కొవిడ్‌ వేళ.. పిల్లలు భద్రం  - children care during covid time
close
Published : 01/06/2021 23:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ వేళ.. పిల్లలు భద్రం 

* జాగ్రత్తలు సూచించిన డా.పి.వి రామారావు

మొదటి వేవ్‌తో పోలిస్తే కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో చెలరేగిపోతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వైరస్‌ బారిన పడుతున్నారు. ముందు ముందు మూడో వేవ్‌ కూడా ఉంటుందని, అది ప్రధానంగా పిల్లలపైన ప్రభావం చూపిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన కంటిపాపలైన పిల్లల్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా వచ్చి తగ్గాక కూడా పిల్లల్లో దాని తాలూకు దుష్ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలింది. ఈ విపత్కర పరిస్థితుల్లో వైరస్‌కు చిక్కకుండా పిల్లలను కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

* పిల్లలంటేనే ఉత్సాహానికి ప్రతిరూపాలు. ఎక్కడా ఒకచోట కుదురుగా ఉండరు. ఆడుతూ పాడుతూ ఇంటా బయటా అంతాకలిసి తిరిగేస్తుంటారు. ఇక స్కూల్‌కి వెళ్లే పిల్లలైతే చెప్పాల్సిన పనేలేదు. ఇంటి నుంచి స్కూల్‌కి వెళ్లేటప్పుడు, స్కూల్‌లోనూ గ్రౌండ్‌లోనూ తోటి పిల్లలతో కలిసి మెలసి ఆడుకుంటూ ఉంటారు. స్నేహితులతో కలిసి తిరుగుతుంటారు. ఇవన్నీ వైరస్‌ బారినపడేలా చేసేవే. కరోనా వైరస్‌ ప్రధానంగా నోటి తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మొఖాన్ని తడుముకోవడం, ముక్కులో వేలు పెట్టుకోవడం, కళ్లను రుద్దుకునే అలవాటు ఉన్నవారికి కరోనా సోకే ముప్పు అధికంగా ఉంటుంది. సాధారణంగా పిల్లల్లో ఇలాంటి అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. పదే పదే ముఖాన్ని తడుముకుంటూ ఉంటారు. నోట్లో వేలువేసి చీకుతుంటారు. కళ్లను రుద్దుకుంటూ ఉంటారు. ముక్కులో వేలేసి తిప్పుతూ ఉంటారు. కొంతమంది పిల్లల్లో గోళ్లు కొరికే అలవాటు కూడా ఉంటుంది. చదువుకునేటప్పుడు చంపలపైనా, గొంతుకింద చేతులు పెట్టుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. కరోనా సెకెండ్‌వేవ్‌ ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో పిల్లల్లో ఈ అలవాట్లను సాధ్యమైనంత వరకూ మాన్పించాలి. చదువుకుంటున్నప్పుడు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి.

కరోనా బారినుంచి పిల్లలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశంలోకి తీసుకువెళ్లకూడదు. చేతులు ఎప్పుడూ శుభ్రం చేసుకునేలా ప్రోత్సహించాలి. ఇంట్లో వండి పిల్లలకు వేడివేడిగా వడ్డించండి. చల్లని పదార్థాలు పెట్టకండి. చల్లని పదార్థాల్లో కరోనా వైరస్‌ ఎక్కువ రోజులు ఉంటుంది. గొంతు పొడిగా ఉంటే కరోనా వైరస్‌ వీర విహారం చేస్తుంది. అందుకే తరచూ నీళ్లు తాగిస్తుండాలి.. ఒక గ్లాస్‌ గోరువెచ్చటి నీటిలో చిటికెడు పసుపు వేసి తాగించాలి. ఇది పిల్లలకే కాదు, పెద్దలకీ మేలు చేస్తుంది. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినిపించాలి. ఇంట్లో ఎవరైనా జలుబు, దగ్గుతో బాధ పడుతున్నప్పుడు ఆ వ్యక్తికి దూరంగా పిల్లలని వేరేగదిలో ఉంచాలి. వ్యాధి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే పరీక్షలు చేయించాలి. వైరస్‌ ప్రభావం గరిష్ఠంగా 14 రోజులు ఉంటుంది. అవసరమైన చికిత్స చేయిస్తే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎక్కువ. ఆందోళనకు గురికాకుండా తగిన శ్రద్ధ చూపాలి.

కరోనా సోకిన పిల్లల్లో పెద్దగా ఇబ్బంది ఉండటం లేదు. పిల్లల్లో 102-103 జ్వరం, విరోచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ చికిత్సతో ఈ లక్షణాలు తగ్గిపోతాయి. కంగారు పడకుండా వైద్యుల సూచనలను పాటిస్తూ ఇంటి వద్దే చికిత్స అందించాలి. పిల్లల్లో జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలే ఉండి ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలి. ఆయాసం, వేగంగా శ్వాస తీసుకోవాల్సి రావడం, ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం, వాంతులు విరోచనాలు లాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఆసుపత్రిలో చేర్పించాలి. కొందరిలో వ్యాధి తగ్గిన మూడు లేదా నాలుగు వారాల తర్వాత మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ అనేది కనిపిస్తుంది. ఇలాంటి పిల్లల్లో తీవ్రమైన కడుపునొప్పి ఉంటుంది. కాళ్లు, పొట్ట ఉబ్బుతాయి. ఆహారం తీసుకోలేరు. విరోచనాలు, వాంతులు అవుతుంటాయి. కొంతమంది పిల్లల్లో వేళ్ల సందుల్లో, చేతి కింద నుంచి పొట్టులా రాలుతుంది. జ్వరం 8 రోజుల కంటే ఎక్కువే ఉంటుంది. నాలుక గులాబీ రంగులోకి మారుతుంది. ముందే లక్షణాలు గుర్తించి ఆసుపత్రిలో చేర్పిస్తే తగ్గిపోతుంది. ఆలస్యం చేస్తే కొందరిలో ప్రమాదకరంగా మారుతుంది. కొన్నిసార్లు కరోనా లక్షణాలు లేని పిల్లల్లోనూ ఇలాంటివి కనిపించవచ్చు. అప్పటికే వారికి వైరస్‌ సోకి తగ్గిందని గుర్తించాలి.

అప్పుడే థర్డ్‌ వేవ్‌ను ఆపగలం 
డా.పి.వి రామారావు, చీఫ్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌, ఆంధ్ర హాస్పిటల్స్‌
సెకెండ్‌ వేవ్‌లో వయస్సుతో సంబంధం లేకుండా యువత సైతం 11 నుంచి 30 ఏళ్లవారు కూడా తక్కువ సమయంలో వైరస్‌ బారిన పడుతున్నారు. ఫస్ట్‌వేవ్‌లో పది మంది పిల్లలకి కొవిడ్‌ వస్తే ఒక్కరినే ఆసుపత్రిలో అడ్మిట్‌ చేయాల్సిన అవసరం ఉండేది. మిగలిన వారిని హోం ఐసోలేషన్‌ చేసేవాళ్లం. ఇప్పుడు వచ్చిన మార్పు ఏమిటంటే.. పది మందికి వైరస్‌ సోకితే ఇద్దరు, ముగ్గురిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఉంటుంది. వాళ్లలో కొంత మందికి నిమోనియా, కొంతమందికి చర్మ వ్యాధులు, డయేరియా వస్తుంది. ఈ సారి కనుక థర్డ్‌ వేవ్‌ వస్తే ఎక్కువ మంది పిల్లలు వైరస్‌ బారిన పడతారని అంటున్నారు. ఫస్ట్‌వేవ్‌లో పెద్దలు..ముఖ్యంగా 50ఏళ్లు పైబడిన వారు ఉంటే, సెకెండ్‌వేవ్‌లో యువత ఇరవై, ముప్పై ఏళ్లవారు అధిక సంఖ్యలో వైరస్‌ బారిన పడ్డారు. థర్డ్‌వేవ్‌లో చిన్నారులకు కొవిడ్‌ వచ్చే ముప్పు ఉందంటున్నారు. కాబట్టి ముందు జాగ్రత్తగా మౌలిక వసతులు, వనరులను ఏర్పాటు చేసుకోవాలి. ఐసీయూలు సిద్ధం చేసుకోవాలి. 18ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చాలా త్వరగా పూర్తి చేయాలి. రానున్న రెండు, మూడు నెలల్లో 30 కోట్లమందికి వ్యాక్సిన్‌ వేస్తే 40శాతం జనాభాకి టీకా వేసినట్టు అవుతుంది. కొంతమంది గతంలో ఈ వైరస్‌ బారిన పడ్డారు. కాబట్టి వీరితో పాటు వ్యాక్సినేషన్‌ వారిని కలుపుకుంటే సుమారు 60శాతం పైనే అవుతారు. అప్పుడు హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చి రక్షణ ఉంటుంది. విదేశాలైన అమెరికా, కెనడా, లండన్‌లో.. 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేశారు. అదేవిధంగా మన దగ్గర కూడా ట్రయల్స్‌ జరుగుతున్నాయి. 2 నుంచి 18 ఏళ్ల వారికి  ఫేస్‌-2, ఫేస్‌-3 ట్రయల్స్‌ జరుగుతున్నాయి. అవి కూడా త్వరగా పూర్తయ్యి వ్యాక్సిన్‌ ఇవ్వగలిగితే ఈ థర్డ్‌వేవ్‌ రాకుండా ఆపొచ్చు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని