గాలిలో వైరస్‌ వ్యాప్తి: CCMB కీలక అధ్యయనం! - CCMB study to check corona can travel in air
close
Published : 28/09/2020 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గాలిలో వైరస్‌ వ్యాప్తి: CCMB కీలక అధ్యయనం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి ఎలా సంక్రమిస్తోందన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దీనిపై హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయోలజీ(సీసీఎంబీ) కీలక అధ్యయనం ప్రారంభించింది. ముఖ్యంగా గాలిలో వైరస్‌ వ్యాపిస్తుందా?లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. ఒకవేళ వ్యాపిస్తే..ఎంతసేపు, ఎంత దూరం దాని ప్రభావం ఉంటుందనే విషయాలను కనుగొనే పరిశోధనను సీసీఎంబీ మొదలుపెట్టింది.

గాలిలో వైరస్‌ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు. దీనిపై తొలుత ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎలాంటి స్పష్టతనివ్వలేదు. కానీ, గాలిలో వైరస్‌ వ్యాపిస్తోందనడానికి రుజువులున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించారు. చివరకు దీన్ని అంగీకరించిన డబ్ల్యూహెచ్‌వో.. వెంటిలేషన్ లేని రద్దీ ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో వైరస్‌ గాలిలో వ్యాపించడం సాధ్యమే అని అభిప్రాయపడింది. ఇక అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలణ కేంద్రాలు(సీడీసీ) కూడా గాలిలో వైరస్‌ వ్యాప్తిపై పలుసార్లు మార్గదర్శకాలను మార్చింది. ఈ సమయంలో సీసీఎంబీ చేపట్టిన తాజా పరిశోధన కీలకంగా మారనుంది.

ముఖ్యంగా ఆసుపత్రుల పరిసరాల్లో పాజిటివ్‌ ఉన్న వ్యక్తుల నుంచి వైరస్‌ ఎలా సంక్రమిస్తుందో అని అంచనా వేసేందుకు సీసీఎంబీ ఈ పరిశోధన చేపట్టింది. పదిరోజుల క్రితమే ఈ అధ్యయనం ప్రారంభించామని.. ఒకవేళ గాలిలో వైరస్‌ వ్యాపిస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకొనేందుకు ఈ అధ్యయనం చేపట్టినట్టు సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా వెల్లడించారు. కరోనా పోరులో ముందున్న వైద్యసిబ్బందికి సహాయం చేసేందుకే ఈ అధ్యయనం చేపట్టామని తెలిపారు. అయితే, వీటి ఫలితాలు వచ్చిన తర్వాత క్లోజ్‌డ్‌ హాళ్లు, బ్యాంకులు, మాల్స్‌ వంటి రద్దీ ప్రదేశాల్లో వైరస్‌ వ్యాప్తి తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి శాంపిళ్లను సేకరిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిశోధన కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఎయిర్‌ శాంప్లర్లను ఏర్పాటు చేశారు. ఐసీయూ, కొవిడ్‌ వార్డులతోపాటు వైరస్‌ సంక్రమణకు వీలున్న ప్రదేశాల్లో వీటిని సేకరిస్తున్నారు. వీటి ద్వారా రెండు, నాలుగు, ఎనిమిది మీటర్ల దూరాల్లో వైరస్‌ ప్రభావాన్ని విశ్లేషించనున్నారు. తద్వారా గాలిలో వైరస్‌ ఎంతసేపు ఉంటుందో తెలుసుకోవడంతోపాటు ఎంత దూరం ప్రయాణించగలదనే విషయాన్ని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వైద్య, ఆరోగ్యసిబ్బంది వైరస్‌ బారినపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన వ్యూహాన్ని రచించేందుకు తాజా అధ్యయనం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా భౌతిక దూరం, మాస్కులపై మరిన్ని మార్గదర్శకాలు రూపొందించే ఆస్కారం ఉంటుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. వీటికి సంబంధించిన ప్రాథమిక ఫలితాలు తొందరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని