భారత్‌లో తప్ప మరెక్కడా ఇలాంటిది లేదు: పూరీ - Puri Jagannadh about Avadhanam
close
Published : 21/11/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో తప్ప మరెక్కడా ఇలాంటిది లేదు: పూరీ

హైదరాబాద్‌: అవధానం అంటే మాటలు కాదని.. దానికి ఎంతో జ్ఞానం, నేర్పు, హాస్య చతురత ఉండాలని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. కేవలం భారత దేశంలో మాత్రమే అవధానం చేసే మహా పండితులు ఉన్నారని వివరించారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన అవధానం గురించి ముచ్చటించారు.

‘భారతదేశంలో పురాతన కాలం నుంచి ఓ సాహిత్య ప్రదర్శన ఉంది. దాని పేరు ‘అవధానం’. దీని గురించి ఇప్పుడున్న చాలా మంది పిల్లలకు తెలియదు. ఈ సాధన సంస్కృతం భాష నుంచి వచ్చింది. అవధానం చేయాలంటే అతడు మహాజ్ఞాని అయి ఉండాలి. కవితలు, సృజనాత్మకత, మేధస్సు, జ్ఞాపకశక్తి, సంగీతం, లెక్కలు, హాస్యచతురత.. ఇలా ఎన్నో లక్షణాలు ఉండాలి. వెయ్యి మంది కూర్చుని.. వెయ్యి ప్రశ్నలు సంధిస్తే అందరికీ పద్య రూపంలో సమాధానం చెప్పాలి. అవి ఛందస్సులో ఉండాలి. ఒక వ్యక్తికి సమాధానం చెబుతూ.. వెంటనే రెండో వ్యక్తి ప్రశ్న వినాలి. ఇలా వింటూ.. అందరికీ జవాబులు చెప్పాలి. ఆ సమాధానాలు అర్థవంతంగా ఉండాలి. దీనికి తోడు అసందర్భంగా మాట్లాడేవారు కొందరు ఉంటారు. వాళ్లు మాటిమాటికీ మధ్యలో కల్పించుకుని.. ఇబ్బంది పెడుతుంటారు. ‘సన్నీ లియోనీ ప్రధానమంత్రి అయితే ఎలా ఉంటుంది?’ అని అడుగుతాడు. ఈ టార్చర్‌ కాకుండా వెనుక ఒకడు మల్లెపూల బుట్టతో కూర్చుంటాడు. వాడు అవధానం చేసే వ్యక్తి వీపుపై మల్లెపూలు విసురుతుంటాడు. అందరికీ జవాబులు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఎన్ని మల్లెపూలు విసిరాడో చెప్పాలి’.

‘ఒక్క మనిషి ఇన్ని పనులు చేయడం అంటే సామాన్యం కాదు, చేతులెత్తి మొక్కాలి. ఈ ప్రశ్నలు అడిగేవాళ్లు కూడా మహా పండితులు. ఒక్కోసారి వారి గురువులే ప్రశ్నలు అడుగుతుంటారు, జవాబు చెప్పాలంటే ఎంత కష్టం?. అందుకే అవధానం చేసే మనిషి రుషి అయి ఉండాలి. ఎలాంటి గర్వం ఉండకూడదు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటిది లేదు. మనకు మాత్రమే ఉంది. ఇక్కడి వారు మాత్రమే అవధానం చేయగలరు. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం.. ఇలా ఉంటాయి. తిరుపతి వెంకట కవుల నుంచి ఎంతో మంది అవధానం చేశారు. ఇప్పుడున్న వారిలో మేడసాని మోహన్‌ పంచసహస్త్రావధానం చేశారు. గరికపాటి నరసింహారావు, రాళ్లబండి కవితా ప్రసాద్‌, మాడుగుల నాగఫణి శర్మ, వడ్డిపర్తి పద్మాకర్‌, ఆముదాల మురళి, కడిమళ్ల వరప్రసాద్‌, లలిత ఆదిత్య.. ఇలా ఎంతో మంది ఉన్నారు. వీరిలో నాకు గరికపాటి గారు చాలా ఇష్టం. ఆయన వీడియోలు చూస్తుంటా. గొప్పగొప్ప విషయాల్ని.. నవ్వుతూ సరదాగా చెబుతుంటారు. అందరూ వాటిని జోక్స్‌ అనుకుంటారు.. ఆయన మనల్నే తిడుతున్నారనే విషయం ఎవరికీ అర్థం కాదు.  ఏదేమైనప్పటికీ ప్రపంచంలో ఎక్కడాలేని మహానుభావులు మన దగ్గరే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. వీలుంటే సహస్త్రావధానం వీడియో చూడండి. చాలా బాగుంటుంది. అవధానం అంటే మాటలు కాదు.. ఒక్కమాటలో చెప్పాలంటే సరస్వతీదేవి లాలించిన పిల్లలు మాత్రమే ఈ అవధానం చేయగలరు’ అని పూరీ వివరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని