పెద్ద సినిమాలు వచ్చేస్తున్నాయి.. మరి చిన్నవి? - V and aakasam nee haddura in amazon prime what is rest of movies position
close
Updated : 26/08/2020 14:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెద్ద సినిమాలు వచ్చేస్తున్నాయి.. మరి చిన్నవి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. వేసవి సందడి అంతా కరోనా పరం అయిపోయింది. చిన్నా, పెద్దా సినిమాలన్న తేడా లేకుండా అన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకెళ్దామా? అన్న దర్శక-నిర్మాతల ఆలోచనను కరోనా బ్రేక్‌ వేసింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు దొరికన ఏకైక మార్గం ఓటీటీ వేదికలు. థియేటర్లు తెరిచే దాకా, సినిమా ఆపితే నిర్మాతలకు ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో పెద్ద సినిమాలు సైతం ఓటీటీ బాటపట్టాయి. సెప్టెంబరులో రెండు పెద్ద సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.

ఆగి.. ఆగి.. సెప్టెంబరులో ‘వి’చ్చేస్తోంది!

అష్టా చమ్మా, జెంటిల్‌మెన్‌తో క్రేజీ కాంబినేషన్‌ అనిపించుకున్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ-నాని. వీరిద్దరూ మరోసారి ‘వి’తో హ్యాట్రిక్‌ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఇందులో నాని ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించినట్లు ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాల్ని బట్టి తెలుస్తోంది. నివేదా థామస్‌, అదితిరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. నిజానికి మార్చి 25న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ కరోనా వైరస్‌ సంక్షోభం వల్ల విడుదల వాయిదా పడింది. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా సెప్టెంబరు 5న స్ట్రీమింగ్‌ కానుంది.

ఆఖర్లో ‘ఆకాశం హద్దుగా’ చెలరేగిపోతానంటున్న సూర్య

తమిళంతో పాటు, తెలుగులోనూ మార్కెట్‌ ఉన్న కథానాయకుడు సూర్య. ఆయన నటించిన ప్రతి చిత్రం ఇక్కడ విడుదలవుతుంది. సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన తమిళ చిత్రం ‘సూరారైపోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ టైటిల్‌ నిర్ణయించారు. ఎయిర్‌డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాను సెప్టెంబరు 30న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల చేయనున్నట్లు సూర్య ప్రకటించారు. మోహన్‌బాబు, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

మరి చిన్న చిత్రాలు ఎందుకు ఆగుతున్నాయి?

‘ఒక్క అవకాశం కోసం’ ఇండస్ట్రీలో ఏళ్ల పాటు వేచి చూసే వాళ్లు ఎందరో. అలాంటి వాళ్లందరి ఆశలపైనా కరోనా రాకాసి నీళ్లు చల్లింది. ‘మహానటి’గా అందరి మన్ననలు పొందిన కథానాయిక కీర్తి సురేశ్‌ నటిస్తున్న సినిమా ‘మిస్‌ ఇండియా’. ఈ చిత్రంతో నరేంద్రనాథ్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కూడా కరోనా కాటుకు బలైంది. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’, రామ్‌ ‘రెడ్‌’, అనుష్క ‘నిశ్శబ్దం’, ప్రదీప్‌ ‘30రోజుల్లో ప్రేమించటం ఎలా’ ఇలా పలు చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. ‘వి’, ‘ఆకాశమే హద్దురా’ వంటి పెద్ద చిత్రాలు ఓటీటీలను ఆశ్రయించినా.. ఈ చిత్రాల దర్శక-నిర్మాతలు మాత్రం థియేటర్‌పైనే మనసు పారేసుకున్నారు. కేంద్రం ఒక్కో నెల నెమ్మదిగా ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో తమకంటూ ఓ రోజు వస్తుందని వేచి చూస్తున్నారు.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. థియేటర్లకు అనుమతి వస్తే, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టం. ఈ నేపథ్యంలో ఒక్కో సినిమా ఒక్కో డెడ్‌లైన్‌ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో క్రేజీ సినిమాలైన ‘సూర్యవంశీ’, ‘83’ కూడా వేసవిని మిస్‌ అయ్యాయి. ఇప్పుడు దీపావళికి గానీ క్రిస్మస్‌కి గానీ విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి ఆ సంస్థ సీఈవో దీనిపై శిభాషిస్‌ సర్కార్‌ స్పందించారు.

‘‘మేము వందశాతం థియేటర్‌లోనే మా చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నాం. అది ఎంతవరకూ సాధ్యమో అంతవరకే ఆగుతాం. అంటే దీపావళి లేదంటే క్రిస్మస్‌ తేదీలను దాటి ఇంక ఆలస్యం చేయలేం. థియేటర్లు తెరవకపోయినా..కరోనా అదుపులోకి రాకపోయినా, కొన్ని రాష్ట్రాలు థియేటర్లు తెరిచి, కొన్ని రాష్ట్రాలు తెరవక.. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తప్పకుండా డిజిటల్‌ వైపు వెళ్లడానికి ఉన్న మార్గాలన్నీ చూస్తున్నాం. వీడియో ఆన్‌ డిమాండ్, పే పర్‌ వ్యూ లేదంటే సగం థియేటర్, సగం పే పర్‌ వ్యూ... ఇలా రకరకాల మార్గాల గురించి ఆలోచిస్తున్నాం. అంతేగానీ ఆ తేదీలను దాటైతే విడుదలను వాయిదా వేయలేం’’ అని చెప్పారు.

ఆ తెలుగు సినిమాలు ఇంకా ఆగుతాయి?

తెలుగు సినిమాలది భిన్నమైన పరిస్థితి.  వేసవిలో రావాల్సిన చాలా సినిమాలన్నీ దాదాపు తక్కువ బడ్జెట్‌లో తీసినవే. బహుశా వేచి చూసిన, వడ్డీ భారం మోద్దామని నిర్మాతలు భావిస్తుండవచ్చు. అయితే అన్ని సినిమాల ఆఫీసులను ఓటీటీ సంస్థలు తలుపుతట్టాయి. లెక్కలు తేలకపోవడంతో ఎవరికి వాళ్లు మౌనంగా ఉంటున్నారు. ‘వి’, ‘ఆకాశమే హద్దురా’ చిత్రాలకు మంచి స్పందన వస్తే, మిగిలిన సినిమాలు కూడా ఓటీటీ బాట పడతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం అన్నింటకీ కాలమే సమాధానం చెబుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని