని ఎవరైనా చెప్పారా? 

నిఖిల్‌: పెద్దస్టార్‌ అవుతావునని చెప్పలేదు.  కానీ, జీవితం మాత్రం సంతోషంగా ఉంటుందని చెప్పారు. (ఆలీ అందుకుని మా ఆవిడది భీమవరమే. అందువల్ల నేను పెద్ద స్టార్‌ని అయ్యాను.) 

మీకు పాటలంటే ఇష్టమట. అందులో పల్లవి ఇష్టమా? చరణం ఇష్టమా?

నిఖిల్‌: పల్లవి అంటేనే ఇష్టం.(నవ్వులు) ఎందుకంటే నా భార్య పేరు పల్లవి.

నిఖిల్‌: పెళ్లి చేసుకుంటే ఒక నటుడి క్రేజ్‌ తగ్గిపోతుందా? చాలా మంది నటులు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా?

ఆలీ: అలా ఏమీ లేదు. పెళ్లి చేసుకుంటే క్రేజ్‌ తగ్గిపోతుందని చెప్పినోళ్లు పిచ్చోళ్లు.

నిఖిల్‌: పెళ్లి చేసుకున్నాక నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంది తమ ఆశీస్సులు కూడా అందించారు. ‘అర్జున్‌ సురవరం’ విడుదల సమయంలో పల్లవి చాలా సపోర్ట్‌ చేసింది.

మీరు చైల్డ్‌ ఆర్టిస్టా? లేదా పెద్దయ్యాక నటుడిగా మారారా?

నిఖిల్‌: నేను చైల్డ్‌ ఆర్టిస్టుని కాదు. పదో తరగతి, ఇంటర్‌ సమయంలో అవకాశాల కోసం తిరగడం మొదలు పెట్టాను. ఈటీవీలో ఒక సీరియల్‌లో నటించాను. చిన్న, చిన్న పాత్రలు కూడా పోషించాను. సమయానికి నాకు రావాల్సిన డబ్బులు కరెక్ట్‌గా ఇచ్చిన ఏకైక ఛానల్‌ ఈటీవీ.

సీరియల్స్‌లో నటించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?

నిఖిల్‌: నాకు నటన మీద ఆసక్తి ఎక్కువ. ఎలాగైనా షారూఖ్‌ ఖాన్‌, చిరంజీవి కావాలనుకున్నా.

‘సర్కస్‌’ అనే సీరియల్‌లో షారూఖ్‌ఖాన్‌ నటించారు. అచ్చం అలాగే ఉన్నారు!

నిఖిల్‌: థ్యాంక్స్‌ అండీ. ‘చదరంగం’ అనే సీరియల్‌లో నేను నటించాను. చాలా ప్రజాదరణ పొందింది.  అందులో నటించడం నాకు చాలా ఉపయోగపడింది. ప్రతి సినిమా ఆఫీసులో నా పోర్టుఫోలియో ఉంటుంది. అప్పట్లో ఫొటోషాప్‌ గురించి అందరికీ తెలియదు. నా దగ్గర కంప్యూటర్‌ ఉండేది. నేను ఫొటోషాప్‌తో ఫొటోలను అందంగా మార్చి ప్రతి (ఉషాకిరణ్‌ మూవీస్‌తో సహా) సినిమా ఆఫీసులో ఇచ్చేవాడిని.

బేగంపేట్‌లోనే కదా మీ ఇల్లు?

నిఖిల్‌: నేను తరచూ ఫొటోలు ఇస్తుండటంతో వారికి ఫ్రస్టేషన్‌ వచ్చినట్టుంది. నన్ను ఒకసారి ఆడిషన్‌కు పిలిచారు. ఏ లాంగ్వేజ్‌లోనైనా సరే డైలాగ్‌ చెప్పమన్నారు. నేను హిందీలో చెప్పాను. షారూఖ్‌ఖాన్‌ సర్కస్‌, ఫౌజీ అనే సీరియల్‌లో నటించారు కదా. ఆయన ‘‘హైసే చాప్‌’’ డైలాగ్‌ని అదే శైలిలోనే చెప్పాను. దాదాపు 20సంవత్సరాల క్రితం అనుకుంటాను. 2001లో ఈ ఆడిషన్‌ జరిగింది.

అయితే మీరు సీనియర్‌ ఆర్టిస్టే?

నిఖిల్‌: మీతో పాటే సార్‌(నవ్వులు). నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. ‘నువ్వే కావాలి’లో తరుణ్‌ చిన్నప్పటి పాత్రను పోషించాడు. మా అమ్మానాన్నలు బిజీగా ఉండటంతో వాడిని నేనే షూటింగ్‌లకు తీసుకెళ్లేవాడిని. కెమెరాతో పాటు పరిసరాలను పరిశీలించేవాడిని. అటు బాల నటుడిగా, ఇటు హీరోగా ఏ పాత్రలూ పోషించలేదు. ‘నేను నటిస్తా’ అని ఎవరినైనా అడిగితే, ‘నీకు వయసు సరిపోదు. ఇంకా కొద్ది కాలం ఆగాలి’ అని చెప్పేవారు. నేను ఇంటర్‌కు రావడంతోనే అవకాశాల కోసం వెతకడం ప్రారంభించాను.

హీరోగా మొదటి సినిమా ఏది?

నిఖిల్‌: ‘హ్యాపీ డేస్‌’. తర్వాత ‘అంకిత్‌ పల్లవి అండ్‌ ఫ్రెండ్స్‌’ చేశాను. అది అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ‘యువత’తో మంచి విజయాన్ని అందుకున్నా. ఈ సినిమాను పరశురాం(గీత గోవిందం దర్శకుడు) డైరెక్ట్‌ చేశారు. కెరీర్‌ ఏ విధంగా ముందుకు వెళ్తుంతో తెలియదు సర్‌. విజయం అనేది ప్రతిసారి రాదు‌. సక్సెస్‌ వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్‌ చేయాలో నిర్ణయించుకున్నాను. ‘హ్యాపీ డేస్‌’ తర్వాత ‘యువత’తో మంచి విజయం దక్కింది. ‘వీడు తేడా’ కూడా బాగానే ఆడింది. ఆ సినిమాలో మీతో(ఆలీ) కూడా నటించాను. చిన్ని దానికి డైరెక్టర్‌.

హీరోగా ఎన్ని సినిమాలు అయిపోయాయి?

నిఖిల్‌: 17 సినిమాలు చేశాను. 18,19,20వ సినిమాలు కూడా ఓకే అయ్యాయి. కానీ, కరోనాతో ఆ సినిమాల షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రపంచమంతా స్తంభించిపోయింది. నేను వేగంగా సినిమాలు చేద్దామనుకున్న సమయంలో కరోనా వచ్చింది. తిరుమలలో ‘కార్తికేయ-2’ ప్రారంభించాం. దానికి చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ సంస్థలో ‘18పేజెస్‌’ చేస్తున్నాను. బన్నీ వాసు నిర్మాత. ఆ సినిమా షూటింగ్‌  ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనాతో ఆగిపోయింది.

మీరు ఇక్కడికి వస్తున్నారని తెలిసి చర్మాస్‌ షాపింగ్‌ వాళ్లు వచ్చారు. అక్కడి నుంచి బొమ్మలు కొట్టేశారట నిజమేనా?

నిఖిల్‌: (నవ్వులు) దొంగతనం ఏమీ కాదండీ. చిన్నతనంలో కొన్ని అడుగుతాం. ఇవ్వకపోతే వాటిని తీసికెళ్లి పోతాం. నాకు పుస్తకాలు చదవడమంటే ఇష్టం. లైబ్రరీలో వారానికి ఒక పుస్తకం మాత్రమే ఇచ్చేవారు. అప్పుడు నేను చెప్పకుండా కొన్ని పుస్తకాలు తీసుకెళ్లేవాడిని. చర్మాస్‌లో జియో జియో టాయ్స్‌(బొమ్మలు) అలానే తీసుకెళ్లి పోయాను. మా అమ్మ తీసుకెళ్లి మళ్లీ వాళ్లకు ఇచ్చేశారు.

మీ అమ్మానాన్న ఏం చేస్తారు?

నిఖిల్‌: మా తల్లిదండ్రులు విద్యారంగంలో ఉన్నారు. కాచిగూడ, బేగంపేటలో మాకు కాలేజీలు, దూర విద్యా కేంద్రాలు, డీమ్డ్‌ యూనివర్శిటీలు ఉన్నాయి. మా నాన్న వాటిని చూస్తుంటారు. అమ్మ వాటికి ప్రిన్సిపల్‌. చిన్నప్పటి నుంచి మా ఇంటిలో చదువుకొనే వాతావరణం ఎక్కువగా ఉండేది. నేను సినిమాల్లోకి వెళతానంటే అందరూ భయపడ్డారు. ‘హ్యాపీడేస్‌’ అనంతరం వాళ్లంతా సంతోషంగా ఉన్నారు. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ‘ఏం చేస్తున్నావ్‌’ అని తిట్టేవారు. సినిమాల్లో అందరూ విజయం సాధించలేరని చెప్పేవారు. నేనేమో ప్రయత్నించనివ్వమని అమ్మని అడిగేవాడిని. హీరోగా ప్రజలు ఒప్పుకొంటే సంతోషం లేకపోతే వచ్చి బిజినెస్‌ చూసుకుంటా అని చెప్పేవాడిని.

అంత చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన మీరు స్కూల్‌ ఎగ్గొట్టి స్నేహితులతో సరదాగా గడిపేవారట?

నిఖిల్‌: ఏమైనా సరే సినిమా విడుదల రోజే చూసేవాడిని. సినిమా బాగుంటే మూడు, నాలుగు సార్లు చూసేవాడిని.

మీకు ఇష్టమైన నటుడు ఎవరు?

నిఖిల్‌: నేను సినిమాల్లోకి రావడానికి ముఖ్య కారణం చిరంజీవి గారు. ‘గ్యాంగ్‌ లీడర్‌’  చూసి నేను చాలా స్ఫూర్తి పొందాను. స్కూల్‌ అంతా తిరుగుతూ అందరిని కొడుతూ, ‘చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో.. రప్ఫాడిస్తా’ అని చిరంజీవి డైలాగ్‌ చెప్పేవాడిని. నా మీద కంప్లైంట్‌ కూడా వెళ్లింది. అప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. కాలేజీకొచ్చాక ఒక్కో సినిమాను ఐదారు సార్లు చూసేవాడిని. ప్రతిసారీ ఒక్కో గ్యాంగ్‌తో ఆ సినిమాను చూసేవాడిని. అందరూ ఒక్క సారే సినిమాను చూస్తే, నేను వారంలో ఐదు సార్లు చూసేవాడిని. కాలేజీకి కొంచెం తక్కువే వెళ్లా. కానీ, పాస్‌ అయ్యా.

మీరు ఏం చదువుకున్నారు?

నిఖిల్‌: నేను అందరిలాగే  ఇంజినీరింగ్‌ చదివా. సర్టిఫికెట్‌ తీసుకొని ఇంట్లో కూడా చూపెట్టాను. గూగుల్‌లో నాకు ఉద్యోగం వచ్చింది. ‘అమ్మా నాకు ఎప్పుడైనా సరే జాబ్‌ వస్తుంది. రెండు సంవత్సరాలు సమయం ఇవ్వు’ అని అడిగా. వారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. నాకు శేఖర్‌ కమ్ముల గారు ‘హ్యాపీడేస్‌’లో అవకాశం ఇచ్చారు.

‘హ్యాపీడేస్‌’లో అవకాశం ఏలా వచ్చింది?

నిఖిల్‌: ఆడిషన్స్‌తోనే అవకాశం వచ్చింది‌. దాదాపు 1.2లక్షల అప్లికేషన్స్‌ వచ్చాయి. నేను రాజేశ్‌ పాత్రకు ఎంపికయ్యాను. ఆడిషన్‌ సమయంలోనే ‘ప్రస్తుతం నువ్వు ఈ పాత్రకు సెలక్ట్‌ అయ్యావు. నీ కంటే ఎవరైనా బాగా చేస్తారని నాకనిపిస్తే వారికే ఈ పాత్రను ఇస్తాను’ అని శేఖర్‌ సర్‌ చెప్పారు. ఆ పాత్ర కింద నా ఫొటోను కూడా పెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ పాత్ర కింద వేరే వ్యక్తి ఫొటో పెట్టారు. ప్రస్తుతం అతడు కూడా ఇండస్ట్రీలో ఓ మంచి నటుడు. అందువల్ల  నేను అతడి పేరు చెప్పను. (మధ్యలో ఆలీ అందుకుని.. అతను విజయ్‌ దేవరకొండ అనుకుంటా) కాదు‌. విజయ్ ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిపుల్‌’లో నటించాడు. హ్యాపీడేస్‌ చిత్రంలో వేరే నటుడి ఫొటోను ఆ పాత్ర కింద పెట్టారు. ఆఫీసుకు ఎవరు వచ్చినా నాకు భయం వేసేది.

ఆ సినిమాలో అందరూ బాగానే చేశారు. నన్ను కూడా చందు, టైసన్‌తో సహా అన్ని పాత్రలకు ట్రై చేశారు. నేను మాస్‌గా మాట్లాడతానని రాజేశ్‌ పాత్రకు ఎంపిక చేశారు. వేరే వాళ్లు నా పాత్రను తీసుకెళ్లి పోతారేమోనని సెట్లోకి ఎవరు వచ్చినా నాకు భయంగా ఉండేది. ఇక్కడ ఉండాలంటే పూర్తి స్థాయిలో ప్రతిభను చూపాలని అర్థమైంది. శేఖర్‌ సర్‌ నన్ను నిజాయతీగా ఎంపిక చేశారు. ఆయన నాకు బంధువు కూడా కాదు. ఆడిషన్స్‌ మాత్రమే తీసుకొని మమ్మల్ని పరిశ్రమలోకి వదిలారు. నాకు ఎప్పుడు అవకాశం లభించినా సరే శేఖర్‌ సర్‌కి థ్యాంక్యూ చెప్తా. నేను ఎప్పుడు ఏది కొనుకున్నా ఆయన దయ వల్లే అని అనుకుంటా.

మీరు హీరో కావాలనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జాయిన్‌ అయ్యారట నిజమేనా?

నిఖిల్‌: ‘హైదరాబాద్‌ నవాబ్స్‌’ దర్శకుడు లక్ష్మీకాంత్‌ చెన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరా. నేను సినిమాలో చివరి అబ్జర్వర్‌ని. నాకు హిందీ కొంచెం వచ్చు కాబట్టి డైలాగ్‌లు రాయడం, సూట్‌కేసులు మోయడం లాంటి పనులు చేసేవాడిని. ఆ సినిమాకు సుధీర్‌ వర్మ కూడా పని చేశాడు. తను ఎక్కడికి వెళ్లినా నన్ను తీసుకెళ్లేవాడు. ఆ సినిమాకు పని చేయడంతో అనుభవం పెరిగింది. ‘నువ్వు డైరెక్ట్‌గా హీరో అవుతానంటే ఎవరూ ఒప్పుకోరు. ముందుగా సినిమా అంటే ఏంటో తెలుసుకో. పరిశ్రమలో సర్కిల్‌ని పెంచుకో. ఎవరైనా డైరెక్షన్‌ ఛాన్స్‌ కోసం ప్రయత్నిస్తుంటే ముందుగా వారినే పట్టుకో’ అని సలహా ఇచ్చాడు. నేను సుధీర్‌వర్మని, చందు మొండేటిని పట్టుకున్నాను. తర్వాత వారిద్దరూ నాకు ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ విజయాలు అందించారు. మా మధ్య డీల్ ఏంటంటే ముందుగా నేను హీరో అయితే వాళ్లకి దర్శకుడిగా ఛాన్స్‌ ఇవ్వాలి. వాళ్లు దర్శకులైతే నన్ను హీరోని చేయాలి. అందుకే ఎప్పుడూ ఒక గ్యాంగ్‌ను‌ మెయింటేన్‌ చేసేవాడిని. ఒక్కసారి మిత్రుడిగా మారిన తర్వాత నేను ఎవరిని అంత త్వరగా వదలను. వాళ్లతో నాకు లైఫ్‌ లాంగ్‌ జర్నీ ఉంటుంది. గొడవలు, మనస్పర్థలు అనేవి మా మధ్య ఎప్పటికి రావు.

మీ మొదటి సినిమా ‘హ్యాపీ డేస్’‌. జీవితంలో ‘హ్యాపీ డేస్‌’ ఎప్పటి నుంచి మొదలయ్యాయి.

నిఖిల్‌: సినిమా పరిశ్రమలో ప్రతి రోజూ, ప్రతి సినిమాకు పోరాటం చేయాల్సిందే. ‘స్వామి రారా’  విజయం సాధించిన తర్వాత  ప్రజలు నన్ను గుర్తించడం మొదలుపెట్టారు. ఆ స్థాయిని నిలబెట్టుకోవడం అనేది కొంచెం కష్టం. 2014నుంచి నేను సంతోషంగా ఉన్నాను. మంచిరోజులు ఇంకా ముందున్నాయనేది నా అభిప్రాయం.

నిఖిల్‌ ఎక్కువగా రవితేజని అనుకరిస్తాడని ప్రేక్షకులలో టాక్‌ ఉంది నిజమేనా?

నిఖిల్‌: అవును సార్‌. పవన్‌ కల్యాణ్‌గారు‌, రవితేజగారంటే నాకు చాలా ఇష్టం‌. అప్పుడు వారు యూత్‌ ఐకాన్స్‌. వాళ్ల యాక్టింగ్‌ చాలా నేచురల్‌గా ఉంటుంది. తెలియకుండానే వాళ్లను ఎక్కువగా అనుకరించేవాడిని. ‘స్వామి రారా’ వరకు తెలియకుండానే నేను వాళ్లలా చేసేవాడిని. ‘వేరే నటులను అనుకరించడం కాదు, పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో నువ్వు కూడా అలా చెయ్‌’ అని సుధీర్‌, చందూ నాకు చెప్పేవారు. నాటి నుంచి సినిమాలో పాత్రలా ఉండటానికి ప్రయత్నించేవాడిని. అప్పట్లో చాలా మంది దర్శకులు నా దగ్గరికి వచ్చేవారు. నువ్వు రవితేజలా చేస్తావు కదా. యంగ్‌ రవితేజలా నటించమని చెప్పేవారు. రవితేజ గారి డేట్స్‌ దొరకపోతే ఆ స్క్రిప్ట్స్‌తో నా దగ్గరికి వచ్చేవారు.

మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?

నిఖిల్‌: మాది ప్రేమ వివాహం. ఒక బర్త్‌డే పార్టీలో నేను ఆమెని కలిశాను. ఆ పార్టీకి ఒక జంట వచ్చింది. అబ్బాయికి నేను ఫ్రెండ్. అమ్మాయికి తను ఫ్రెండ్. అలా మొదలైన మా పరిచయం ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నాం. మంచి అమ్మాయి అని చూడగానే నాకు అర్థమైంది. ఆమె డాక్టర్‌. తను చాలా తెలివైంది.

మాయ ఎవరు నిఖిల్‌. మీ పాప పేరు అదేనట?

నిఖిల్‌: మీరు అలా అంటే ప్రేక్షకులు ఇంకేదో అర్థం చేసుకుంటారు. నా ఫ్రెండ్‌ సర్కిల్‌లో కూడా చాలా మందికి మాయ అనే పేరు ఉంది. షారుఖ్‌ఖాన్‌ ‘దిల్‌తో పాగల్‌ హై’లో మాయ అనే చిన్న క్యారెక్టర్‌ ఉంటుంది. ప్రతిసారీ హీరో మాయ అని కలవరిస్తుంటాడు. మాధురి దీక్షిత్‌ మాయ ఎవరు అని అడుగుతుంటుంది. ఆ సినిమా అంటే నాకు ఇష్టం. నాకు కూతురు పుడితే మాయ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాను. పల్లవిని కలిసిన కొన్ని రోజులకే ‘మన కూతురికి మాయ అని పేరు పెట్టాలనుకుంటున్నాను. నీకు ఓకేనా’ అని అడిగాను.

అబ్బాయి పుడితే మాయలోడు అని పేరు పెడతావా?

నిఖిల్‌: (నవ్వులు) నా ఫేవరేట్‌ సినిమా సార్‌. అందులో మీరు నటించారు. అబ్బాయి పుడితే ఏం పేరు పెట్టాలని ఇంకా నిర్ణయించుకోలేదు. అబ్బాయిలయితే డేంజరే. చాలా సమస్యలు వస్తాయి. నాకు మాత్రం కూతురు కావాలి.

ప్రస్తుతం మీ భార్య ఏం చేస్తున్నారు.

నిఖిల్‌: నా భార్య డాక్టర్‌. ప్రస్తుతం అనస్తీషియాలో పీజీ స్పెషలైజేషన్‌కు ప్రిపేర్‌ అవుతోంది. (మధ్యలో ఆలీ అందుకుని, నీకు మత్తే అన్నమాట. ఆవిడతో చాలా జాగ్రత్తగా ఉండు. ఏమండీ ఎవరో వస్తున్నారు చూడండి అని చెప్పి మత్తు ఇంజక్షన్‌ ఇస్తుంది.  మా అమ్మాయి కూడా డాక్టరే(బీడీఎస్‌). మా అమ్మాయితో పెట్టుకుంటే పళ్లు ఊడిపోతాయి. నాకు 1994లో పెళ్లి అయింది. మూడు సంవత్సరాలకు పాప పుట్టింది. నా వయసు 1998లోనే ఆగిపోయింది. ఎందుకంటే ‘యమలీల’లో నటిస్తున్నప్పుడు కైకాల సత్యనారాయణ గారు నాకు తినమని ఫ్లాంతర్‌పగిడి అనే ఒక ఐటమ్‌ ఇచ్చారు. అది తినడంతో నా వయసు అక్కడే ఆగిపోయింది.)

మీరు దర్శకత్వం చేస్తున్నారట నిజమేనా?

నిఖిల్‌: ప్రస్తుతం కమర్షియల్‌ సినిమాలు తీయలేం. ప్రస్తుతం నేను చేస్తున్న‘కార్తికేయ2’, ‘18 పేజెస్‌’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాల షూటింగ్ జరగాలంటే చాలా మంది సెట్లో ఉండాలి. ప్రస్తుతం షూటింగ్‌లు ప్రారంభమయ్యే సూచనలు లేవు. భౌతికదూరం పాటిస్తూ చాలా తక్కువ మందితో సినిమాని తెరకెక్కించాలనుకుంటున్నాను. గతంలో ‘యమలీల’, ‘లిటిల్ సోల్జర్స్’‌, ‘దేవుళ్లు’, ‘మాయలోడు’, ‘సిసింద్రీ’ వంటి సినిమాలు పిల్లల కోసం వచ్చేవి.

ప్రస్తుతం సినిమాలనగానే కమర్షియల్ ఫార్మాట్‌లో మాత్రమే వస్తున్నాయి. పిల్లల కోసం సినిమాలు రావడం తగ్గిపోయింది.  చిన్న పిల్లల సినిమా అనగానే ‘చోటాభీమ్’‌, ‘ఫ్రోజోన్‌’ అయిపోయింది. నేను చిన్నప్పుడు ఎలా ఎంజాయ్‌ చేశానో అనుభవాలను తెలుపుతూ సినిమాకు దర్శకత్వం వహిస్తాను. మా బావగారు, బిగ్‌ సినిమాస్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తాయి. ప్రస్తుతం పిల్లల ఆడిషన్‌ జరుగుతోంది. ఆన్‌లైన్‌లో ఎవరైనా ఆడిషన్‌ ఇవ్వవచ్చు. మరో పదిరోజుల్లో సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది. అండమాన్‌లో ఒక షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశాం. 

సినిమా మొత్తం పిల్లలే ఉంటారా?

నిఖిల్‌: పిల్లలంటే వాళ్ల అమ్మా నాన్నల పాత్రలు కూడా ఉంటాయి. నేను సినిమాలో ఒక అతిథి పాత్రలో నటిస్తాను. దాదాపుగా పది నిమిషాలు ఆ పాత్ర నిడివి ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి పిల్లవాడు స్ఫూర్తి పొందాలి. నేను ఏమీ తెలియకుండా దర్శకత్వం వహించడం లేదు. న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ఆరు నెలల పాటు కోర్సును చేశా. మాములుగా సినిమాను తీయకూడదు. అందువల్ల కొంచెం పరిశోధన చేసే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాను. మంచి ప్రొడక్షన్‌ విలువలతో సినిమాను నిర్మించాలని అనుకుంటున్నాం.

షూటింగ్ జరుగుతున్నప్పుడు పాములు రావాలి అని కోరుకుంటారట? నిజంగానే పాము కూడా వచ్చిందట కదా!

నిఖిల్‌: నాకు మూఢ నమ్మకాలు ఏమీ లేవు‌. ‘కార్తికేయ’ మొత్తం పాము మీదే ఉంటుంది. సెట్‌లోకి పాము వస్తే  సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందని ఎవరో చెప్పారు. మామూలుగా అయితే ఇటువంటివి నేను నమ్మను. కానీ, ఆయన చెప్పిన మాటలు  నాకు మైండ్‌లో అలానే ఉండిపోయాయి. సెట్లోకి నిజంగానే పాము వచ్చింది. చందు మొండేటి, యూనిట్‌ మొత్తం పరిగెడుతున్నారు. నేను పాము వైపునకు పరిగెత్తి ఎక్కడ అని అడిగాను. అందరూ నన్ను పిచ్చివాడిని చూసినట్టు చూశారు. పాము సెట్లోకి రాగానే నేను చాలా సంతోషించాను.

చందు మొండేటి ఎప్పుడు షాపింగ్‌ చేసినా బిల్లు ఏంటి మీకు వస్తుందట నిజమేనా?

నిఖిల్‌: ఈ విషయం చెప్తే చందూ కొడతాడు నన్ను. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న రోజుల నుంచి మేము మిత్రులం. అప్పటి నుంచి మేం డబ్బులను షేర్‌ చేసుకునే వాళ్లం. అప్పుడప్పుడు రెండు, మూడు వేలు స్వైప్‌ అయినట్టు నాకు మేసేజ్‌ వచ్చేది. నా కార్డు ఎక్కడ అని వెతికితే చందు దగ్గర ఉండేది. నేను ఫోన్‌ చేస్తే నీ కార్డ్‌ నా దగ్గర భద్రంగా ఉంది అని చెప్పేవాడు. ‘నిఖిల్‌ నీ కార్డ్‌ నా దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటుంది’ అని చెప్పేవాడు. అతడు నాకు సోదరుడిలాంటి వాడు. తన డబ్బులంటే నా డబ్బులే. నా డబ్బులంటే తన డబ్బులే. (మధ్యలో ఆలీ అందుకుని నేను కూడా ఆయన ఇంటికి వెళ్లి కార్డు తీసుకుని షాపింగ్‌ చేస్తా... నవ్వులు)

పుణె ట్రిప్‌ వెళ్లొచ్చిన తర్వాత కెరీర్‌ హైప్‌నకు వెళ్లిందట!

నిఖిల్‌: కెరీర్‌ తెలియదు కానీ, లైఫ్‌ మాత్రం హ్యాపీగా ఉంది. పుణెకు దగ్గరలో లోనావాలా అనే ప్రాంతం ఉంది. చాలా అందంగా ఉంటుంది. పల్లవి, స్నేహితులందరం కలిసి రోడ్‌ ట్రిప్‌కు వెళ్లాం. అక్కడి నుంచి గోవాకు వెళ్లాం. అక్కడ కాస్త సినిమా స్టైల్‌లో పల్లవికి ప్రపోజ్‌ చేశా.

మీ ఇంట్లో అభ్యంతరం చెప్పలేదా?

నిఖిల్‌: మొదటి నుంచీ మా ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇదే విషయాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులకీ చెప్పాం. ఒప్పుకోవడానికి మొదట్లో కాస్త తటపటాయించినా.. ఓకే చెప్పారు. విశాల ఆలోచన దృక్పథం కలవాళ్లు.

రాబోయే సంక్రాంతి మీ పెళ్లయ్యాక తొలి పెద్ద పండగ అవుతుంది కదా? నర్సాపూర్‌ వెళ్తే కోడి పందేలు చూసిరావచ్చు కదా!

నిఖిల్‌: చికెన్‌ కర్రీ తినమంటే తింటా కానీ, కోడి పందేలు అంటే నాకు కాస్త భయం.

మనసు బాగోలేకపోతే కారు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతారట!

నిఖిల్‌: నా సినిమా పరాజయం పాలైనప్పుడు సామాజిక మాధ్యమాల్లో కాస్త విమర్శలు వస్తుంటాయి. అలాంటి సమయంలో అన్నీ షట్‌డౌన్‌ చేసి దూరంగా వెళ్లిపోతా. అలా దిల్లీ, అరుణాచల్‌ప్రదేశ్‌ వెళ్లిపోయా. ఒకసారి లండన్‌ కూడా వెళ్లా. అక్కడ కారు తీసుకుని స్కాట్లాండ్‌, వేల్స్‌ అన్నీ తిరిగి వచ్చా. మనం బతికేది తక్కువ రోజులు. కాబట్టి ప్రపంచమంతా చూడాలి. ఏయే దేశాల్లో ప్రజలు ఎలా ఉంటారో తెలుసుకోవాలి.

విజయం వచ్చినా, అపజయం వచ్చినా వెన్నుతట్టి ప్రోత్సహించేవాళ్లు ఎవరు?

నిఖిల్‌: నా నిర్మాతలందరూ నన్ను ప్రోత్సహించిన వారే. విశ్వప్రసాద్‌గారు, ఏషియన్‌ సునీల్ వీళ్లంతా నాకు ఎంతో సహకరించారు. ‘అర్జున్‌ సురవరం’ విడుదల ఆగిపోయినప్పుడు చిరంజీవిగారికి తెలిసి ఆ సినిమా చూశారు. ‘ఇంత మంచి సినిమా ఎందుకు ఆగిపోయింది. నేనే వచ్చి దీనికి ప్రమోట్‌ చేస్తా’ అని చెప్పి ఆయన ఆడియో ఫంక్షన్‌కు వచ్చారు.

మీరు ఇండస్ట్రీలోకి రావడానికి మీ కుటుంబంలో సపోర్ట్‌ చేసిన వాళ్లు ఎవరు?

నిఖిల్‌: మా అమ్మానాన్నలకు మేం ముగ్గురం సంతానం. నేను, చెల్లి, తమ్ముడు. చెల్లి గృహిణి. తమ్ముడు నాకన్నా పదేళ్లు చిన్నవాడు. తను బిజినెస్‌ చూసుకుంటున్నాడు. నేను ఇండస్ట్రీలోకి రావడానికి బాగా ప్రోత్సహించింది మా అమ్మ వినా సిద్ధార్థ.

‘ఆలస్యం అమృతం విషం’ ఎందుకు చేయాల్సి వచ్చింది?

నిఖిల్‌: అప్పటి వరకూ చిన్న చిన్న నిర్మాణ సంస్థల్లో చేశా. ఒక్కసారి రామానాయుడుగారిలాంటి పెద్ద నిర్మాత అవకాశం ఇస్తే ఎంతో సంతోషం అనిపించింది. ‘సర్‌ నాకు కథ కూడా చెప్పొద్దు. మీకోసం చేస్తా’ అని ఆ సినిమా చేశా. రామానాయుడు స్టూడియోస్‌లో వాళ్ల నిర్మాణ సంస్థలో చేసిన హీరో-హీరోయిన్‌ల ఫొటోలు ఉంటాయి. అక్కడ నా ఫొటో కూడా ఉండాలనేది కోరిక. అది నెరవేరింది.

ఇండస్ట్రీలో స్నేహితులు ఎవరు?

నిఖిల్‌: అందరితోనూ స్నేహంగానే ఉంటా. ఒకరినొకరం సహకరించుకుంటాం. నాని, అల్లరి నరేష్‌, బన్ని, ప్రభాస్‌ అన్నా అందరం కలిసే ఉంటాం. నాకు బాగా క్లోజ్‌ ఫ్రెండ్‌ అంటే రాజ్‌తరుణ్‌. వరుణ్‌ సందేశ్‌తో కూర్చొంటే సమయమే తెలియదు.

సస్పెన్స్‌ చిత్రాలంటే ఇష్టమా? ఎక్కువగా ఆ జోనర్‌లో సినిమాలు చేస్తున్నారు!

నిఖిల్‌: సాధారణ ప్రేమ కథలు అందరూ చేస్తారు. కానీ, సినిమాలో ఓ ట్విస్ట్‌ ఉంటే బాగుంటుంది. ప్రతిసారీ అలా కుదరదు. దొరికినప్పుడు మాత్రం సద్వినియోగం చేసుకుంటా. నా సినిమాల్లో ‘కార్తికేయ’ నాకు బాగా ఇష్టం. అలాగే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ కూడా బాగుంటుంది.

స్వాతితో పనిచేయడం ఎలా అనిపించింది?

నిఖిల్‌: చాలా మంచి అమ్మాయి. తనతో ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ చేశా. రెండూ హిట్‌లే. తను పెళ్లయి చాలా హ్యాపీగా ఉంది. ఇటీవల జరిగిన నా పెళ్లికి తను కూడా రావాల్సింది. కానీ, 50మందికే పర్మిషన్‌ ఉండటంతో వీడియో కాల్‌ ద్వారా విషెస్‌ చెప్పింది. తను చాలా ఇంటెలిజెంట్‌. ఒక స్క్రిప్ట్‌ చెబితే, అందులో ఏయే తప్పులు ఉన్నాయో కూడా చెబుతుంది. తను కూడా డైరెక్టర్‌ కావాల్సింది.

‘స్వామి రారా’లో దొంగ పాత్ర చేశారు. అందుకు ట్రైనింగ్‌ ఏమైనా తీసుకున్నారా?

నిఖిల్‌: కొంచెం శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత షాపింగ్‌ మాల్‌లో షూటింగ్‌కు వెళ్లినప్పుడు జూనియర్‌ ఆర్టిస్ట్‌ల దగ్గరే కాకుండా ఇద్దరు నిజమైన కస్టమర్ల దగ్గర కూడా పర్సు కొట్టేశాం. చాలా సేపటి తర్వాత ఆ విషయం తెలిసింది. మేము తీసినట్లు వాళ్లకు కూడా తెలియదు.

మీ జీవితంలో రోజుకో గంట ఒకరిని మర్చిపోవాలంటే ఎవరిని మర్చిపోతారు?

నిఖిల్‌: డొనాల్డ్‌ ట్రంప్‌. ఎందుకంటే ఏదో ఒక వివాదాస్పద ట్వీట్‌ పెడుతూనే ఉంటారు. నేను సోషల్‌మీడియా ఓపెన్‌ చేయగానే ఆయన ట్వీట్లు కనిపిస్తాయి. కోపం వస్తుంది.

తమన్నాకు ఒక ముద్దు పేరు పెట్టమంటే?

నిఖిల్‌: తమ్మూ...

తెలుగు ఇండస్ట్రీలో ఒక మూవీ రీమేక్‌ చేయమంటే ఏ సినిమా చేస్తారు?

నిఖిల్‌: క్షణక్షణం.

ఆర్జీవీ గురించి ఒక స్టేట్‌మెంట్‌ ఇవ్వమంటే?

నిఖిల్‌: అద్భుతమైన దర్శకుడు. సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన డైరెక్టర్‌. ‘స్వామి రారా’ విడుదలైనప్పుడు ఆర్జీవీ నుంచి ఫోన్‌ వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని