దశబ్దాల ఈయూ బంధానికి బ్రిటన్‌ గుడ్‌ బై
close
Updated : 01/02/2020 10:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దశబ్దాల ఈయూ బంధానికి బ్రిటన్‌ గుడ్‌ బై

రాత్రి నుంచి అమల్లోకి వచ్చిన బ్రెగ్జిట్‌

లండన్‌: దాదాపు ఐదు దశాబ్దాల బంధానికి స్వస్తిపలుకుతూ ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్‌ శుక్రవారం అధికారికంగా వేరుపడింది. ఈయూ ఏర్పడిన తర్వాత కూటమి నుంచి వైదొలిగిన తొలి దేశంగా బ్రిటన్‌ నిలిచింది. ఈ సందర్భాన్ని ‘నవశకానికి నాంది’గా ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్ అభివర్ణించారు. మరికొంత మంది దీన్ని చేదు అనుభవం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈయూ నుంచి వైదొలగాలని బ్రిటన్‌ నిర్వహించిన రెఫరెండంలో ప్రజలు 2016 లోనే తీర్పు చెప్పినా.. అందుకు సంబంధించిన ఒప్పందం ఖరారు కావడంలో పార్లమెంటులో జాప్యం జరిగింది. మూడు దఫాలు బ్రెగ్జిట్‌ బిల్లు చట్టసభల ముందుకు వచ్చినా.. ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదరకపోవడంతో ప్రతిసారి వీగిపోయింది. ఈ క్రమంలో నాటి ప్రధాని థెరెసా మే రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బోరిస్‌ జాన్సన్‌ అతికష్టం మీద బ్రెగ్జిట్‌ బిల్లుకు జనవరి 10న పార్లమెంటు ఆమోదం లభింపజేసుకోవడంలో సఫలీకృతులయ్యారు.

బ్రెగ్జిట్‌ అనంతరం బోరిస్‌ జాన్సన్‌ ప్రజలకు వీడియో సందేశం పంపారు. తాజా పరిణామంతో బ్రిటన్‌ చరిత్రలో కొత్త శకం ప్రారంభం కాబోతోందని వ్యాఖ్యానించారు. దేశ మార్పునకు, పునరుజ్జీవనానికి ఈ పరిణామం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అయితే నిబంధనల ప్రకారం ఈయూ నుంచి పూర్తిస్థాయిలో వేరుపడే ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమవుతుంది. అందులోభాగంగా ఇప్పటి వరకు ఈయూ సభ్యదేశాలతో కుదిరిన ఒప్పందాలను రద్దు చేసుకోవడమో లేక తిరగరాసుకోవడమో చేయాలి. దీనికి సుదీర్ఘ చర్చలు, మంతనాలు అవసరం ఉంటాయి. కావున సాంకేతికంగా పూర్తి స్థాయిలో ఈయూ నుంచి బ్రిటన్‌ వేరుపడడానికి మరో 11 నెలల సమయం ఉంది. దీన్ని ‘ట్రాన్సిషన్‌ పిరియడ్‌’గా వ్యవహరించనున్నారు.

ఎందుకు బ్రెగ్జిట్‌...

ఐరోపా ఖండంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. బ్రిటన్‌ చరిత్ర ప్రత్యేకమైంది. ఈయూ నుంచి బయటకు వచ్చేసి స్వతంత్ర దేశంగా కొనసాగాలన్నది బ్రిటన్ ఆలోచన. ఈయూలో కొనసాగడం వల్ల బ్రిటన్‌కు పొరుగు దేశాల నుంచి వలసలు పెరిగి, ఆ దేశంలోని ప్రజలకు అవకాశాలు తగ్గిపోతున్నాయన్నది బ్రెగ్జిట్‌ మద్దతుదారుల వాదన. బ్రిటన్‌ ప్రస్తుత జనాభాలో సుమారు 21.5 లక్షల మంది వలసలుదారులేనని లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, బ్రిటన్‌లో పుట్టి పెరిగిన వారి వేతనాల వృద్ధిలో స్తబ్ధత నెలకొనడం, స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గడం, ఆర్థికవృద్ధి రేటు పడిపోవడం వంటి కారణాల దృష్ట్యా బ్రిటన్ ఈయూ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుంది. దీంతో తమ దేశంలోకి వచ్చే వలసలు తగ్గి, స్వదేశీయుల జీవనప్రమాణాలు మెరుగవుతాయన్నది బ్రిటన్ల అభిప్రాయం. బ్రెగ్జిట్‌కు అక్కడి ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి కూడా మద్దతు ఉంది. 

ఏం మారబోతోంది...

తక్షణం పెద్ద మార్పులేమీ ఉండవు. ట్రాన్సిషన్‌ పిరియడ్‌ ముగిసే వరకు ఈయూ నిబంధనల్ని బ్రిటన్‌ పాటించాల్సి ఉంటుంది. సమాఖ్య బడ్జెట్‌కు తమ వంతు సహకారాన్ని కొనసాగిస్తుంది. అయితే ఈయూ సదస్సులకు బ్రిటన్‌ సభ్యులు మాత్రం హాజరుకారు. తాజా మార్పును సూచిస్తూ.. బ్రిటన్ 50 పెన్స్‌ల కొత్త నాణేన్ని మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఇవి శనివారం నుంచే చలామణిలోకి రానున్నాయి. ట్రాన్సిషన్‌ పిరియడ్‌లో ఈయూ సభ్య దేశాలతో బ్రిటన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చు. అవి ట్రాన్సిషన్‌ పిరియడ్‌ ముగిసిన నాటి నుంచి అమలులోకి వస్తాయి. ఇక ఇప్పటి వరకు గోధుమ వర్ణంలో ఉన్న పాస్‌పోర్టులు తిరిగి నీలి రంగులోకి మారనున్నాయి. రానున్న ఆరు నెలల కాలంలో ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్రాన్సిషన్‌ పిరియడ్‌ ముగిసిన తర్వాత ఐరోపాలోని ఇతర దేశాల పౌరులు యూకేలోకి రావాలంటే ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఇప్పటివరకు స్వేచ్ఛగా జరిగిన రాకపోకలు కఠినతరం కానున్నాయి. అలాగే ఉద్యోగాలు పొందాలన్నా బ్రిటన్‌ విధించిన అర్హతలను కలిగి ఉండాలి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని