Corona: ఈ భయాలు వద్దే వద్దు! - be brave dont be panic dont commit suicide
close
Published : 06/05/2021 16:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: ఈ భయాలు వద్దే వద్దు!

అమరావతి: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గడం లేదు. ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరోనా సోకి కొంత మంది చనిపోతుంటే, మహమ్మారికి భయపడి మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. అర్ధాంతరంగా తనువు చాలించి కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుస్తున్నారు. కొవిడ్‌ రోగుల్లో 30 శాతం మంది మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనో ధైర్యంతో కరోనాను జయించవచ్చని వైద్యులు చెబుతున్నారు. కరోనా పాజిటివ్‌ వస్తే జీవితం వృథా అన్న ఆలోచన నుంచి బయటపడాలని సూచిస్తున్నారు.

కృష్ణా జిల్లాలో గత 15రోజుల్లో కరోనా భయంతో నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విజయవాడలో క్వారంటైన్‌లో చికిత్స పొందుతూ ఉన్నట్టుండి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గన్నవరం మండలంలో హరిబాబు అనే వృద్ధుడు కరోనా పరీక్ష చేసుకుంటే వైరస్‌ నిర్ధారణ అవుతుందనే భయంతో చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. విజయవాడకు చెందిన పవన్‌ కుమార్‌కు కరోనా సోకగా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆందోళకు గురై ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనా వచ్చిందని కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా వైరస్‌ వల్ల ఏర్పడ్డ భయం చాలా మంది ప్రాణాలు బలి తీసుకుంది.

కరోనా సోకితే పరిస్థితి ఎలా ఉంటుంది?చికిత్స అందుతుందా? ఒక వేళ మరణం సంభవిస్తుందా? అలా అయితే కుటుంబం ఏమైపోతుంది? అన్న ప్రశ్నలు జనాన్ని వేధిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. కరోనా సోకితే జీవితం వృథా అన్న భావన కరోనా రోగుల్లో ఉంటుందని చెబుతున్నారు. కుంగుబాటుకు లోనవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని విశ్లేషిస్తున్నారు. కరోనా సోకక ముందే మానసికంగా సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరణం ఒక్కటే పరిష్కారం కాదని వైరస్‌ను జయించే మార్గాలపై దృష్టి పెట్టాలంటున్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండాలి. మనోధైర్యంతో ముందుకు వెళ్లాలి. ఆరోగ్య నియమాలు పాటించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. రోజూ వ్యాయామం తప్పని సరిగా చేయాలి. ఇంట్లో ఒంటరిగా ఉన్నామని బాధపడకుండా ఏదో ఒక పని కల్పించుకుని చేయాలి. మిత్రులతో కాసేపు మాట్లాడటం, చాటింగ్‌ చేయడం వంటి పనులు చేయడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. అప్పుడు ఎలాంటి వ్యాధులు వచ్చినా ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మానసిక, శారీరక ఆరోగ్యం చాలా అవసరం. కుటుంబంలోని తమ పిల్లలకు తల్లిదండ్రులు ఆశావహదృక్పథాన్ని కలిగించాలి. దీనివల్ల కుటుంబంలో ధైర్యం ఏర్పడుతుంది. ఇది ఇంటి నుంచే మొదలైతే సమాజంలో మార్పు వస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. 

ఈ సందర్భంగా మానసిక నిపుణులు అయోధ్య మాట్లాడుతూ.. ‘‘రికవరీ అయినవాళ్ల వివరాలు ఎవరికీ తెలియడంలేదు. చనిపోయిన వాళ్ల లెక్కలు చూసి జనాలు భయపడుతున్నారు. మానసిక ఆందోళనకు గురిఅవుతున్నారు. దాంతో విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. వాళ్లకు ప్రతికూల ఆలోచనలు కలగడం వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా గురించి ఎలాంటి భయాలు పెట్టుకోకూడదు. ఒత్తిడికి లోనవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఎంత ధైర్యంగా ఉంటే అంత ధాటిగా కరోనాను ఎదిరించవచ్చు.’’ అని అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని