అవసరమైతే కాలర్‌ పట్టుకునే అమ్మాయిలు వీళ్లు - Puri musings about TomBoy
close
Updated : 25/11/2020 20:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవసరమైతే కాలర్‌ పట్టుకునే అమ్మాయిలు వీళ్లు

హైదరాబాద్‌: ‘టామ్‌బాయ్‌’ అంటే అమ్మాయి అయినప్పటికీ అబ్బాయిలా ప్రవర్తించటం.  నాకు ‘టామ్‌బాయ్స్‌’ అంటే ఎంతో ఇష్టం. అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. పూరీ మ్యూజింగ్స్‌ పేరుతో పూరీ రోజూ వినిపిస్తున్న పలుకుల్లో ‘టామ్‌బాయ్‌’ గురించి వినిపించారు. అందులో చెప్పిన విషయం ఆయన మాటల్లోనే...

‘అబ్బాయిలు చేసే పనుల మీద ఆసక్తి చూపించటం. అంతేకాకుండా వాళ్లు అబ్బాయిల్లా దుస్తులు ధరిస్తారు. వాళ్లల్లో అమ్మాయి లక్షణాలు లేవని కాదు. ఉంటుంది. కానీ, మిగతా అమ్మాయిల్లా ఎక్కువ సమయం అద్దం ముందు కూర్చోవటం, గంటలు తరబడి మేకప్‌లు ఉండవు. వాళ్ల ముస్తాబు సైతం ఎవరినీ ఆకర్షించేందుకు చేయరు. వాళ్లకి నచ్చినట్టుగా, సౌకర్యవంతమైన దుస్తులు ధరించటానికి ఇష్టపడతారు. టామ్‌బాయ్స్ ఎప్పుడూ సిగ్గుపడరు. ధైర్యంగా మాట్లాడతారు. కోప్పడాల్సి వస్తే నిర్భయంగా, మనస్ఫూర్తిగా మీకంటే బాగా మాటలు అనగలరు’. అని పూరీ చెప్పారు.

‘నిజానికి, వీళ్లు డ్రామా రాణులు కాదు. ఏది ఉన్నా మొహం మీదే చెప్పేస్తారు. కలల్లో జీవించరు. చాలా ఆచరణాత్మకంగా ఉంటారు. డబ్బున్న అబ్బాయి కోసం ప్రయత్నించరు. ఎవరైనా దొరికితే పెళ్లి చేసుకొని వెళ్లిపోవాలని చూడరు. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అని ఆలోచిస్తారు. ఏ బిజినెస్‌ చేద్దామా? అని ప్రణాళికలు వేస్తుంటారు. వాళ్లెప్పుడూ కుటుంబం కోసం నిలపడతారు. వాళ్లతో అభిప్రాయాలను పంచుకోవటం అబ్బాయిలకు చాలా సులభం. ఎందుకంటే అబ్బాయిలను ఎంతో సులభంగా అర్థం చేసుకుంటారు. వాళ్లతోనే ఉంటారు. వాళ్లతోనే పోటీ పడతారు. సమాజాన్ని అస్సలు పట్టించుకోరు. మీ గర్ల్‌ఫ్రెండ్‌ను మీ స్నేహితులకు పరిచయం చేయండి. ఆ అమ్మాయి అందరితో మంచిగా ఉండదు. చాలా లెక్కలు ఉంటాయి. ఈ టామ్‌బాయ్‌ మిత్రుడిని అందరికీ పరిచయం చేయండి. ఐదు నిమిషాల్లో వాళ్లతో కలిసిపోతుంది’. అని ఆయన అన్నారు.

‘వాళ్లు అబ్బాయిల్లానే ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారు. మిగతా అమ్మాయిల్లా అబ్బాయిలపై నిందలు వేస్తూ మాట్లాడరు. కోపం వస్తే మొహం మీదే అనేస్తారు. వాళ్ల లోపల చాలా ఫైర్‌ ఉంటుంది. టెస్టోస్టెరన్‌ లెవల్స్‌ అబ్బాయిలకంటే ఎక్కువ ఉంటాయి. అందుకే వాళ్లు ఒలింపిక్స్ లో పరిగెడతారు. గుర్రపు స్వారీలు చేస్తారు. కార్లు, బైకులు నడుపుతారు. పెద్ద డయల్ ఉన్న గడియారాలు పెట్టుకుంటారు. షూ లేస్‌ బిగిస్తారు. వ్యాయామశాలలో డ్రామా రాణులు లిప్‌స్టిక్‌ పెట్టుకుంటుంటే, ఈ టామ్‌బాయ్స్ అబ్బాయిలతో పోటీగా వర్కౌట్లు చేస్తుంటారు’. 

‘వాళ్లతో అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తించలేరు. చేయనివ్వరు. వాళ్లను అత్యాచారం చేయలేరు. ఎందుకంటే వాళ్లు ఎదురు తిరుగుతారు. కార్యాలయంలో మీ పక్క డెస్క్ లో పని చేస్తుంటారు. అర్థరాత్రి రోడ్డు మీద నిల్చొని ట్యాక్సీ ఆపుతుంటారు. పార్టీ తర్వాత స్నేహితులందరినీ ఇళ్లల్లో విడిచిపెట్టి చివరగా ఒక్కరే ఇంటికి వెళతారు. అదే టామ్‌బాయ్‌’. అని పూరీ చెప్పారు.

‘టామ్‌బాయ్‌ ఈ ప్రపంచం మారుతోంది. మిలటరీలో ఉన్న మహిళలందరికీ వందనాలు. అలాగే పోలీస్‌, క్రీడలు, సంగీతం, నృత్యం, వివిధ రంగాల్లో పని చేస్తున్న మహిళలు. వీళ్లే మహిళలకు గౌరవం తీసుకొచ్చేది. కుమార్తె అబ్బాయిలా తిరుగుతుంటే మీకు భయం వేయచ్చు. ఇదిలా ఉంటే ఎలా పెళ్లవుతుంది దేవుడా అని కంగారు పడద్దు. అలాంటి కూతురున్నందుకు సంతోషించాలి. కాలర్‌ పట్టుకొని అబ్బాయిని కొట్టే అడపిల్ల మనకు కావాలి. పిల్లల మీద చేయి వేస్తే చంపేసే కాళికాదేవి కావాలి. అందరూ కలిసి అమ్మోరుకు ఎందుకు పూజలు చేస్తున్నారు. తాట తీస్తది కాబట్టి. అమ్మోరు ఎప్పుడూ ఏడవదు, భయపడదు, సిగ్గుపడదు. కళ్లెర్ర చేస్తుంది. గొంతు పట్టేస్తుంది’. 

‘నూర్‌ ఇనాయద్‌ ఖాన్‌, ఝాన్సీ లక్ష్మీబాయ్‌, సరస్వతి రాజామణి, పూలందేవి, కిరణ్‌ బేడీ, కరణం మల్లీశ్వరీ. ఇలాంటి వాళ్లే మనకు కావాల్సింది. కళ్లల్లో కసి, పట్టుదల ఉన్న మహిళలే నిజమైన అందగత్తెలు. ఫెమినిటీ నాలుగు గోడల మధ్యు ఉంటే చాలు. వార్‌ జోన్‌లు అవసరం లేదు. నిజమైన మహిళలు ఎల్లప్పుడూ టామ్‌బాయ్‌గా ఉంటారు’. అని పూరీ వివరించారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని