కరోనా... సామాజిక వివక్ష పెద్ద సమస్య - Do not Discriminate COVID 19 Patients Director Sekhar Kammula
close
Published : 25/07/2020 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా... సామాజిక వివక్ష పెద్ద సమస్య

కరోనా సోకిన వ్యక్తుల పట్ల ఇప్పటికీ వివక్ష కొనసాగుతోంది. బాధితుల కుటుంబ సభ్యులను సమాజం చిన్న చూపు చూస్తోంది. ఎన్నో అపోహలు, ఏం కాదు అనుకునే నిర్లక్ష్యం.. వీటిన్నింటిపై దర్శకుడు శేఖర్‌ కమ్ముల అవగాహన కల్పించాలనుకున్నారు. కరోనాను జయించిన వ్యక్తి కుటుంబ సభ్యులు కొండల్‌ రెడ్డిని ఫేస్‌బుక్‌ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. శేఖర్‌ కమ్ములతో ఆయన పంచుకున్న మాటలు.. 

శేఖర్‌కమ్ముల: మీ ఇంట్లో వాళ్లకు కరోనా వచ్చిందని తెలియగానే మీరు ఏం చేశారు? ఈ ఆందోళన నుంచి ఎలా బయటపడ్డారు?

కొండల్‌రెడ్డి: మా మామయ్యకు 75 ఏళ్లు. మధుమేహం, కంటిసమస్య, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు కరోనా సోకిందని తెలియగానే చాలా ఆందోళన చెందాం. అందరూ అంటరానివారిగా చూస్తారని భయపడ్డాం. కానీ స్నేహితులు వందలో 99 మంది కోలుకుంటున్నారని ధైర్యం చెప్పేవారు. అదే మమ్మల్ని ఆందోళన నుంచి బయటపడేసింది. అదే సమయంలో ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్న మా బాబుకూ లక్షణాలు ఉన్నాయని వార్తలు వ్యాపించాయి. ఇలాంటి అవాస్తవాలు మమ్మల్ని బాధించేవి. గాంధీ ఆస్పత్రిలో చేరిన తొమ్మిదో రోజే మామయ్య కోలుకున్నారు. డిశ్చార్జి అయ్యాక సామాజిక దూరం పాటిస్తూ  ఆయనకు సాయం చేసేవాళ్లం.

శేఖర్‌కమ్ముల: ఈ సమయంలో మిమ్మల్ని బాధించిన విషయాలేంటి?

కొండల్‌రెడ్డి: మాతో అయిదు రోజుల వరకు ఎవరూ మాట్లాడలేదు. తరువాత పక్కింటి వాళ్లు ఏమైనా సరకులు కావాలంటే  చెప్పండని చేయూతనందించడం ప్రారంభించారు. చాలా మంది ఇది అంటరాని కుటుంబం అన్నంత హంగామా చేస్తారు. దీంతో ఎంతో మంది టెస్టులు చేయించుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ వివక్ష ఉండకూడదు. కనీసం మాట సాయమైన చేయాలి. వాట్సప్‌ మెసేజ్‌లు, ఫోన్లు, వార్తలు చూడటం మానేశాం. ఇది మా మానసిక ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడింది.

శేఖర్‌కమ్ముల: ఈ సమయంలో ఎలాంటి ఆహారం ఇచ్చారు?

కొండల్‌రెడ్డి: మా ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే. అందుకే ఇప్పుడు మామయ్యకు ఆయన ఇష్టపడే జొన్నరొట్టే, రాగి సంగటి ఇస్తున్నాం. పచ్చ సొన లేని రెండు గుడ్లు, దానిమ్మ రసం అందిస్తున్నాం. మేమూ మాకు ఇష్టమైందే తింటున్నాం. గతంలో రోజూ చేసిన వ్యాయామాలు ఎంతో ఉపకరించాయి.

‘‘కరోనా విషయంలో... సామాజిక వివక్ష పెద్ద సమస్య. తోటి మనిషికి మనం సాయం చేయకపోయినా ఫరవాలేదు. వారిని వెనక్కి లాగేలా మాత్రం ప్రవర్తించకూడదు. ఎవరికైనా సాయం చేసేముందు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. ఉన్నంతలో ఎటువంటి ఆహారం తీసుకుంటే కరోనా రాకుండా ఉంటుందనే విషయాన్ని విస్తృతంగా ప్రభుత్వం ప్రచారం చేయాలి. పరీక్షలు ఎక్కడ జరుగుతున్నాయనే దానిపై అవగాహన కల్పించాలి.’’ - శేఖర్‌కమ్ముల
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని