‘బుట్టబొమ్మ’ గురించి ఈ విశేషాలు తెలుసా? - Special story about pooja hegde on her birthday
close
Updated : 13/10/2020 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బుట్టబొమ్మ’ గురించి ఈ విశేషాలు తెలుసా?

‘ముకుంద’లో గోపికగా అచ్చమైన తెలుగు అమ్మాయి అనిపించుకుంది. ‘మొహంజదారో’లో చానీగా మెప్పించింది. ‘డీజే’లో అస్మైక యోగ.. తస్మైక భోగ అంటూ అందాలతో అలరించింది. ఇక ‘రంగస్థలం’ ఎక్కి ‘జిల్‌.. జిల్‌.. జిగేల్‌ రాణి’ అంటూ యువతను ఓ ఊపు ఊపేసింది. ‘అరవింద’గా ఆకట్టుకున్నా, ‘శ్రీదేవి’గా మురిపించినా ఆమెకే చెల్లింది. ‘మేడమ్‌ సర్‌.. మేడమంతే’ అంటూ ‘సామజవరగమన నిను చూసి ఆగలనా’ అంటూ యువ హృదయాలు సైతం తన కాళ్ల వెంట పడేలా చేసింది. ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కన్నడ భామ పూజా హెగ్డే. మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా పూజా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు ఆమె మాటల్లోనే..

‘‘నేను పుట్టి, పెరిగింది అంతా కర్ణాటక మంగుళూరులోనే. రణ్‌బీర్‌తో చేసిన యాడ్‌ను అశుతోష్‌ సతీమణి చూశారు. ‘మొహంజదారో’లోని కథానాయిక పాత్రకు నేనైతే సరిపోతానని భావించి ఆడిషన్‌కు పిలిచారు. సెలక్ట్‌ అవుతానో లేదోనని తెగ టెన్షన్‌పడ్డా. సెలక్ట్‌ అయిన తర్వాత నా సంతోషానికి అవధులు లేవు’’

‘‘నటిని కావాలన్న ఆలోచన మొదటి నుంచీ లేదు. ఎందుకంటే మా కుటుంబానికీ సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి అనుబంధం లేదు. నాన్నగారు మంజునాథ్‌ క్రిమినల్‌ లాయర్‌. కానీ, అడ్వర్టైజ్‌మెంట్‌ రంగంలో స్థిరపడ్డారు. అమ్మ లత ఎంబీఏ చేశారు. అన్నయ్య రిషభ్‌ డాక్టర్‌. ఇలాంటి నేపథ్యంలో నుంచి వచ్చిన నాకు సినిమాలపై దృష్టి ఎందుకు ఉంటుంది’’

‘‘మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్న తర్వాత మోడలింగ్‌ చేసే అవకాశాలు వచ్చాయి. అప్పుడే సినిమాల గురించి ఆలోచించాను. అలా తమిళంలో ‘ముగామూడీ’ చేశా. ఆ తర్వాత తెలుగులో ‘ఒక లైలా కోసం’ చేసే అవకాశం వచ్చింది’’

‘‘నేను ఇండస్ట్రీకి వస్తాననగానే అమ్మ వద్దనలేదు. నా చిన్నతనం నుంచి నన్ను నా కన్నా ఎక్కువగా నమ్మింది ఆమే. ప్రతి విషయంలో ఆమె ఎంతో సహకరించేది. ‘నువ్వు ఎప్పుడూ వినయంగా ఉండు. ఈ రంగంలో సక్సెస్‌ నీకు తప్పక వస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్న సంగతి అస్సలు మర్చిపోవద్దు’ అని చెబుతుంది. ఏ విషయంలోనైనా అమ్మే నా స్ఫూర్తి’’

‘‘ఏదో ఒకట్రెండు సినిమాలు చేసి వెనక్కి వెళ్లిపోదామన్న ఉద్దేశంతో ఈ రంగంలోకి రాలేదు. నటిగా నన్ను నేను నిరూపించుకోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చా. నేను ఇలా బిజీగా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతా’’

‘‘మొహంజదారో’ పెద్ద సినిమా అని రెండేళ్లు డేట్లు ఇచ్చా. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోయా. ఆ తర్వాత నేను తీసుకొన్న కొన్ని నిర్ణయాలు తప్పాయి. సినిమా ఫ్లాపయితే ఎవరికైనా బాధగా ఉంటుంది. అందుకు నేనేమీ మినహాయింపు కాదు. అలాంటి సమయంలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేస్తాను’’

‘‘రంగస్థలం’లో ఐటెం సాంగ్‌ చేశానంటే ఆ పాటకున్న ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాట నా కెరీర్‌లో బెస్ట్‌ సాంగ్‌ అన్నపేరు వచ్చింది. అలాంటి పాట మరొకటి ఉంటుందని అనుకోను’’

‘‘ఆర్యోగంగా, ఫిట్‌గా ఉండేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తా. ఇంట్లో ఉన్నా, షూటింగ్‌లో ఉన్నా రోజులో ఓ గంట వ్యాయామం చేస్తా. దేనికైకా బ్రేక్‌ ఇస్తాను కానీ, వ్యాయామానికి ఇవ్వను. అదే ఇంట్లో ఉంటే అదనపు సమయం కేటాయిస్తా. నా దృష్టిలో వర్కవుట్స్‌ అనేవి సన్నబడేందుకో లేదంటే కండలు పెంచేందుకో కాదు. ఫిట్‌గా ఉండేందుకు’’

‘‘కడుపు మాడ్చుకుని డైటింగ్‌ చేయడమంటే నాకు ఇష్టం ఉండదు. కావాల్సిన ఆహారం తింటాను. అయితే, కొవ్వు ఎక్కువగా లేకుండా చూసుకుంటా. దాల్‌ రైస్‌ ఇష్టంగా తింటా. షూటింగ్‌ సమయంలో మిల్క్‌ షేక్స్‌, తాజా పండ్లు తీసుకుంటా. రాత్రి పూట ఏదో ఒక సూప్‌ ఉండాల్సిందే. మధ్యలో డ్రై ఫ్రూట్స్‌ తీసుకుంటుంటా. పిజ్జా కనిపిస్తే నోరు కట్టేసుకుని కూర్చోలేను’’

‘‘సినిమా అంటేనే గ్లామర్‌. దానికి డోస్‌ పెంచడం, తగ్గించడం కూడా ఉంటుందా? అనే అనుమానం ఎప్పుడూ వస్తుంటుంది. సందర్భానుసారంగా కాస్ట్యూమ్స్‌ ఉంటాయే తప్ప అందులో గ్లామర్‌ ఎక్కువ.. తక్కువ ఉండదు. ఈ రంగమే గ్లామర్‌ రంగం’’

‘‘లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసే ఉద్దేశం అస్సలు లేదు. నా ఫేస్‌ కానీ, ఫిజిక్‌ కానీ, సీరియస్‌ పాత్రలకు అస్సలు పనికిరావు. ఎలాంటి టెన్షన్లు పెట్టుకోకుండా సరదా సరదాగా సినిమాలు చేసుకుంటూ పోవడమే నాకు ఇష్టం. నా శక్తికి మించి పాత్రలు చేసి చెడ్డపేరు తెచ్చుకోవడం కన్నా, నాకు సూట్‌ అయ్యే గ్లామర్‌ పాత్రలు చేసుకోవడమే నాకు ఇష్టం’’

‘‘ప్రస్తుతం ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్‌’‌, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చేస్తున్నా. రెండూ భిన్నమైన పాత్రలే’’

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని